ఉద్యోగులను రోడ్డున పడవేసిన ప్రభుత్వం

1వ తేదీన జీతాలు అనేది పూర్తిగా మాయం

నలమారు చంద్రశేఖర్‌రెడ్డి ధ్వజం  

హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ ఎంప్లాయిస్‌ అండ్‌ పెన్షనర్స్‌ వింగ్‌ రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్‌రెడ్డి.

ప్రభుత్వ ఉద్యోగులకు 1న వేతనాలు కలగా మారిన వైనం

ఏడాదిన్నర కూటమి పాలనలో ఒకే ఒక్క నెల 1న వేతనాలు 

ఇప్పుడు 10వ తేదీ వచ్చినా, లక్ష మంది ఉద్యోగులకు లేని జీతం

కానీ, అన్నీ ఇచ్చినట్లు బహిరంగ సభల్లో ఆర్భాటంగా ప్రకటనలు

ప్రభుత్వ తీరుపై ప్రెస్‌మీట్‌లో ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి ఆక్షేపణ

హైదరాబాద్‌:    ప్రతి నెలా 1న వేతనాలు చెల్లించకుండా టీడీపీ కూటమి ప్రభుత్వం ఉద్యోగుల బతుకుల్ని రోడ్డున పడేసి వారి జీవితాలతో చెలగాటం ఆడుకుంటోందని వైయ‌స్ఆర్‌సీపీ ఎంప్లాయీస్‌ అండ్‌ పెన్షనర్స్‌ వింగ్‌ రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. పదో తేదీ వస్తున్నా చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు జమ కాలేదని ఆయన వెల్లడించారు. ఆ విధంగా టీడీపీ కూటమి ప్రభుత్వం ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని, హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి ఆక్షేపించారు.
    అధికారంలోకి వస్తే ఉద్యోగులకు ప్రతినెలా 1వ తేదీన వేతనాలు జమ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు, ఒక్క నెలకే దానికి నీళ్లొదిలేశారని, ఆ తర్వాత ఏ నెల కూడా 1న జీతాలు చెల్లించలేదని ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు. ఇప్పుడు కూడా దాదాపు లక్ష మంది ఉద్యోగులకు నవంబరు నెల వేతనాలు జమ కాలేదని తెలిపారు. కానీ ఉద్యోగులకు అన్నీ ఇచ్చినట్లు, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసినట్లు బహిరంగ సభల్లో మాత్రం గొప్పగా చెప్పుకుంటున్నారని, ఇది అత్యంత హేయమని దుయ్యబట్టారు. అధికారంలోకి వస్తూనే ఉద్యోగులకు మధ్యంతర భృతి (ఐఆర్‌) ఇస్తామని చెప్పి, 18 నెలలు గడిచినా ఆ మాట నిలబెట్టుకోలేదని గుర్తు చేశారు. ఇంకా ఇప్పటికీ పీఆర్‌సీ ఛైర్మన్‌ను కూడా నియమించలేదని చెప్పారు. మరోవైపు 5 డీఏలు పెండింగ్‌లో ఉండగా, కేవలం ఒక్క డీఏతో సరిపెట్టారని, ఉద్యోగులకు వివిధ రూపాల్లో ప్రభుత్వం ఏకంగా రూ.32 వేల కోట్లు బకాయి పడిందని ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి వివరించారు.

Back to Top