నాపై చేసిన దాడికి తగిన మూల్యం చెల్లించక తప్పదు

 మాజీ మంత్రి అంబటి  రాంబాబు హెచ్చ‌రిక‌

విశాఖలో కాపు నేతల బ్రేక్‌ ఫాస్ట్‌ మీటింగ్‌ 

విశాఖపట్నం: తన ఇంటిపై దాడిని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ మానిటర్‌ చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. పోలీసుల సాక్షిగా తన ఇంటిపై దాడి జరిగిందన్నారు. కులాలను రెచ్చగొట్టి ఏం సాధించాలనుకుంటున్నారు? అని ప్రశ్నించారు. భగవంతుడి దయ వల్ల తనను చంపలేదు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.  నాపై చేసిన దాడికి తగిన మూల్యం చెల్లించక తప్పదని ఆయ‌న హెచ్చ‌రించారు. విశాఖలో కాపు నేతల బ్రేక్‌ ఫాస్ట్‌ మీటింగ్‌ జరిగింది. విశాఖలోని కరణం ధర్మశ్రీ నివాసంలో విశాఖ కాపు నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఇటీవల పరిణామాలపై కాపు నేతలు చర్చించారు. అలాగే, కూటమి ప్రభుత్వ అక్రమ కేసులు, అరెస్ట్‌లపై కాపు నేతలు చర్చించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌, మాజీ ఎమ్మెల్యేలు, ఉమ్మడి విశాఖ జిల్లా కాపు నేతలు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ..‘టీడీపీకి చెందిన వారు నా ఇంటిపైకి వచ్చారు.. కులం పేరుతో దూషించారు. కులాలను రెచ్చగొట్టి ఏం సాధించాలనుకుంటున్నారు?. గుంటూరు నడి బొడ్డున నా ఇంటిపై దాడి చేశారు. నా ఇంటిపై దాడిని టీవీ చానెల్స్‌ లైవ్‌ ఇస్తున్నా ప్రభుత్వం తెలియనట్టుగా ఉంది. భగవంతుడి దయ వల్ల నన్ను చంపలేదు. రెడ్‌బుక్‌ను మా కుక్క లెక్కచేయదంటే లోకేష్‌కు కోపం వచ్చిందేమో. నేను సెంటర్ జైల్లో ఉన్నప్పుడు నా మీద ఎంతో ప్రేమ అభిమానం చూపించారు. ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు తరలి వచ్చారు. నా కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. నాపై దాడి చేసి అక్రమంగా జైలుకు పంపారు. నన్ను 18 రోజులు అక్రమంగా జైల్లో పెట్టారు. నాపై జరిగిన దాడి ఒక కులంపై మరొక కులం చేసిన దాడిగా భావించాలి. చరిత్రలో ఎన్నడు ఎప్పుడు జరగని దాడి నాపై జరిగింది. టీడీపీ గుండాలకు  అలుపు వచ్చే వరకు దాడి చేశారు. సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 12 గంటలకు దాడి జరిగింది. చంద్రబాబు పతనం ప్రారంభమైంది. నాపై చేసిన దాడికి తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నాను. ఎర్రబుక్కులు, పిచ్చిబుక్కులు మమ్మల్ని ఏమీ చేయలేవు.

కులాలను రెచ్చగొట్టే రాజకీయం చేస్తున్నారు. టీడీపీ గూండాలు వంగవీటి రంగాను దారుణంగా చంపారు. పోలీసులు సహకారంతో రంగాను హత్య చేశారు. అదేవిధంగా పోలీసులను అడ్డం పెట్టుకొని నాపై దాడి చేశారు. కాపులను బీసీల్లో చేర్చుతామని హామీ ఇచ్చారు. చంద్రబాబు ఇచ్చిన హామీ కోసం ముద్రగడ ఉద్యమం చేశారు. కాపుల కోసం ఉద్యమం  చేసిన ముద్రగడను జైల్లో పెట్టారు, చంపాలని చూశారు. పవన్ కళ్యాణ్ కూటమిలో ఉన్నాడు కాబట్టి కాపులు మా వైపు ఉన్నారనుకుంటే అది మీ భ్రమ’ అంటూ వ్యాఖ్యలు చేశారు. 

Back to Top