మండలి నుంచి ప్రభుత్వం పలాయనం

సమాధానం చెప్పలేక వెళ్లిపోయిన మంత్రులు

హెరిటేజ్‌–ఇందాపూర్‌ డెయిరీ సంబంధంపై పక్కా ఆధారాలు

తిరుమలలో కల్తీ నెయ్యి వినియోగం ఈ ప్రభుత్వ హయాంలోనే

అన్ని ఆధారాలతో సహా సభలో గట్టిగా ఎండగట్టాం

జవాబు లేక చర్చలో పదే పదే అడ్డుకున్నారు

డైవర్షన్‌ కోసం ఛైర్మన్‌పైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు

అయినా చర్చల్లో అన్ని అంశాలను బలంగా వినిపించాం

చర్చ తర్వాత సభలో సమాధానం చెప్పని ప్రభుత్వం

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీల ధ్వజం

మండలి సమావేశం ముగిసిన తర్వాత మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు.

హెరిటేజ్‌ కోసమే చంద్రబాబు కల్తీ నెయ్యి ఆరోపణలు 

తన వ్యాపార ప్రయోజనాల కోసం లడ్డూపై దుష్ప్రచారం

ఆధారాలతో నిలదీస్తే ప్రభుత్వం భయపడి పారిపోయింది 

 వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీల స్పష్టీకరణ

అసెంబ్లీ మీడియా పాయింట్, వెలగపూడి:     ఉద్దేశపూర్వకంగానే తిరుమల లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వినియోగం అంటూ సీఎం చంద్రబాబు చేసిన దుష్ప్రచారం, టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలోనే తిరుమలలో కల్తీ నెయ్యి వినియోగం, హెరిటేజ్‌–ఇందాపూర్‌ డెయిరీ వ్యాపార సంబంధాలపై పక్కా ఆధారాలతో సభలో నిలదీస్తే, సమాధానం చెప్పలేని ప్రభుత్వం పారిపోయిందని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు వెల్లడించారు. అన్నింట్లో అడ్డంగా దొరికిపోవడంతో, చర్చను కూడా పదే పదే అడ్డుకున్నారని, అయినా తాము అన్ని అంశాలను సభలో చాలా గట్టిగా వినిపించామని వారు తెలిపారు. దీంతో సమాధానం చెప్పలేక మంత్రులు సభ నుంచి వెళ్లిపోయారని చెప్పారు. 
    హెరిటేజ్‌ వ్యాపార ప్రయోజనాల కోసం కల్తీ నెయ్యి పేరుతో అత్యంత పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు చేసిన తప్పుడు ప్రచారం ప్రభావాన్ని ఇప్పుడు ఆ పార్టీయే ఎదుర్కోవాల్సి వస్తోందని, రాజకీయ లబ్ధి కోసం దేవుడిని రాజకీయాల్లోకి లాగినందుకు చంద్రబాబు మూల్యం చెల్లించుకోకతప్పదని వైయస్సార్సీపీ ఎమ్మెల్సీలు స్పష్టం చేశారు. ఇందాపూర్‌ డెయిరీ ముసుగులో టీటీడీ నిధుల దోపిడీకి హెరిటేజ్‌ డెయిరీ సిండికేట్‌ చేసిన పాప కార్యాలపై వైయస్సార్సీపీ ఆధారాలతో సహా ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పుకోలేక మంత్రులు వెళ్లిపోయారని, మరోవైపు ఛైర్మన్‌ అనుచిత వ్యాఖ్యలతో మంత్రి కె.అచ్చెన్నాయుడు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేశారని వారు ఆక్షేపించారు.  అశ్లీల వీడియోల్లో ఉన్నది తానేనని బీఆర్‌ నాయుడు అంగీకరించిన తర్వాత కూడా టీటీడీ ఛైర్మన్‌ పదవి నుంచి తప్పించడానికి సీఎం చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.
    అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు ఎవరెవరు ఏం మాట్లాడారంటే..:

మా ఆరోపణలకు సమాధానం చెప్పే దమ్ము ప్రభుత్వానికి లేదు.
:లేళ్ల అప్పిరెడ్డి. వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ.

– హెరిటేజ్‌ వ్యాపార ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు కల్తీ నెయ్యి ఆరోపణలు చేశాడని ఆధారాలతో సహా మా సభ్యులు మండలిలో నిరూపించారు. ఇందాపూర్‌ డెయిరీ ముసుగులో హెరిటేజ్‌ కి టీటీడీ నిధులు దోచిపెట్టడానికి చేసిన ప్రయత్నాలను వివరించారు. హెరిటేజ్‌ ఆధ్వర్యంలో ఏఆర్, ఇందాపూర్, సంగం, ప్రీమియర్‌ ఆగ్రో, భోలేబాబా డెయిరీలతో ఏర్పడిన డెయిరీ సిండికేట్‌ గుట్టును బయటపెట్టడంతో ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది. ప్రతిపక్ష వైయ‌స్ఆర్‌సీపీ ఆరోపణలకు సమాధానం చెప్పుకోలేక సభలో లేని జగన్‌గారి మతం గురించి మాట్లాడి డైవర్షన్‌ పాలిటిక్స్‌కి తెర లేపారు. ఈరోజైనా మంత్రులు సమాధానం ఇస్తారనుకుంటే ఎవరూ ముందుకు రాకుండా మా సభ్యులు మాట్లాడుతుంటే అడుగడుగునా అడ్డు తగిలారు.
    ఇంకా ప్రభుత్వం చర్చలో పాల్గొనడం లేదని సిగ్గు లేకుండా చెప్పుకున్నారంటే హెరిటేజ్‌ అవినీతిని అంగీకరించినట్టే. వ్యాపార ప్రయోజనాలు, రాజకీయ లబ్ధి కోసం దేవుడిని రాజకీయాల్లోకి లాగడం సిగ్గుచేటు. వైయ‌స్ఆర్‌సీపీ, జగన్‌గారి మీద కోపముంటే దేవుడిని రాజకీయాల్లోకి లాగుతారా? జగన్‌గారి మతం గురించి మాట్లాడే అర్హత అచ్చెన్నాయుడికి ఎక్కడిది? సభలో బరి తెగించి ఆయన చేస్తున్న ఆరోపణలకు ప్రజలే బుద్ధి చెబుతారు? రెండు కొండలను ఏడు కొండలుగా మారుస్తూ దివంగత వైయస్సార్‌ జీవో నెం:746, 747 తీసుకొస్తే, ఈ విషయం తెలిసి కూడా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సభ సాక్షిగా అసత్య ప్రచారం చేయడం హేయం. సీనియర్‌ మంత్రి ఇలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం బాధాకరం. కూటమి ప్రభుత్వ హయాంలో తీసుకున్న నెయ్యి శాంపిల్స్‌కి వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వానికి ఏం సంబంధమో చెప్పాలి. ఇకనైనా దేవుడిని, మతాలను రాజకీయాల్లోకి లాగడం మానుకుని ప్రజాస్వామ్యబద్ధంగా పాలన చేయాలి. 

మంత్రులు అవకాశవాద రాజకీయాలు మానుకోవాలి.
:తూమాటి మాధవరావు.వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ.

– లడ్డూ వ్యవహారంపై వైయ‌స్ఆర్‌సీపీ తరఫున మాట్లాడుతుంటే సభను అడ్డుకోవడమే కాకుండా మతాల ప్రస్తావన తీసుకొచ్చి డైవర్ట్‌ చేస్తున్నారు. నిన్న క్షమాపణలు చెప్పిన మంత్రి అచ్చెన్నాయుడు.. మళ్లీ ఈరోజు కూడా మతాల ప్రస్తావన తీసుకొచ్చి డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పుకొనే ధైర్యం లేకనే ప్రభుత్వం పారిపోతోంది. రాష్ట్రంలో నెలకొన్న వ్యవసాయ సంక్షోభం గురించి చర్చ జరగకూడదనే భయం ప్రభుత్వంలో నెలకొంది. నాడు టీటీడీ బోర్డు మెంబర్లుగా పని చేసిన వారు పార్టీ మారిన తర్వాత ఆ నిర్ణయాలనే విమర్శించడం నైతికత అనిపించుకోదు. మంత్రులు అవకాశవాద రాజకీయాలు మానుకోవాలి. 

మా ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సమాధానం లేదు.
:పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి. వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ.

– పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు రాజేసిన వివాదం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులను తీవ్రమైన ఆవేదనకు గురి చేసింది. రాజకీయ లబ్ధి, హెరిటేజ్‌ వ్యాపార ప్రయోజనాల కోసం చంద్రబాబు ఈ ఘోరమైన కుట్ర చేశాడని తేలిపోయింది. దానిపై ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేకపోతోంది. ఏఆర్‌ డెయిరీ పేరుతో వచ్చిన నాలుగు ట్యాంకర్లను వెనక్కి పంపితే దాన్ని వైష్ణవి డెయిరీ పేరుతో రప్పించి లడ్డూ తయారీకి ఎలా వాడారని అడిగితే దానికి దేవాదాయ శాఖ మంత్రి నుంచి సమాధానం లేదు. టీటీడీ బ్లాక్‌ లిస్టులో పెట్టిన ఇందాపూర్‌ డెయిరీపై సస్పెన్షన్‌ ఎత్తివేసింది కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే. భోలేబాబా డెయిరీకి టెక్నికల్‌ క్లియరెన్స్‌ ఇచ్చింది కూడా చంద్రబాబే. వీటిలో దేనికీ సమాధానం చెప్పలేక కూటమి సభ్యులు మతాల ప్రస్తావన తీసుకొచ్చి సభను డైవర్ట్‌ చేశారు.  

బీఆర్‌ నాయుడుతో రాజీనామా చేయించాలి. 
:బొమ్ము ఇజ్రాయేల్‌. వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ.

– మండలిలో చైర్మన్‌ మతం గురించి ప్రస్తావించి అవమానించిన మంత్రి కె.అచ్చెన్నాయుడిని మంత్రి పదవి నుంచి తొలగించాలి. అంతే కాకుండా ఆయన్ను తెలుగుదేశం పార్టీ నుంచి కూడా సస్పెండ్‌ చేయాలి. అశ్లీల వీడియోల్లో ఉన్నది తానేనని అంగీకరించిన తర్వాత కూడా టీటీడీ చైర్మన్‌గా బీఆర్‌ నాయుడిని కొనసాగించడం సిగ్గుచేటు. హిందూ మతాన్ని గౌరవించే వారైతే, భక్తుల మనోభావాలతో ఆటలాడుకోకుండా తక్షణం బీఆర్‌ నాయుడి చేత రాజీనామా చేయించాలి. 

పాలనా వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు మత రాజకీయాలు.
:వరుదు కళ్యాణి. వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ.

– రిజెక్టు చేసిన నెయ్యి ట్యాంకర్లు మళ్లీ టీటీడీలోకి ఎలా ప్రవేశించాయో చెప్పాలని వైయ‌స్ఆర్‌సీపీ డిమాండ్‌ చేస్తుంటే దానికి సమాధానం చెప్పే ధైర్యం లేక కూటమి నాయకులు సభలో మతాల ప్రస్తావన తీసుకొచ్చి డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. ఇందాపూర్‌–హెరిటేజ్‌ డెయిరీకి ఉన్న సంబంధం గురించి అడుగుతుంటే మండలి చైర్మన్‌ మతం గురించి మాట్లాడారు. లౌలిక రాజ్యంలో ఉన్నామన్న విషయాన్ని మరిచి మతాన్ని రాజకీయాల్లోకి లాగుతూ పాలనా వైఫల్యాలను కప్పి పుచ్చుకోవాలని చూడటం సిగ్గుచేటు. 

హెరిటేజ్‌ అవినీతి బయటపడిందనే భయం
:కల్పలతారెడ్డి. వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ.

– కల్తీ నెయ్యి పేరుతో చంద్రబాబు టీటీడీ నిధుల దోపిడీకి పాల్పడ్డాడని ఆధారాలతో సహా సభలో వివరిస్తుంటే కూటమి సభ్యులు అడుగడుగునా అడ్డుతగులుతూ వచ్చారు. హెరిటేజ్‌ అవినీతి బాగోతం బయట పడుతుందనే భయంతో చర్చ జరగకుండా మతాల పేరుతో సభలో డైవర్షన్‌ పాలిటిక్స్‌కి తెరలేపారు. రాజకీయాల్లోకి పదే పదే మతాన్ని తీసుకురావడం హేయం. 

చంద్రబాబుని ప్రజలు అసహ్యించుకుంటున్నారు 
:పి.రామసుబ్బారెడ్డి. వైయ‌స్ఆర్‌సీపీఎమ్మెల్సీ.

– వైయ‌స్ఆర్‌సీపీ, వైయస్‌ జగన్‌ మీద హిందూ వ్యతిరేక ముద్ర వేయాలన్న చంద్రబాబు కుట్రలు పటాపంచలయ్యాయి. దేవుడిని రాజకీయాల్లోకి లాగి లబ్ధి పొందాలని చూసినందుకు ఇప్పటికే చంద్రబాబు తీవ్రంగా నష్టపోయాడు. కల్తీ నెయ్యి గురించి తీగలాగితే చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్‌ డొంక కదిలింది. వైయ‌స్ఆర్‌సీపీ వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేనంత కాలం ఆయన చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు. ధరలు పెంచి హెరిటేజ్‌ కి నెయ్యి కాంట్రాక్టు కట్టబెట్టడానికి పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పడం క్షమించరాని తప్పు. ఆయన్ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల తీవ్రంగా అసహ్యించుకుంటున్నారు. దేవుడంటే భయం, భక్తి లేని బీఆర్‌ నాయుడిని టీటీడీ చైర్మన్‌ పదవి నుంచి తక్షణం తప్పించాలి. 
దాల్మియా బాధిత రైతులకు న్యాయం చేయాలి:
    దాల్మియా సిమెంట్‌ ఫ్యాక్టరీ వాగుకు అడ్డంగా రెండున్నర కి.మీ పొడవున 30 మీటర్ల ఎత్తుతో గోడ నిర్మించిన కారణంగా రెండు గ్రామాలు పూర్తిగా మాయమైపోతున్నాయి. వందల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగి వ్యవసాయానికి పనికి రాకుండా పోతున్న పరిస్థితి. ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ధీనిపై సర్వే చేసి ఈ ప్రాజెక్టు లోకేషనే తప్పని తేల్చింది. దాల్మియా సిమెంట్‌ ఫ్యాక్టరీ కారణంగా నష్టపోయిన పొలాలను మార్కెట్‌ రేటు ప్రకారం కొనుగోలు చేయడంతోపాటు బ్లాస్టింగ్‌ వల్ల ధ్వంసమైన ఇళ్లకు పరిహారం చెల్లించాలి. ఆ మేరకు దాల్మియా యాజమాన్యం హామీలు నెరవేరుస్తుందని కలెక్టర్‌ చెప్పినా ఇంతవరకు ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేరలేదు. 

అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
:ఎంవీ రామచంద్రారెడ్డి. వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ.

– ఎన్నికల సందర్భంగా అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు ప్రభుత్వం ఎన్నో హామీలిచ్చింది. రెండేళ్లవుతున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతూ శాంతియుతంగా ధర్నా చేస్తున్న వారిపై పోలీసులతో దాడి చేయించి బలవంతంగా వారిని వ్యాన్‌లలో తరలించారు. ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలు పెంచమన్నందుకు, సీనియారిటీ ప్రకారం ప్రమోషన్లు కోరినందుకు వారిపై దాడి చేయడం హేయం. మహిళలనే కనీస గౌరవం లేకుండా వేకువజామున ధర్నా చేస్తున్న టెంట్‌లో నిద్రిస్తున్న వారిపై దాడి చేశారు. ఎన్నికల్లో వారికిచ్చిన హామీలు తక్షణం నెరవేర్చాలి. లేదంటే వారి తరఫున వైయ‌స్ఆర్‌సీపీ ఉద్యమిస్తుంది. 

బీఆర్‌ నాయుడు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి
:సిపాయి సుబ్రహ్మణ్యం. వైయ‌స్ఆర్‌సీపీఎమ్మెల్సీ.

– తరతరాలుగా హిందువులు పవిత్ర గ్రంథంగా భావించే భగవద్గీత గురించి చెత్తాచెదారం అంటూ మాట్లాడిన బీఆర్‌ నాయుడితో రాజీనామా చేయించకుండా చంద్రబాబు ఇంకా ఎందుకు ఉపేక్షిస్తున్నారో చెప్పాలి. తానే స్వచ్ఛందంగా రాజీనామా చేసి టీటీడీ చైర్మన్‌ పదవి నుంచి బీఆర్‌ నాయుడు తప్పుకోవాలి. దేవుడంటే భయం, భక్తి లేని వ్యక్తి టీటీడీ బోర్డు చైర్మన్‌గా ఉండటం తెలుగు ప్రజల దౌర్భాగ్యం. 
  
ఉద్యోగాల కల్పనపై సీఎం, మంత్రి తప్పుడు లెక్కలు 
:రమేశ్‌ యాదవ్‌. వైయ‌స్ఆర్‌సీపీఎమ్మెల్సీ.

– నిరుద్యోగంలో ఏపీ దేశంలో ఏ స్థానంలో ఉంది? ఉద్యోగాలు లేని వారికి నిరుద్యోగ భృతి ఇస్తున్నారా? అనే ప్రశ్నలు అడిగితే దానికి మంత్రి చెప్పిన సమాధానం నిరుద్యోగులను మరింత వంచించినట్టుగా ఉంది. గడిచిన ఐదు నెలల్లో 5,72,280 ఉద్యోగాలు ఇచ్చామని శాసనమండలిలో చెప్పడం పచ్చి అబద్ధంగా తెలుస్తోంది. ఎందుకంటే,  కానీ, శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి మాత్రం 6,28,320 ఉద్యోగాలిచ్చామని చెప్పాడు. రాజ్యసభలో జరిగిన ఒక డిస్కషన్‌ డిసెంబర్‌ 15న దేశంలో 5.2 శాతం నిరుద్యోగిత రేటు ఉంటే, ఏపీలో అత్యధికంగా 8.2 శాతంతో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నట్టు చెప్పింది. 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం ఏం చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నిస్తే దానికీ ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. ఉద్యోగాలు కల్పించలేకపోతే నెలకు రూ.3 వేల  నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీ గురించి అడిగితే దానికీ సమాధానం లేదు. 20 నెలల్లో ప్రభుత్వం కల్పించినట్టు చెప్పుకుంటున్న 5,72,280 ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు కూడా ఇవ్వలేకపోతోంది. 

బాక్సైట్‌ తవ్వకాలకు వైయ‌స్ఆర్‌సీపీ వ్యతిరేకం 
:కుంభా రవిబాబు. వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ.

– సభలో మంత్రి అచ్చెన్నాయుడు ప్రవర్తించిన తీరు అప్రజాస్వామికంగా ఉంది. వ్యవసాయ బడ్జెట్‌ గురించి చర్చ జరగకుండా మతాల ప్రస్తావన తీసుకొచ్చినందుకు ఆయన సిగ్గుపడాలి. మంత్రులు, అధికార పార్టీ సభ్యులు బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తున్నారు. రైతులు పండించిన పంటలకు కనీస గిట్టుబాటు ధరలు ఉండటం లేదు. బాక్సైట్‌ తవ్వకాల పేరుతో ఆదివాసీ జీవనవిధానాలను దెబ్బతీయాలని చూడటాన్ని వైయ‌స్ఆర్‌సీపీ వ్యతిరేకిస్తుంది. ఆదివాసీ హక్కులకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తూ గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్‌ 97ని వైయస్‌ జగన్‌ గారు అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేశారు. కానీ ఇప్పుడు మళ్లీ బాక్సైట్‌ తవ్వకాల కోసం చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీన్ని వైయ‌స్ఆర్‌సీపీ తరఫున ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు. తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Back to Top