దళిత క్రైస్తవులు, ముస్లింలపై దాడులు ఆపాలి

ఎన్టీఆర్ జిల్లా:  ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో దళిత క్రైస్తవులు, ముస్లింలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్ నల్లగట్ల స్వామిదాస్ పాల్గొని ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత క్రైస్తవులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు సమాజంలో కుల, మత విద్వేషాలను పెంచే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 నుంచి 28 వరకు ప్రతి పౌరుడికి మత స్వేచ్ఛ హక్కు కల్పించిందని గుర్తుచేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి మతాన్నీ గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. దళిత క్రైస్తవుల హక్కుల పరిరక్షణ కోసం 1950 రాష్ట్రపతి ఆర్డర్‌లో సవరణలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

దళిత క్రైస్తవులను ఎస్సీల్లో చేర్చుతామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. మరోవైపు డిప్యూటీ స్పీకర్ వ్యాఖ్యలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నప్పటికీ హోంమంత్రి స్పందించకపోవడం విచారకరమన్నారు. రఘురామకృష్ణం రాజుపై తక్షణమే చర్యలు తీసుకుని, ఆయనను పదవి నుంచి బర్తరఫ్ చేయాలని వైయ‌స్ఆర్‌సీపీ డిమాండ్ చేస్తోందన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజలంతా ఒక్కటిగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, దళిత సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
 

Back to Top