కొత్త మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజాగ్రహం

కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతం

మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ స్పష్టీకరణ

విజయనగరం వైయస్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ.

ఈనెల 18న గవర్నర్‌తో  వైయస్‌ జగన్‌ భేటీ

ప్రజా ఉద్యమం, కోటి సంతాకాలపై గవర్నర్‌కు నివేదన

రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల సమర్పణ

ప్రెస్‌మీట్‌లో బొత్స సత్యనారాయణ వెల్లడి

విజయనగరం:  చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా కార్పోరేట్‌ సంస్థలకు మేలు చేసే కార్యక్రమాలు తప్ప ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు ఎప్పుడూ చేయలేదని, ఇప్పుడు కూడా కొత్త మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణతో అదే పని చేస్తున్నారని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు. పేద విద్యార్థులకు కూడా వైద్య విద్యను చేరువ చేయడంతో పాటు, ప్రతి జిల్లాలో సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలందించే లక్ష్యంతో గత ప్రభుత్వ హయాంలో సీఎం శ్రీ వైయస్‌ జగన్, ప్రతి జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ చొప్పున ఒకేసారి 17 మెడికల్‌ కాలేజీల నిర్మాణం మొదలుపెట్టి, వాటిలో ఏడింటిని పూర్తి చేశారని ఆయన గుర్తు చేశారు. 5 కాలేజీల్లో అడ్మిషన్లు కూడా మొదలయ్యాయన్న ఆయన, వాటితో సహా మొత్తం 10 కొత్త మెడికల్‌ కాలేజీలను టీడీపీ కూటమి ప్రభుత్వం పీపీపీ పేరుతో ప్రైవేటుపరం చేస్తోందని దుయ్యబట్టారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వైయస్సార్‌సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమానికి విశేష స్పందన లభించిందని, కోటి సంతకాల కార్యక్రమానికి కూడా పెద్ద ఎత్తున ప్రజలు  తరలి వచ్చారని చెప్పారు. ఈనెల 18న గవర్నర్‌ను కలుస్తున్న శ్రీ వైయస్‌ జగన్, వాటన్నింటినీ సమర్పిస్తారని విజయనగరంలో మీడియాతో మాట్లాడిన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ వెల్లడించారు.
ప్రెస్‌మీట్‌లో మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ఇంకా ఏం మాట్లాడారంటే..:

ప్రైవేటు యాజమాన్యంలో అలా సేవలందుతాయా?:
    ఒక సామాన్యుడు విశాఖలోని కేజీహెచ్‌కు వెళ్తే, అక్కడ ఎలాంటి వైద్య సేవలు అందుతాయో.. అదే నిరుపేద పక్కనే ఉన్న గీతం, లేదా మరే ఇతర ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తే, అవే వైద్య సేవలు ఉచితంగా అందుతాయా?. అదే ప్రభుత్వం, ప్రైవేటుకు మధ్య ఉన్న తేడా. సామాన్యులకు కూడా చేరువలో సూపర్‌స్పెషాలిటీ వైద్య సేవలందేలా జగన్‌గారు కొత్త మెడికల్‌ కాలేజీలు కడితే, ఇప్పుడు సీఎం చంద్రబాబు పీపీపీ పేరుతో వాటిని ప్రైవేటీకరిస్తున్నారు. ఇది అత్యంత దారుణం. హేయం. చంద్రబాబుగారూ, ఇకనైనా దయచేసి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఆపండి. భగవంతుడు మీకు ఒకసారి అవకాశం ఇచ్చాడు. మీకు ఓటేసిన పాపానికి పేద ప్రజలు, సామాన్యులు ఇబ్బందులు పడే పరిస్ధితి తీసుకురావడం న్యాయమా?. మళ్లీ చెబుతున్నాం. మేం తిరిగి అధికారంలోకి రాగానే, మెడికల్‌ కాలేజీల పీపీపీని రద్దు చేస్తాం. 
    ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను ప్రైవైటీకరిస్తే, వారు కనీసం 30 శాతం వైద్యం కచ్చితంగా ఉచితంగా అందిస్తారా? గీతం, ఎన్నారై వంటి ఆస్పత్రులు ఉచితంగా వైద్యం అందిస్తాయా?.

మీడియా ప్రశ్నలకు బదులిస్తూ..:
    కొత్త మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్సార్‌సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమం, కోటి సంతకాల కార్యక్రమానికి ప్రజల్లో విశేష స్పందన కనిపించింది. ప్రజలు స్వచ్చందంగా తరలివచ్చి కోటి సంతకాలు పెట్టారు. సాధారణంగా ఓ ప్రభుత్వ కళాశాల రావాలంటే 5 నుంచి 7 సంవత్సరాలు పడుతుంది. కానీ మేం మూడేళ్లలోనే తీసుకొచ్చాం. మంగళగిరిలో ఎయిమ్స్‌ పనులు, పదేళ్లయినా ఇంకా సాగుతున్నాయి.     విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయం కూడా పూర్తిగా అసమంజసం. స్టీల్‌ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించకపోవడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరిగింది. నష్టాలు సాకుగా చూపి, సంస్థను అమ్మేయాలని చూస్తున్నారు. ఎందరో త్యాగాల వల్ల విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటైంది. కాబట్టి, స్టీల్‌ప్లాంట్‌పై కేంద్రం తన నిర్ణయం మార్చుకునేలా ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం చొరవ చూపాలి.
    ఇండిగో సంక్షోభానికి కేంద్ర మంత్రి బాధ్యుడు. సమస్య తీవ్రత గుర్తించడంలోనూ, ఆ తర్వాత పరిష్కారంలోనూ ఆయన పూర్తిగా విఫలమయ్యాడు. కేంద్ర పౌర విమానయాన  శాఖ చేసిన గందరగోళం వల్ల వందలాది ఇండిగో విమాన సర్వీసులు రద్దు కాగా, వేలాది ప్రయాణికులు నరకం చూశారని మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు.

Back to Top