తాడేపల్లి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు చేపట్టిన ప్రజా ఉద్యమం విజయవంతమైంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గం లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజా ఉద్యమం కోటి సంతకాలు కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఒక్కో నియోజవర్గంలో సేకరించిన వేలాది సంతకాల పత్రాలను సేకరించి ఇవాళ ప్రదర్శనగా ప్రత్యేక వాహనంలో తరలించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు మాట్లాడుతూ..ప్రభుత్వమే దళారీగా మారిపోయి వైద్య సేవలు, వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయడం.. విలువైన సంపదను ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెడుతుండటం దుర్మార్గమన్నారు. అన్ని సదుపాయాలు, అనుమతులతో సిద్ధంగా ఉన్న ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలను సంతలో సరుకులు, పప్పు బెల్లాల మాదిరిగా చంద్రబాబు సర్కారు తెగనమ్మడం సరికాదన్నారు. కూటమి ప్రభుత్వ కక్షపూరిత విధానాలను తీవ్రంగా నిరసిస్తూ వైఎస్ఆర్‌షీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు నియోజకవర్గంలో ప్రజలు స్వచ్ఛందంగా కోటి సంతకాల సేకరణలో పాల్గొని తమ మద్దతు తెలిపారని చెప్పారు. అన్ని మండలాలు, పంచాయతీల్లో కోటి సంతకాల సేకరణ చేపట్టామని, ఈ ప్రజా ఉద్యమంలో విద్యార్థులు, యువత, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని నిరసిస్తూ సంతకాలు చేశారని తెలిపారు. ఇది తమ బిడ్డల ఉజ్వల భవిష్యత్తు, ప్రభుత్వ వైద్య రంగాన్ని పరిరక్షించుకునేందుకు తలపెట్టిన ప్రజా ఉద్యమంగా వారు అభివర్ణించారు. అక్టోబరు 10న ప్రారంభమైన కోటి సంతకాల సేకరణ గత రెండు నెలలుగా రచ్చబండ కార్యక్రమం ద్వారా ఉధృతంగా సాగిందని పేర్కొన్నారు. ఈ నెల 15 నాటికి జిల్లా కేంద్రాల నుంచి తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయానికి కోటి సంతకాలను ర్యాలీగా తరలించనున్నామని, ఈ నెల 17న పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ పెద్దలు ఈ కోటి సంతకాలను గవర్నర్కు అందిస్తారని చెప్పారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పార్టీ శ్రేణులను వారు అభినందించారు.