తాడేపల్లి: చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం ఏపీ చేసుకున్న దురదృష్టమని అన్నారు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్. ఏపీకి రాజధాని లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. మావిగన్ అంటే బాబుకు గుండె ఆగిపోయేలా ఉంది. చంద్రబాబు నిర్ణయాలతో భవిష్యత్‌లో కూడా రాజధాని లేకుండా చేస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు కారణంగా ఏపీ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఇచ్చిన హామీలకు వెన్నుపోటు పొడిచారు. అమరావతిలో రోడ్లు, నీరు, డ్రైనేజీ, మౌలిక సదుపాయాలకే రూ.2లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. ఆచరణ సాధ్యం కాదని తెలిసినా అమరావతిపై ముందుకు వెళ్తున్నారు. స్కామ్‌ల కోసమే చంద్రబాబు ముందుకెళ్తున్నారు. ఇప్పటికే అమరావతికి రూ.47,387 కోట్లు అప్పు చేశారు. ఖజానా నుంచి రూ.9200 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. స్కామ్‌ల కోసం రాష్ట్ర ప్రజల వెన్ను విరుస్తున్నారు. ప్రశ్నిస్తే చంద్రబాబుకు బీపీ పెరుగుతోంది. రాష్ట్రానికి రాజధాని ఉండాలనే మావిగన్‌ను ప్రతిపాదించాం. రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా మావిగన్‌ను ప్రత్యామ్నాయంగా చూపించాం. అమరావతి అయితే జీరో నుంచి మొదలుపెట్టాలి. చంద్రబాబు స్కామ్‌ల కోసం ఏపీని ఇబ్బంది పెడుతున్నారు. ప్రజలకు కూడా మావిగన్‌కు మద్దతు పలికారు. అది తట్టుకోలేక చంద్రబాబు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మంత్రులతో కూడా బూతులు మాట్లాడిస్తున్నారు. రూ.1200 కోట్లతో అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ ఉన్నా మళ్లీ అన్నీ కొత్తగా కడతానంటున్నారు. కొత్తగా నిర్మిస్తున్న 5 బిల్డింగ్‌ల నిర్మాణం పేరుతో చంద్రబాబు దోపిడీ చూస్తే ప్రజలు నివ్వెరపోతున్నారు. భవన డిజైన్లకే రూ.401 కోట్లు. ఈ ఐదు బిల్డింగులకు అయ్యే మొత్తం ఖర్చు రూ. 10,665 కోట్లు.. అంటే ప్రస్తుతం చదరపు అడుగుకు రూ.20,427?. వాటి ఫర్నీచర్, ఇంటీరియర్ ఇంకా అదనపు ఖర్చులన్నమాట.. అంటే చదరపు అడుగుకు రూ.30 వేలు దాటుతుందన్నమాట. మళ్లీ ఇవే నిర్మాణాలకు కొత్త టెండర్లు పిలిచారు.. కానీ, పాత వాళ్లకే ఇచ్చారు. ఫైవ్‌స్టార్ హోటల్స్‌కు కూడా చదరపు అడుగు రూ.4,500 లోపే!. తెలంగాణలో రూ.615 కోట్లతో కేసీఆర్ సచివాలయం కట్టారు. మన సెక్రటేరియట్‌కు మాత్రం ఇంత ఖర్చా? ఎందుకు?. కొత్త అసెంబ్లీ, కొత్త హైకోర్టు అంటూ మళ్లీ భారీగా ఖర్చు చేయబోతున్నారు. ఇదంతా విచ్చలవిడిగా చేస్తున్న దోపిడీనే’ అని తెలిపారు. జంగిల్ రాజ్‌గా రాష్ట్రం.. ప్రజల బాగోగులను చంద్రబాబు గాలికి వదిలేశారు. రాష్ట్రాన్ని జంగిల్ రాజ్‌గా మార్చేశారు. ఎవరైనా ప్రశ్నిస్తే కేసులతో అణగదొక్కుతున్నారు. రెండేళ్లలో ఏం మంచి చేశారో చంద్రబాబు చెప్పాలి. ఈ రెండేళ్లలో బాబు ప్రొగ్రెస్ ఒక్కటే.. ‘‘చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ’’. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి, దోపిడీ జరుగుతోంది. చంద్రబాబు మాత్రం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. తప్పులను ప్రశ్నిస్తే ఆయనకు బీపీ పెరుగుతోంది’ అని వ్యాఖ్యానించారు. బాబు.. ఎవరిది గొడ్డలి పార్టీ, ఎవరివి హత్యా రాజకీయాలు? ఏపీలో ఎవరిది గొడ్డలి పార్టీ.. ఎవరిది గన్ కల్చర్?. ఎవరివి హత్యా రాజకీయాలని చంద్రబాబును వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. శవ రాజకీయాలు.. హత్యా రాజకీయాలపై చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజారెడ్డిని చంపింది టీడీపీ వాళ్లు కాదా?. వైఎస్సార్ విషయంలో ఏం జరిగిందో అసెంబ్లీలో క్లిప్పింగ్‌లు చూడాలని వైఎస్ జగన్ తెలిపారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్సార్‌సీపీపై బురద చల్లేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. టాపిక్ డైవర్ట్ చేసేందుకు కథలు అల్లుతున్నారు. ఏబీఎన్, టీవీ-5, చంద్రబాబు మాఫియా ముఠాగా మారారు. అబద్ధాలు సృష్టించి దొంగ సాక్ష్యాలు తయారు చేస్తున్నారు. ఎవరిది గొడ్డలి పార్టీ.. ఎవరిది గన్ కల్చర్?. ఎవరివి హత్యా రాజకీయాలు.. చంద్రబాబు సమాధానం చెప్పాలి. మా కుటుంబంలో ముగ్గురు బలైపోయారు. హత్యా రాజకీయాలకు మేము బాధితులం. మా తాత, తండ్రి, బాబాయి ముగ్గురు చనిపోయారు. మాపైనే తప్పుడు రాజకీయాలు చేయిస్తున్నారు. మా తాతగారు రాజారెడ్డిని చంపింది టీడీపీ వాళ్లు కాదా? చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే రాజారెడ్డి హత్య జరిగింది. 1999 అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు రాజారెడ్డిగారిని చంపేశారు. వైఎస్సార్‌ను కేవలం పులివెందులకు కట్టడి చేసి, రాజకీయంగా లబ్ధి పొందాలన్నది ఇందులో ఉన్న రాజకీయ కోణం. రాజారెడ్డి కేసులో దోషులను హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీసు, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో పెట్టి, అధికార దుర్వినియోగం చేసి, వారిని రక్షించింది ఎవరు? మరి ఎవరిది క్రిమినల్ బ్రెయిన్?. ఈ కేసులో నిందితులను జైలుకెళ్లకుండా కాపాడారు. ఎవరిది గొడ్డలి పారీ.. చంద్రబాబు చెప్పాలి. మా నాన్న విషయంలోనూ అదే జరిగింది. అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానని చంద్రబాబు అన్నారు. అవసరమైతే అసెంబ్లీలో క్లిప్పింగ్‌లు చూడాలి. తర్వాత నాలుగు రోజులకే వైఎస్సార్ ప్రమాదంలో చనిపోయారు. మేం బాధితులం. కాని, తిరిగి మాపైనే వీళ్లు తప్పుడు రాజకీయాలు చేస్తున్నారు. ఎవరిది క్రిమినల్ బ్రెయిన్? మా చిన్నాయన వివేకానందరెడ్డి ఇదే చంద్రబాబుగారి ప్రభుత్వంలో హత్యకు గురైన మాట వాస్తవమైతే, పైగా తానే హత్య చేశానంటూ సాక్షాత్తూ టీవీ లైవ్ షోల్లో చెలరేగిపోయి మాట్లాడిన దస్తగిరి అనే వ్యక్తి ఇవాళ స్వేచ్ఛగా పోలీసుల వత్తాసుతో దర్జాగా కార్లలో తిరుగుతున్నాడు. పైగా చంద్రబాబుకు లాయర్ లూథ్రానే, దస్తగిరికీ లాయర్ లూథ్రానే. మరి ఎవరిది క్రిమినల్ బ్రెయిన్?. రాజకీయ లబ్ధికోసం ప్రలోభాలతో హంతకులను రక్షించడం, నిర్దోషులను హింసించడం. వివేకానందరెడ్డి కేసులో జరుగుతున్నది ఇదే. చంద్రబాబు బావమరిది, వియ్యంకుడు, బాలకృష్ణ గన్ పట్టుకుని టపాటపామని ఇద్దరిని కాల్చిపడేయలేదా? మరి ఎవరిది గన్ కల్చర్?. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే ఆ ఇంట్లో వాచ్‌మెన్‌ను బండరాయితో మోది చంపేశారు?. పాపం ఎన్టీఆర్ కొడుకు హరికృష్ణగారు యాక్సిడెంట్‌లో చనిపోతే, పరామర్శ కోసం అని పోయి, కేటీఆర్‌తో పొత్తులపై చంద్రబాబు మాట్లాడాడు. మరి ఎవరివి శవ రాజకీయాలు?. అంతెందుకు సొంత కూతుర్ని ఇచ్చి, రాజకీయ జీవితాన్ని ఇచ్చిన సొంత మామ, తండ్రితో సమానమైన ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి, సీఎం కుర్చీని, ఆయన పార్టీని, ఆ పార్టీ గుర్తును లాక్కున్నది, ఆయన చనిపోయినట్టుగా చేసింది ఈ చంద్రబాబు నాయుడు కాదా? మరి ఎవరివి కుట్ర రాజకీయాలు?. వేళ్లన్నీ చంద్రబాబు వైపే.. వంగవీటి మోహనరంగాగారు ఒక టైగర్. ఆయన ఎలా చనిపోయారు?. పేదలకు ఇళ్లపట్టాలు ఇవ్వాలని విజయవాడలో నిరాహారదీక్ష చేస్తుంటే, అర్థరాత్రి నరికి చంపేశారు. ఈ ఘటనలో వేళ్లన్నీ చంద్రబాబు వైపే చూపిస్తాయి. ఈ కేసులో నిందితుడైన వెలగపూడి రామకృష్ణబాబు టీడీపీ ఎమ్మెల్యే. ఎన్టీఆర్‌మీద దాడిచేసిన కేసులో “మల్లెల బాబ్జీ’’ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టుచేశారు. కొన్నాళ్ల తర్వాత అతను ఒక లాడ్జీలో డెడ్‌బాడీగా మారాడు. మల్లెల బాబ్జీ జేబులో ఒక లెటర్ దొరికింది. తనకు రూ.3లక్షలు ఇస్తానని చెప్పి, చివరకు రూ.30వేలే ఇచ్చారని సారాంశం. అసలు ఎన్టీఆర్‌మీద దాడి కోసమే డబ్బులు ఇచ్చారా? అది నిజమైతే ఇచ్చింది ఎవరు? అన్నదానిపై దర్యాప్తు లేదు. ఈ కేసులోనూ వేళ్లు అప్పట్లో చంద్రబాబు వైపే చూపించాయి. పింగళి దశరథ్‌రామ్ ఒక జర్నలిస్టు. విజయవాడలో ఎన్‌కౌంటర్ అనే పత్రికను పెట్టి, టీడీపీ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తుంటే, హైదరాబాద్ నుంచి బస్సుదిగి, రిక్షాలో ఇంటికి వెళ్తుంటే కత్తులతో దాడిచేసి చంపేశారు. ధర్నాలు, ఆందోళనల సమయంలో బస్సులు తగలబెట్టాలంటూ చంద్రబాబు పార్టీ కేడర్‌కు చెప్పేవాడని స్వయంగా ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు అనేక టీవీ ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఒక పుస్తకంలో రాసినట్టు కూడా నాకు గుర్తు. హత్యలతో, వెన్నుపోట్లతో, శవాలతో రాజకీయాలు చేసింది, చేస్తున్నది చంద్రబాబు అయితే, విలువలు, విశ్వసనీయత, మాటకు కట్టుబడి రాజకీయాలు చేస్తున్నది మేం. జగన్ నైజం ఇది.. జగన్ మంచివాడు కాబట్టే, మా తాతను చంపిన వాళ్లు కూడా ప్రశాంతంగా ఉన్నారు. జగన్ చెడ్డోడు అయితే వాళ్లు ప్రశాంతంగా ఉండేవాళ్లా? జగన్ నైజం ఎలాంటిది? మనస్తత్వం ఎలాంటిది చెప్పడానికి ఇది నిద్శనం. ప్రజలకు మంచి చేసి పేరు తెచ్చుకోవాలని మా నాన్న నేర్పించాడు. చంద్రబాబులా కాదు. రాజకీయాల్లో ఎవరికి కుట్రలు అవసరమో, ఎవరికి గొడ్డళ్లు, గునపాలు అవసరమో ప్రజలకు బాగా తెలుసు. చంద్రబాబూ నీకు 77 సంవత్సరాలు వచ్చాయి. బహుశా ఇది చివరి ఎన్నికలేమో. ఇంకా ఈ చిల్లర రాజకీయాలు చేయడానికి సిగ్గేయడం లేదా? అని ప్రశ్నించారు. సోషల్ మీడియాను సెన్సార్ చేస్తున్న చంద్రబాబు రాష్ట్రంలో ప్రజలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు చెప్పలేని పరిస్థితి ఉందన్నారు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్. ఎక్కడా లేని విధంగా సోషల్ మీడియాను చంద్రబాబు సెన్సార్ చేస్తున్నాడు. సోషల్ మీడియా పోస్టులపై తన కార్యకర్తలతో తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు తమ ప్రాథమిక విధులను వదిలేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో గవర్నెన్స్ పూర్తిగా పోయింది. మహిళలకు రక్షణ లేదన్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోంది. చంద్రబాబుకు ఇబ్బందికర పరిస్థితులు ఎప్పుడు వచ్చినా వెంటనే టాపిక్‌ను డైవర్ట్ చేస్తారు. అబద్ధాన్ని సృష్టించి, దాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తారు. సోషల్ మీడియాలో అమరావతిలో అవినీతి మీద, ఇందాపూర్-హెరిటేజ్ సంబంధాలమీద, తిరుమల లడ్డూ విషయంలో, మహిళలపై వీళ్ల ఎమ్మెల్యేలు, చివరకు టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న వ్యక్తి చేసిన వ్యవహారాల మీద, విచ్చలవిడిగా వీళ్లు చేస్తున్న మద్యం గంజాయి, ఇసుక, మట్టి మాఫియా దోపిడీపైనా, ఇలా చంద్రబాబు ఇరుకునపడ్డ ఏ కంటెంట్ కూడా కనబడకుండా చేస్తున్నారు. ఎక్కడా లేని విధంగా సోషల్ మీడియాను చంద్రబాబు సెన్సార్ చేస్తున్నాడు. సోషల్ మీడియా పోస్టులపై తన కార్యకర్తలతో తప్పుడు కేసులు పెట్టించి, నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లను అడ్డుపెట్టుకుని, ట్విట్టర్, యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్‌స్టా లాంటి హెడ్ క్వార్టర్స్‌కు నేరుగా ఈ పోలీసులే ఆ పోస్టులను డిలీట్ చేయాలని ఆదేశాలు ఇస్తున్నారు. పోలీసులను వాడుకుని అకౌంట్లను బ్లాక్ చేయిస్తున్నారు. పోలీసులు తమ ప్రాథమిక విధులను వదిలేశారు. రాష్ట్రవ్యాప్తంగా విచ్చలవిడిగా కాలేజీల్లో గంజాయి అమ్మిస్తున్నారు. ఎక్కడ చూసినా డ్రగ్సే ఉంటున్నాయి. ప్రతి ఐదు లిక్కర్ బాటిళ్లలో ఒకటి కల్తీదే. బెల్టు షాపుల ద్వారా ఈ కల్తీ లిక్కర్‌ను అమ్ముతున్నారు. బెల్టు షాపుల ద్వారా మద్యం అమ్మిస్తున్నారు. రాష్ట్రానికి ఆదాయాలు రావడమే లేదు. అయినా పోలీసులు పట్టించుకోరు. రాష్ట్రంలో గవర్నెన్స్ పూర్తిగా పోయింది. మహిళలకు రక్షణ లేదు. దిశ కార్యక్రమం ద్వారా మహిళలను రక్షణ కల్పించాం. గ్రామ సచివాలయాల్లోనే మహిళా పోలీసును పెట్టాం. కూటమి ప్రభుత్వంలో పరామర్శ కోసం మహిళలను అడ్డుకున్న తీరు అత్యంత హేయం’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు.. కేంద్రం గడ్డి పెట్టలేదా?: వైఎస్ జగన్ చంద్రబాబు.. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్‌తో పాటు ఇచ్చిన 143 హామీల సంగతి ఏమిటని ప్రశ్నించారు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్. పెట్రోలు, డీజిలు రేట్లు తగ్గిస్తానంటూ ఇచ్చిన హామీ విషయంలో కూడా చంద్రబాబుది వెన్నుపోటేనని అన్నారు. పెట్రోల్, డీజిల్‌పై కృత్రిమ కొరత సృష్టించింది ఎవరు?. సంక్షోభంలో కూడా స్కాములు చేశారు అని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ప్రతిపక్ష పార్టీగా ఈ రెండేళ్లుగా మేం చంద్రబాబును అడుగుతున్నది ఏంటంటే.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలుచేస్తారు. వాటి సంగతి ఏమైందని మేమే కాదు, ప్రజలంతా కూడా అడుగుతున్నారు. ఇది తప్పవుతుందా?. పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గింపు ఎప్పుడు?. 2014-19 మధ్య చంద్రబాబుకు కోవిడ్ లాంటి గడ్డు పరిస్థితులు లేవు. కానీ, 2015 ఫిబ్రవరిలో పెట్రోలు, డీజిలుపై లీటర్‌కు రూ.4ల చొప్పున అకారణంగా పెంచాడు. కానీ, మా ప్రభుత్వ హయాంలో కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల మధ్య, మేము గతంలో చంద్రబాబు పెంచిన దాని కన్నా కేవలం ఒక్క రూపాయి మాత్రమే అదనంగా పెంచాం. దానిమీద చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ నానా యాగీ చేశారు. పైగా మొన్న ఎన్నికలకు ముందు, అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ మీదున్న ట్యాక్స్‌లు తగ్గించి, వాటి రేట్లు తగ్గిస్తానంటూ చెప్పారు. మేనిఫెస్టోలో కూడా పెట్టాడు. ఇప్పటికే రూ.4లు లీటర్ పెట్రోల్, డీజిల్ మీద పెంచారు. చంద్రబాబు గతంలో చెప్పిన మాటల ప్రకారమే డీజిల్, పెట్రోల్‌పై రూ.8 తగ్గించాలి కదా?. ఇలా తగ్గించకపోగా సంక్షోభంలో కూడా స్కాములు చేశారు. కృత్రిమ కొరత సృష్టించి అందులో కూడా తనకు, తన వాళ్లకు సంపద పెంచుకునే ప్రయత్నం చేశాడు. ఏప్రిల్ చివరి వారంలో రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ దొరక్క జనం బారులు తీరారు. ఇలాంటి సమయంలో కూడా ముఖ్యమంత్రి అనే వ్యక్తి తక్షణ చర్యలు తీసుకోలేదు. ప్రజల గురించి ఆలోచించకుండా, వారి అవసరాలను తీర్చాల్సింది పోయి, అమరావతి కాంట్రాక్టర్లకు రిటైల్ అవుట్ లెట్ల నుంచి పెట్రోల్, డీజిల్ ఇవ్వాలని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడం దారుణం. ఇలాంటి మనిషి ప్రపంచ చరిత్రలో ఎవరైనా ఉంటారా?. అసలు విషయాలు తెలుసుకుని కేంద్ర ప్రభుత్వం చీవాట్లు పెడుతూ లేఖ రాసింది. రిటైల్ అవుట్ లెట్స్ నుంచి కమర్షియల్ అవసరాలకు వాడకూడదని గడ్డిపెట్టింది’ అని చెప్పుకొచ్చారు. బాలయ్య అల్లుడికి వైఎస్ జగన్ స్ట్రాంగ్ కౌంటర్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌కు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. Yes Lokesh.. Both Are Not Same అని.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి చాలా తేడా ఉందని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. ఇంత దారుణమైన పరిపాలన చంద్రబాబు ఓవైపు చేస్తూ.. మరోవైపు తన కొడుకు చేత Both are not the same అని పబ్లిక్ మీటింగ్స్‌లో డైలాగ్స్ చెప్పించడం ఏంటని ప్రశ్నించారు. ‘మిస్టర్ లోకేష్.. Yes, both can never be same. వెన్నుపోటుతో పార్టీని, పార్టీ గుర్తును దోచేయడం మీ హిస్టరీ. ఎదురొడ్డి నిలబడి ప్రజా మద్దతు సంపాదించి, ప్రభుత్వంలోకి రావడం మా హిస్టరీ. both can never be same ప్రజలకు ద్రోహం చేయడం, నమ్మించి ముంచడం మీ క్యారెక్టర్. ఆరు నూరైనా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం మా క్యారెక్టర్. పనులు చేసి చూపించడం మా స్టైల్. పబ్లిసిటీతో క్రెడిట్ చోరీకి పాల్పడ్డం మీ స్టైల్. both can never be same విద్యా, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, ప్రజలచెంతకే పాలన, గృహనిర్మాణం, మహిళా సాధికారిత, మహిళా రక్షణలో “దిశ’’లాంటి విప్లవాత్మక కార్యక్రమలు మాకున్న చరిత్ర. వాటన్నింటినీ నాశనం చేయడం మీ చరిత్ర. both can never be same ఐదేళ్లలో పారదర్శకంగా అర్హులైన పేదలకు ఇంటివద్దకే డీబీటీ కింద రూ.2.73 లక్ష కోట్లు ఇవ్వడం మా గవర్నెన్స్, రెండేళ్లలో 3.6లక్షలకోట్లు అప్పులు చేసి, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్‌లను గాలికి వదిలేసి దోచేయడం మీ గవర్నెన్స్. both can never be same బాబు అంటే మోసం, జగన్ అంటే నమ్మకం. both can never be same అని అన్నారు. అలాగే, సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు ఇప్పుడు సంతానమే సంపద అంటున్నాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురిని, నలుగురిని కనమంటున్నాడు. అలా కంటే డబ్బులు ఇస్తాడంట. చంద్రబాబూ నువ్వు ఎందుకు కనలేదు? ఒక్కరితోనే ఎందుకు ఆపావ్? నీ కొడుకు లోకేష్ కూడా ఒక్కడితోనే ఎందుకు సరిపెట్టాడు? నీకొడుకైనా నువ్వు చెప్తున్న దాన్ని పాటించాలి కదా?. నువ్వు వచ్చిన తర్వాత ప్రభుత్వం బాధ్యతగా ప్రజలకు అందించాల్సిన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను పూర్తిగా మూలనపడేశావు. మెడికల్ కాలేజీలకు, నాడు -నేడు స్కూళ్లకు డబ్బులు ఇవ్వడానికి చంద్రబాబుకు మనసు రాదుకాని, అమరావతిలో బిల్డింగుల అద్దాలకు రూ.2,540 కోట్లు. ముగ్గురు నలుగురిని కంటే, వారికి కనీసం మంచి భోజనమైనా పెట్టే పరిస్థితి కుటుంబాలకు ఉంటుందా? వారి చదువులు ఏం కావాలి? వారి నాణ్యమైన వైద్యం ఎక్కడి నుంచి అందుతుంది?. ముగ్గురు, నలుగుర్ని కనాలంటూ మహిళలను పిల్లలు కనే యంత్రాలుగా చూడ్డం, వారిని చులకన చేసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వు ఇలా మాట్లాడటం తప్పు. మహిళలు బాగుంటనే కుటుంబాలు బాగుంటాయి’ అని చెప్పుకొచ్చారు.