తిరుపతి: శాసనసభ వేదికగా తిరుమల లడ్డూ అంశంపై జరిగిన చర్చ కేవలం రాజకీయ కక్షసాధింపు కోసమేనని, పడిపోతున్న హెరిటేజ్ సంస్థ షేర్ల విలువను పెంచుకోవడానికే చంద్రబాబు ప్రభుత్వం ఈ నాటకానికి తెరలేపిందని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి మండిపడ్డారు. మంగళవారం తిరుపతిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఆయన కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు హయాంలోనే నెయ్యి కల్తీకి పునాదులు పడ్డాయని, నెయ్యి సరఫరా చేస్తున్న ఇందాపూర్ డెయిరీ (హెరిటేజ్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్), హర్ష్ ఫ్రెష్ (బోలేబాబా) సంస్థలను గతంలో చంద్రబాబు ప్రభుత్వమే తీసుకొచ్చిందని స్పష్టం చేశారు. గతంలో రూ. 278కే నెయ్యి సరఫరా చేసిన ఇందాపూర్ సంస్థకు, ఇప్పుడు ఏకంగా రూ. 658 చెల్లించడంలో ఉన్న అంతరార్థం ఏమిటని ప్రభుత్వాన్ని నిలదీశారు. కేవలం వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర రెడ్డిలను అరెస్టు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పావులు కదుపుతోందని ఆయన మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పనిచేసిన సిట్ తన ఛార్జిషీట్‌లో ఎక్కడా మా ప్రమేయం ఉందని చెప్పలేదని.. అయినా ప్రభుత్వం మాత్రం అబద్ధాలతో బురద జల్లుతోందని మండిపడ్డారు. దివంగత వైయస్సార్ హయాంలో అన్యమత ప్రచారాన్ని అడ్డుకోవడానికి మరియు ఏడు కొండల పవిత్రతను కాపాడటానికి జీవో నెం. 746, 747లను తీసుకొస్తే.. దానిపైనా సభలో చంద్రబాబు పచ్చి అబద్దాలు చెబుతూ టీటీడీని చంద్రబాబు అపవిత్రం చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు తాను క్రిస్టియన్ అంటూ వ్యక్తిగత విమర్శల చేయడంపైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుచానూరులో హిందూ సంప్రదాయం ప్రకారం 30 వేల మంది సాక్షిగా జరిగిన తన కుమార్తె వివాహానికి... చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ, సోదరుడు రామ్మూర్తి నాయుడు కూడా వచ్చి అక్షింతలు వేసిన విషయాన్ని గుర్తు చేశారు. లడ్డూ వ్యవహారంలో మేము ఏ తప్పూ చేయలేదు కాబట్టి ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని భూమన స్పష్టం చేశారు. కేవలం రాజకీయ ఉనికి కోసం, తమ వ్యాపార సంస్థల లాభాల కోసం పవిత్రమైన శాసనసభను అపవిత్రం చేస్తున్న చంద్రబాబు తీరును తీవ్రంగా ఆక్షేపించారు. ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే... శాసనసభలో హెరిటేజ్ షేర్లు విపరీతంగా పడిపోతున్నాయి కనుక వాటిని పైకి లేపడానికి శాసనసభలో పాత్రికేయ సమావేశం తరహాలో తిరుమల లడ్డూ అంశంపై ఏకపక్ష చర్చ జరిగింది. వైయస్ఆర్‌సీపీ మీద, వైయస్.జగన్ మీద ప్రభుత్వం పనికట్టుకుని దుష్ప్రచారం చేస్తూ.. ఉద్దేశపూర్వకంగా దాడి చేసింది. ఏడాది కాలంగా చెప్పినమాటలనే మరలా మరలా చెబుతూ వస్తోన్న కూటమి నేతలు ఇవాళ శాసనసభ సాక్షిగా మరలా అవే అబద్దాలను వల్లే వేశారు. దెయ్యాలు వేదయజ్ఞం చేసినట్లు.. కూటమి నేతలు హిందూ ధర్మం మీద మాట్లాడ్డం అంత కంటే దారుణం. ● ఇందాపూర్ టెండర్లపై సభ సాక్షిగా అబద్దాలు... నెయ్యి కల్తీకి సంబంధించి పచ్చి అబద్దాలతో ఇవాళ అసెంబ్లీలో 4 గంటలపాటు చర్చ సాగింది. హర్ష్ ప్రెష్ డెయిరీని మేమే తీసుకొచ్చామని చెప్పారు. బోలేబాబాకు పూర్వనామమైన హర్ష్ ప్రెష్ డెయిరీని తెచ్చిందే చంద్రబాబు ప్రభుత్వం. వారి హయాంలోనే 80 వేల కేజీల నెయ్యిని వాళ్లు సరఫరా చేశారు. చంద్రబాబు టైంలోనే హర్ష్ ప్రెష్ డెయిరీకి టెండర్లలో పాల్గొనే అవకాశం ఇచ్చారు. హెరిటేజ్ సంస్థ వెబ్ సైట్ లో తన మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ గాపేర్కొన్న ఇందాపూర్ డెయిరీని తీసుకొచ్చింది కూడా చంద్రబాబే. అదే ఇందాపుర్ సంస్థ కేజీ రూ.278 కి సరఫరా చేశారు. ఆశ్చర్యకరంగా టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్న జ్యోతుల నెహ్రూ కర్ణాటక మిల్క్ డెయిరీ సంస్థ 20 లక్షల కేజీల నెయ్యి సరఫరా టెండర్లలో పాల్గొని, 10 లక్షల కేజీల నెయ్యి సరఫరా టెండర్లలో పాల్గొనలేక పోయారు,అందువల్ల ఎల్ -2 గా ఉన్న ఇందాపూర్ డెయిరీకి ఇచ్చామని చెప్పారు. అంటే బోర్డులో తీర్మానాలు కూడా చూసే ఓపిక లేని వారు బోర్డు సభ్యులుగా ఉన్నారు. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కు వచ్చిన 20 లక్షల కేజీల నెయ్యి సరఫరా టెండర్... కేవలం కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ మాత్రమే పాల్గొన్న ఏకైక బిడ్డర్ ఉన్న టెండర్. అందులో మరెవ్వరూ పాల్గొనలేదు. కానీ పాలకమండలి సభ్యుడు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాత్రం అదే టెండరులో ఎల్ -2 గా ఉన్న ఇందాపూర్ డెయిరీకి 35 శాతం సరఫరాకు అవకాశం ఇచ్చామని శాసనసభసాక్షిగా పచ్చి అబద్దాలు చెప్పారు. ఈ టెండర్లు అయిన మూడో రోజునే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ డైరెక్టర్ మీడియాతో మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 50 లక్షల కేజీలు సరఫరా చేశాం, మరో 20 లక్షల కేజీలు నెయ్యి సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అయినా కూడా కూటమి ప్రభుత్వంలోని పెద్దలు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వారిని నెయ్యి సరఫరా చేయకుండా బలవంతంగా ఆపి... మీరు 10 లక్షల కేజీలకే పరిమిత అవ్వాలని చెప్పారు. ఆ తర్వాత మిగిలిన 10 లక్షలకు టెండర్లు పిలిచి, ఇందాపూర్, మదర్ డెయిరీలు రెండూ ఎల్-1, ఎల్ -2 గా టెండర్లు దక్కించుకున్నాయి. అదే టెండర్లలో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కూడా ఎల్ -3 గా పాల్గొంది. అంటే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ సరఫరా చేయలేమని చెప్పిందన్న కూటమి నేతల వ్యాఖ్యలు అబద్దాలేని తేలిపోయింది. రూ.658, రూ.657 లకు కోట్ చేసి టెండర్లు తీసుకున్నారు. ఇదే విషయాన్ని మా నాయకుడు వైయస్.జగన్ ప్రస్తావించారు. హెరిటేజ్ మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థ అయిన ఇందాపూర్ రూ.278 కే ఆ రోజు నెయ్యి సరఫరా చేస్తే... ఒకేసారి రూ.658 కు ఎలా పెరిగిందని ప్రశ్నిస్తే వాటికి సమాధానాలు చెప్పడం లేదు. ● వైయస్ఆర్‌సీపీ నేతల అక్రమ అరెస్టే లక్ష్యంగా.... కేవలం వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డిల అరెస్టు చేయడమే లక్ష్యమన్నట్టు మాట్లాడారు. సిట్ తన ఛార్జిషీట్ లో ఎక్కడా మా ప్రమేయం ఉందని ప్రస్తావించలేదు. మేము సుబ్రమణ్యం స్వామి చేత రిట్ పిటిషన్ వేయించినట్లు మాపై ప్రచారం చేయిస్తున్నారు. మీరు భగవంతుడి పట్ల చేస్తున్న అపచారం పై ఆయన సుప్రీం కోర్టుకు వెళ్లి ఉండొచ్చు. మీరు దాని గురించి మాట్లాడుతున్నారే తప్ప మేమెక్కడ ప్రస్తావించలేదు. అసెంబ్లీ సాక్షిగా అందరూ పచ్చి అబద్దాలే మాట్లాడారు. ● ఏడు కొండలు జీవో ఇచ్చిందే వైయస్సార్... ఓ శాసనసభ్యుడు దివంగత నేత వైయస్.రాజశేఖర్ రెడ్డి రెండు కొండలు జీవో తెచ్చారని ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నాడు. వాస్తవానికి 2007 జూన్ నెలలో జీవో నెంబరు 746, జీవో నెంబరు 747 రెండింటిని వైయస్.రాజశేఖర్ రెడ్డి గారే ఇచ్చారు. హిందూ దేవాలయాల్లో అన్యమత ప్రచారం జరగకూడదని 747 జీవోను, 352 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఏడు కొండలన్నీ శ్రీ వేంకటేశ్వరస్వామి క్షేత్రానికి చెందుతాయని జీవో ఇచ్చింది కూడా వైయస్.రాజశేఖర్ రెడ్డి మాత్రమే. గతంలో 1894 ప్రాంతంలో బ్రిటిష్ వారు తిరుమల 25 కిలోమీటర్ల పరిధిలో ఉందని చెబితే.. దాన్ని సవరించి 352 కిలోమీటర్లకు పెంచి తిరుమల క్షేత్ర మహిమను పెంచింది వైయస్.రాజశేఖర్ రెడ్డి అయితే... 2009 ఎన్నికల్లో ప్రచారం చేస్తూ... టీడీపీ అధికారంలోకి వస్తే వైయస్సార్ ఇచ్చిన రెండు జీవోలను తీసివేస్తానని ముస్లిం మైనార్టీ సభలో చెప్పిన వ్యక్తి చంద్రబాబునాయుడు. ఆయన వైయస్సార్ గురించి, జీవోలు గురించి పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు. ● బట్టబయలైన హెరిటేజ్ - ఇందాపూర్ బంధం.. సుప్రీం కోర్టు ప్రకటించిన సిట్ తన నివేదికలో వైయస్ఆర్‌సీపీ నేతల ప్రమేయం లేదని, కరుణాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి లను దోషులగా ప్రకటించలేదన్నదే చంద్రబాబు బాధ. నెయ్యి వ్యవహారంలో టీడీడిలో పనిచేస్తున్న పనిచేస్తున్న అధికారులు, నెయ్యి సరఫరాదారులు, కింద స్థాయి ఉద్యోగులు 36 మందిని దోషులగా ప్రకటిస్తే దానిపై మీరు ఏకసభ్య కమిషన్ వేశారు. ఆ ఏకసభ్య కమిషన్ పరిధిని కూడా సుప్రీం కోర్టు నిర్దేశించింది. అయినా వైయస్ఆర్‌సీపీ నేతలు నెయ్యి కల్తీ వ్యవహారంలో కూటమి నేతలు భగవంతుడ్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు నడుపుతున్నారన్న అపచారం నింద మీ మీద పడింది. దాన్ని తుడుుకోవడానికి మీరే ఇందాపూర్ డెయిరీని తీసుకొచ్చారు. దీంతో ఇందాపూర్ కి హెరిటేజ్ కి మధ్య ఉన్న సంబంధం బయటపడ్డంతో ఒక్కసారిగా హెరిటేజ్ షేర్లు విలువ అమాంతంగా పాతాళంలోకి పడిపోయాయి. దాన్ని పైకి లేపడానికే మీరు శాసనసభలో నెయ్యి వ్యవహారాన్ని చర్చకు తీసుకొచ్చారు. కానీ వాస్తవాలు ప్రజలక చెప్పాలన్న ఉద్దేశం మీకు లేదు. ● ఛాలెంజ్ చేస్తున్నాం నిరూపించండి.. మేము బయపడి పారిపోయే మనుషులం కాదు. మేం ఏ తప్పూ చేయలేదు కాబట్టి ధైర్యంగా ఉన్నాం. నీ హయాంలో నియమించిన సిట్ మీరు చెప్పినట్లు వింటుంది కాబట్టి.. మేం దాన్ని వ్యతిరేకించాం. సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మీరు దాన్ని కూడా ఆక్షేపిస్తారు. సాక్షాత్తూ అదే సుప్రీం కోర్టు మీ పట్ల ఆక్షేపణ తెలిపింది. ఆ విషయం గురించి మాట్లాడ్డం లేదు. నిపుణులు ఏడాది కాలంగా పదుల సంఖ్యలో మాట్లాడుతూ... కొవ్వు పూర్తిగా లేదని ఎన్ డీ డీ బీ,ఎన్ డీ ఆర్ ఐ లు నూటికి నూరుశాతం చెప్పరని.. ఆవుల తినే ఆహారం కారణంగా అందులో ఒకటి అరా కొవ్వు శాతం ఉంటుందన్న విషయాన్నే ఎన్ డీ డీ బీ ప్రకటించిందని చెప్పారు. అయినా చంద్రబాబు ఇవాళ శాసనసభ సాక్షిగా ఎన్ డి డి బీ ఇచ్చిన రిపోర్టు ప్రకారమే మాట్లాడానని చెబుతున్నారు. కానీ ఆ రోజు మీరు వైయస్.జగన్ ప్రభుత్వం లడ్డూలో నెయ్యికి బదులుగా ఆవుకొవ్వు కలిపారని చెప్పలేదా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే తిరుమల నుంచి అయోధ్యకి పంపించిన లక్ష లడ్డూల్లో ఆవుకొవ్వు, పందికొవ్వు, చేపనూనె కలిపారని చెబుతున్నారు. ఇవాళ కూడా అదేమాట చెబుతున్నాడు. మీ దగ్గరే బోర్డు సభ్యుడు బోరా ఉన్నాడు ఆయన్ని అడిగితే సరిపోతుంది. ● నా కుటుంబ వ్యవహారాలపైనా అబద్దాలే... నేను నా కుమార్తె కు క్రిస్టియమ్ మ్యారేజ్ చేశానని పోటో వేశారు. నా కుమార్తె పెళ్లిని తిరుపతిలో తిరుచానూరు పరిధిలో 30 వేల మంది అతిధుల సమక్షంలో మీ వియ్యంకుడు , లోకేష్ మామ బాలకృష్ణ సహా వచ్చి అక్షింతలు వేశారు. నీ తమ్ముడు, నా స్నేహితుడు నారా రామ్మూర్తి కూడా వచ్చి అక్షింతలు వేసారు. అదే విధంగా ఆనాటి హైకోర్టు న్యాయమూర్తులు సైతం 13 మంది వచ్చారు. నా కూతురు పెళ్లని హిందూ సాంప్రదాయం ప్రకారం చేశానని ఆ దేవదేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తిరుమల ఆలయ ప్రధానార్చకుల దగ్గర నుంచి తిరుమల వేదపారాయణదారులందరూ వచ్చి నా కుమార్తెను ఆశీర్వదించాను. మీరు శాసనసభలో ఆ ఫోటో వేసి నన్ను క్రిస్టియన్ గా మీరు చూపిస్తే.. దీనికేం సమాధానం చెబుతారు? మీరు బైబిల్ పట్టుకుని ఉన్నారు, మీరు క్రిస్టియనా చంద్రబాబూ? నమాజు చేస్తున్న ఈ ఫోటో చూసి మిమ్నల్ని ముస్లిం అంటే ఎలా ఉంటుంది చంద్రబాబూ? మరోవైపు పవన్ కళ్యాణ్ మూడో భార్య క్రిస్టియన్... అలాంటప్పుడు సనాతన ధర్మ పరిరక్షకుడు అని చెప్పుకునే ఆయన్ను క్రిస్టియన్ అని ఎందుకు అనడం లేదు? నన్నెలా అంటున్నారు?. క్రిస్టియన్ యువతలుతో ఉన్న లోకేష్ ని క్రిస్టియన్ అనాలా? మీరు క్రిస్టియన్ అనే చెబుతున్న కరుణాకర్ రెడ్డి చేసినంత భారీ హైందవ ప్రచారం ఇంతవరకు ఏ పాలకమండలి చైర్మన్ చేయలేదు. మీరు ఎన్ని రకాల అబద్దాలు చెప్పినా కల్తీ నెయ్యి మూలాలు మీ హయాంలోనే మొదలయ్యాయి. మేం నిబంధనలు సఢలించడం ద్వారా కొత్తగా వచ్చిన డెయిరీ సంస్థను చూపించండి. మీ హయాంలో నిబంధనలు మీరు రూపొందించనప్పుడే ఇందాపూర్ డెయిరీ, హర్ష్ ప్రెష్ డెయిరీగా ఉండి పేరుమార్చుకున్న బోలేబాబా కూడా వచ్చాయి. ● నేను స్వచ్చమైన హిందువుని... మీ అక్రమాలపై మేం నిలదీస్తున్నామని, మా ప్రశ్నలకు జవాబివ్వడానికి మీకు శక్తి సరిపోవడం లేదు కాబట్టి. .నా పై దుష్ర్పచారం చేస్తూ, నన్ను నాస్తికుడిగా చిత్రీకరించి ఆత్మతృప్తి పొందే ప్రయత్నం చేస్తున్నారు. మమ్నల్ని నేరస్తులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో మీ హయాంలో రూ.276కు కేజీ నెయ్యి ఇందాపూర్ డెయిరీ సరఫరా చేస్తే.. మా హయాంలో రూ.320కే స్వచ్చమైన నెయ్యి వస్తుందా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు అదే ఇందాపూర్ రేటు భారీగా పెంచి ఏకంగా రూ.658కే కేజీ నెయ్యి సరఫరా చేయడం వెనుక ఉన్న కుట్ర ఏంటో బయటపెట్టాలి. మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ప్రజలను నమ్మించడానికి మీ కంపెనీల షేర్ల ధరలు పెంచుకోవడానికే శాసనసభను వాడుకుంటున్నారు. ఆర్టీసీ టిక్కెట్లు మీ హాయంలో ముద్రిస్తే.. దాన్ని కూడా మా పై వేసి ఆరోపణలు చేస్తూ ... ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. పవిత్రమైన శాసనసభను సైతం అపవిత్రం చేస్తున్నారని మండిపడ్డారు. సిట్ ఇచ్చిన నివేదకపై కూడా నమ్మకం లేకే ఈ ప్రభుత్వం ఏక సభ్య కమిషన్ ద్వారా మమ్నల్ని నేరస్తులుగా నిలబెట్టడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగమే ఇవాళ్టి శాసనసభ చర్చ అని భూమన కరుణాకర రెడ్డి తేల్చి చెప్పారు.