అనంతపురం: నగరంలో కూటమి నేతల అవినీతిపై తాము చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపిస్తామని, పారదర్శక విచారణకు సిద్ధంగా ఉన్నారా అని నగర మేయర్ మహమ్మద్ వసీం సవాల్ విసిరారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో ఆయన కార్పొరేటర్లతో కలిసి మీడియాతో మాట్లాడారు. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని, అదనంగా 36 ట్రాక్టర్లు ఏర్పాటు చేసినా ఇంటింటి చెత్త సేకరణ సక్రమంగా జరగడం లేదని ఆరోపించారు. ప్రజలు చెత్తను కాలువల్లో వేయడంతో మురుగునీరు రోడ్లపైకి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలో పారిశుద్ధ్య సమస్యల కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురైన ఘటనను ప్రస్తావిస్తూ, అలాంటి పరిస్థితి అనంతపురంలో పునరావృతం కాకూడదన్నారు. పారిశుద్ధ్య నిర్వహణపై అధికారుల పర్యవేక్షణ కొరవడిందని, మేస్త్రీ స్థాయి నుంచి కమిషనర్ స్థాయి వరకు మొద్దునిద్రలో ఉన్నారంటూ విమర్శించారు. రహదారుల మరమ్మతుల అంశాన్ని ప్రస్తావిస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంతలు లేని రోడ్లు ఉండాలని చెబుతున్నప్పటికీ నగరంలో 324 గుంతలను గుర్తించి రూ.60 లక్షలతో టెండర్లు పిలిచినా పనులు ప్రారంభం కాలేదని ఆరోపించారు. టెండర్లలో బయట ప్రాంత కాంట్రాక్టర్లను పాల్గొననీయకుండా కూటమి నేతలు అడ్డుకుంటున్నారని విమర్శించారు. కొన్ని నిర్మాణాలు అనుమతులు లేకుండానే జరుగుతున్నాయని, శ్రీనగర్ పార్క్ మరమ్మతులకు రూ.65 లక్షల పనులు ప్రారంభిస్తే ఒక ప్రజాప్రతినిధి పీఏ ఫోన్ చేసి పనులు ఆపించారని ఆరోపించారు. టౌన్ ప్లానింగ్ అధికారులు బెదిరింపులకు గురవుతున్నారని, భవన నిర్మాణాలకు అనుమతులు ఉన్నప్పటికీ కూటమి నేతలను కలిస్తేనే పనులు జరిగే పరిస్థితి ఉందని అన్నారు. అదేవిధంగా, శారదానగర్‌లో ఫంక్షన్ హాల్, టవర్ క్లాక్ సమీపంలో భారీ భవనం, రవి పెట్రోల్ బంక్ వద్ద షెడ్ నిర్మాణాలు అనుమతులు లేకుండా జరుగుతున్నాయని, బెటర్‌మెంట్ చార్జీలు ఎవరి ఖాతాలోకి వెళ్తున్నాయనే విషయంపై విచారణ చేస్తామని తెలిపారు. గత వైయస్ఆర్‌సీపీ పాలనలో ప్రభుత్వ స్థలాలు కబ్జా కాకుండా కాపాడామని, ప్రస్తుతం వాటిని తెలుగుదేశం పార్టీ నేతలు ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. శ్రీనగర్ కాలనీలో ప్రభుత్వ స్థలం ఎవరి పేరుతో రిజిస్టర్ అయిందో త్వరలో వెల్లడిస్తామని స్పష్టం చేశారు. డంప్ యార్డ్‌ను అక్టోబర్ 2లోపు తరలించి పార్క్‌గా మారుస్తామని చెప్పినా ఇప్పటికీ ఆచరణలో కనిపించడం లేదని, ప్రజలను మాటలతో మభ్యపెడుతున్నారని మేయర్ విమర్శించారు. అధికారుల పరిధి దాటి వ్యవహరిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.