కర్నూలు: వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సుకు ఫిట్‌నెస్ బాగుందని రాష్ట్ర మంత్రి ఎలా ధ్రువీకరిస్తారని కర్నూలు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటన స్థలాన్ని వైయస్ఆర్‌సీపీ నాయకులు శుక్రవారం పరిశీలించారు. ఈ ఘటన పట్ల ఎస్వీ మోహన్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. అనంతరం కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బస్సు ప్రమాద క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. వేమూరి కావేరి బస్సు యాజమాన్యంపై ఎస్వీ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. బస్సు మీద 17 చెలానాలు పెండింగ్‌లో ఉన్నాయని, అయినా ఈ బస్సు యధేచ్చగా రోడ్డు మీదికి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రి బస్సు ఫిటినెస్ బాగుంది అని ఎలా చెబుతారని తప్పుపట్టారు. బస్సు యాజమాన్యం తో టీడీపీ కి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ప్రమాదంలో మరణించిన కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఎస్వీ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.