అమరావతి: అత్యంత కళంకిత వ్యక్తి బీఆర్ నాయుడిని వెంటనే టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు. గురువారం ఆమె మీడియా పాయింట్ వద్ద బీఆర్ నాయుడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడుకు హిందువుల పట్ల నిజంగా గౌరవం ఉంటే బీఆర్ నాయుడిని వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానాలు చైర్మన్ పదవి నుంచి తప్పించాలని వరుదు కళ్యాణి అన్నారు. బీఆర్ నాయుడు చాలా నీచంగా మాట్లాడుతున్నారని, భగవద్గీత పట్ల గౌరవం లేని వ్యక్తి టీటీడీ చైర్మన్‌గా కొనసాగడం అనర్హమని విమర్శించారు. వ్యాపార ప్రయోజనాలే ముఖ్యమైతే వెంటనే పదవికి రాజీనామా చేయాలని ఆమె సూచించారు. బీఆర్ నాయుడిని చైర్మన్‌గా నియమించిన తరువాతే తిరుమలలో అపచారాలు పెరిగాయని, లడ్డూ కల్తీ ప్రచారంతో కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆమె ఆరోపించారు. సనాతన ధర్మం పరిరక్షణ గురించి మాట్లాడే హక్కు ఈ నేతలకు లేదని వ్యాఖ్యానించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన ఘటనలో భక్తుల మరణాలకు బాధ్యత వహించాలని, గోశాలలో గోవులు చనిపోవడంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సామాన్య భక్తులను నిర్లక్ష్యం చేసి సెలబ్రిటీలకు మాత్రం ప్రత్యేక దర్శనాలు కల్పిస్తున్నారని ఆరోపించారు. టీడీపీని “టెంపుల్ డెమాలిష్ పార్టీ”గా అభివర్ణిస్తూ, హిందూ మనోభావాలను దెబ్బతీసిన విధానాలపై ప్రజలకు సమాధానం చెప్పాలని తెలుగుదేశం పార్టీ నేతలను వరుదు కళ్యాణి నిలదీశారు.