తాడేపల్లి: కూటమి ప్రభుత్వ పాలనలో సూపర్ సిక్స్.. సూపర్ ఫ్లాప్ అని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు అబద్ధాలు, మోసాలతో కాలం వెళ్లదీస్తున్నారని, ఆయన పాలనలో జరిగిన గొప్పేంటో చెప్పుకోలేని నిస్సహాయ స్థితిలో ముఖ్యమంత్రి ఉన్నారని విమర్శించారు. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పే వ్యక్తి చంద్రబాబు అని సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన అడ్వరై్టజ్‌మెంట్, ఇది ఏ లెవల్ మోసమో.. వాళ్ల అనుకూల మీడియాలో వచ్చిన అడ్వైర్‌టైజ్‌మెంట్లను ఆయన మీడియా సమావేశంలో చూపిస్తూ ఈ 18 నెలల కూటమి పాలనా వైఫల్యాలను సతీష్‌రెడ్డి ఎండగట్టారు. చంద్రబాబు ఎప్పుడు మీడియాతో మాట్లాడినా, జగన్‌గారిని నిందించడం తప్ప ఏమీ మాట్లాడరని, ఎందుకంటే, ఆయనకు చెప్పుకోవడానికి ఏమీ లేదని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ప్రెస్‌మీట్‌లో సతీష్‌కుమార్ రెడ్డి ఏమన్నారంటే.. ఈ 18 నెలల్లో ప్రజలు సంతోషంగా ఉన్నారా? చంద్రబాబు ప్రెస్‌మీట్లు పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తుంటారు. పెద్ద పెద్ద లెక్కలు చెబుతున్నాడు. ప్రజలు ఈ 18 నెలలు సంతోషంగా ఉన్నారా? లేదా అన్నది ఆలోచన చేయాలి. నీ ఇష్టం వచ్చిన ఏ అంగడికైనా వెళ్దాం. సగానికి సగం అమ్మకాలు తగ్గాయి. జీడీపీ పెరిగి రాష్ట్రంలో సమూల మార్పు తెస్తే ఆదాయం పెరగాలి కదా?. నోరు తెరిస్తే చాలు ఖజానా ఖాళీ అంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా సరే తోపుడు బండి, కిరణాకొట్టు వద్దకు వెళ్దాం. ఆదాయం పెరిగిందా? లేదా అని వారినే నేరుగా అడుగుదాం.ఎలాంటి సమాధానం చెబుతారో చూద్దామా? ఎన్నికల హామీలు ఏమయ్యాయి?: 2024 మే 9న సూపర్ సిక్స్ అంటూ గొప్పగా పేపర్లకు అడ్వైర్‌టైజ్‌మెంట్లు ఇచ్చారు. సూపర్ సిక్స్‌లో మొదటి హామీ.. యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి అంటూ చంద్రబాబు ఇచ్చిన హామీ అమలు చేయకుండా మోసం చేశాడు. 18 నెలల్లో ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా? రైతుకు ప్రతి ఏడాది రూ.20,000 పెట్టుబడి సాయం ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి..రెండేళ్లలో రావాల్సిన రూ.30,000లో కేవలం రూ.10,000 మాత్రమే ఇచ్చారు. చాలా మంది రైతులకు నిబంధనల పేరుతో కోతలు పెట్టాడు. తిరిగి అప్లికేషన్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఇస్తానన్న హామీ కూడా అక్షరాలా గాలిలో కలిసి పోయింది. ఈ పథకం ఎక్కడా అమలు కాకపోయినా, ప్రజల ముందు వచ్చి ‘సూపర్ సిక్స్ సూపర్ హిట్’ అని చెప్పడం సిగ్గుచేటు. ప్రతి ఏటా మూడు ఉచిత సిలిండర్లు ఇస్తానని చెప్పి ఒక్కటి మాత్రమే కొంత మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఎన్ని సిలిండర్లు ఇచ్చారో ఈ ప్రభుత్వం డేటా కూడా వెల్లడించలేకపోతోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పేరుతో ప్రభుత్వం ఆర్‌టీసీకి ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం తీవ్ర అన్యాయం. వేలాది మహిళలు ప్రయాణిస్తున్నా, ఒక్క బస్సు కూడా అదనంగా పెట్టలేదు, ఇదేనా సంక్షేమం. రైతుల పరిస్థితి దారుణం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేదు. వైయస్ జగన్ ప్రభుత్వం ఇచ్చినట్టు బత్తాయి, అరటి, ఉల్లి, టమాట వంటి పంటలకు మద్దతు ధరలు ఇచ్చే ధైర్యం చంద్రబాబుకు లేదా? ఈ రోజు ఏ పంటకూ గిట్టుబాటు ధర లేకపోవడం, మార్కెట్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా?. పరకామణి కేసు.. తిరుపతి లడ్డూ వివాదంపై స్పందిస్తూ .. పరకామణి కేసులో రవికుమార్ అనే వ్యక్తి చిన్న జీఆర్ సంస్థలో సూపర్‌వైజర్‌గా పనిచేసే సమయంలో కొన్నిసార్లు నోట్లను తస్కరించినట్లు గుర్తించారు. వైయస్ జగన్ ప్రభుత్వంలో ఆయనను పట్టుకుని విచారించగా, రవికుమార్ తన తప్పును ఒప్పుకొని ప్రాయశ్చితంగా తన ఆస్తులను టీటీడీకి అప్పగించాడు. ఇంకా చంద్రబాబు నోరు తెరిస్తే చాలు తిరుపతి లడ్డూ కల్తీ విషయాన్ని ముందుకు తీసుకువస్తున్నారు. లడ్డూ విషయంలో విమర్శలు చేసే ముందు, టీటీడీకి సంబందించిన పద్ధతులు, టెండర్ ప్రక్రియలు, నిబంధనలు చూసుకోవాలి. టెండర్ ద్వారా క్వాలిటీని నిర్థారించాల్సి ఉంటుంది. నాణ్యతను పరీక్షించడం, ల్యాబ్ టెస్ట్ చేయడం వంటి బాధ్యతలు ల్యాబొరేటరీ, సంబంధిత అధికారులు మీదే ఉంటాయి. ముఖ్యమంత్రికి ఏం సంబంధం ఉంటుంది. ఈ విషయంలో ఎవరైనా తప్పు చేస్తే భగవంతుడు తగిన శిక్షిస్తారు. ఒక్క చెక్ డ్యామ్ అయినా కట్టావా?: రాష్ట్రంలో భూగర్భజలాలు గతంలో 7 మీటర్ల లోపలే ఉండేవి. ఇప్పుడు 6 మీటర్లకే నీళ్లు వస్తున్నాయని చంద్రబాబు గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఇందులో నీ ఘనత ఏమిటో ఓసారి చెప్పు బాబూ! 2024లో సీఎం అయ్యాక వాటర్ కన్జర్వేషన్ కోసం ఒక్క చెక్‌డ్యామ్ అయినా కట్టావా? ఏ పనీ చెయ్యకుండా ‘‘గొప్పంతా నాదిం దిబ్బంతా అవతలి వ్యక్తిదే’’ అన్నట్టుగా నీ భజన నీవే చేసుకుంటున్నావు. వాన కురిపించినది భగవంతుడుం కాని క్రెడిట్ మాత్రం చంద్రబాబుకే అంట! ఇంతకంటే పెద్ద కామెడీ ఏం కావాలి? పీపీఏలపై అసత్యాలు: పవర్ పర్చేస్ అగ్రిమెంట్ల గురించి చంద్రబాబు అసత్యాలు చెబుతున్నాడు. వైయస్ జగన్ తన పాలనలో రైతులకు భారం పడకూడదు అని యూనిట్ విద్యుత్‌ను రూ.2.49కి సెకీతో ఒప్పందాలు చేసుకుంటే అప్పట్లో ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే అదే పవర్‌ను యూనిట్‌కు రూ. 3.20కు కొనుగోలు చేసింది నిజం కాదా?. చంద్రబాబు హయాంలోనే డ్రాపౌట్స్ పెరిగాయి: స్కూల్‌కు వెళ్లే పిల్లలు ఎంత మంది ఉన్నారని చెప్పేందుకు యూడైస్ వెబ్‌సైట్ ఉంటుంది. ఈ లెక్కల ప్రకారం 2018–2019లో 38,97,043 మంది పిల్లలు ఉండేవారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి స్కూల్ విద్యార్థుల సంఖ్య 40,59,116 మంది ఉన్నారు. ఈ రోజు 36.43 లక్షల మంది మాత్రమే ఉన్నారు. అంటే ఎవరి హయాంలో డ్రాపౌట్స్ ఉన్నారు చంద్రబాబు. ఆ నెపాన్ని వైయస్ జగన్‌పై నెట్టాలను చూడటం సిగ్గుచేటు. ఇకనైనా చంద్రబాబు లెంపలేసుకొని తప్పు ఒప్పుకో. నీ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు అవతలి వ్యక్తుల మీద నింద వేయడం సరైంది కాదు. సనాతని ఎక్కడ దాక్కున్నాడు? తిరుపతి లడ్డూ అపవిత్రమైందంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ రోజు తిరుమల మెట్లు కడిగాడు. అప్పుడు ఆ పవిత్రత, సనాతనం అంతా ఆయనకు గుర్తొచ్చాయి!. కానీ ఇప్పుడు విశాఖలో 1.80 లక్షల కేజీల గోమాంసం దొరికింది. ఇప్పుడు పవన్ నోరు ఎందుకు మెదపడం లేదు? ‘‘సనాతన రక్షకుడు’’ అప్పుడేనా? ఇప్పుడు కాదా? పవన్ ద్వంద్వ వైఖరి చిన్నపిల్లాడికే కూడా అర్థమైపోయింది. జయచంద్రారెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదు?: రాష్ట్రంలో కలకలం రేపిన డూప్లికేట్ లిక్కర్ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన తంబళ్లపల్లె నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్ జయచంద్రారెడ్డిని ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదు?. కానీ ఆ కేసుతో ఏ మాత్రం సంబంధం లేకపోయినా, వైయస్సార్‌సీపీకి చెందిన బీసీ నాయకుడు జోగి రమేష్‌ను మాత్రం అన్యాయంగా అరెస్టు చేసి జైలుకు పంపారని ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి ఆక్షేపించారు.