అనంతపురం : ఆర్డీటీ సంస్థ పరిరక్షణ కోసం వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోస్టుకార్డు ఉద్యమం చేపట్టనున్నట్లు వైయస్ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య ప్రకటించారు. మార్చి 10వ తేదీన కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కుందుర్పిలో కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తామని చెప్పారు. మంగళవారం వైయస్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఆర్డీటీ అనేది ఒక వరమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదల అభ్యున్నతి, విద్య, వైద్యం, క్రీడలు, మహళా సాధికారతలో ఆర్డీటీ సేవలు అందించిందని తెలిపారు. కేంద్రం ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రిజిస్ట్రేషన్ రెన్యూవల్ చేయకపోవడంతో గతంలోనే పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయని గుర్తు చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆర్డీటీ సేవలు అందిస్తోందన్నారు. ప్రజా సంఘాలతో పాటు అనేక రాజకీయ పార్టీలు ఆర్డీటీకి అండగా నిలిచాయన్నారు. ప్రతి కార్యక్రమానికి వైయస్‌ఆర్‌సీపీ మద్దతుగా నిలవడమే కాకుండా భాగస్వామ్యం కూడా అయ్యిందని గుర్తు చేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం సమన్వయకర్త రంగయ్య నాయకత్వంలో బైక్ ర్యాలీ, పాదయాత్ర చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వాలకు సమాంతరంగా ఆర్డీటీ సేవలు అందించిందని, అలాంటి సంస్థ మనుగడ నేడు ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి వచ్చిందన్నారు. ఓ వైపు ఉద్యమాలు జరుగుతుంటే మరోవైపు అధికార పార్టీ నేతలు మాత్రం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంతో మాట్లాడాం అని.. స్వయంగా కళ్యాణదుర్గంలో కనకదాస విగ్రహావిష్కరణకు వచ్చిన నారా లోకేష్ కూడా ఆర్డీటీ విషయంలో హామీ ఇచ్చారన్నారు. గతంలో మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్ కూడా ఆర్డీటీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారని తెలిపారు. కళ్యాణదుర్గం, రాయదుర్గం ఎమ్మెల్యేలు కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లాం.. న్యాయం జరుగుతుందని చెబుతూ పత్రికల్లో వార్తలు రాయించుకోవడం మినహా ఒరిగిందేమీ లేదని చురకలంటించారు. ప్రస్తుతం ఆర్డీటీ సేవలు అందించలేక ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఇక్కడ ఆర్డీటీ లేకపోతే ఆ సంస్థకు వచ్చే నష్టం ఏమీ లేదని, అంతిమంగా ప్రజలు నష్టపోతారని అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. ఆర్డీటీ పరిరక్షణ కోసం వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ‘సేవ్ ఆర్డీటీ’ పేరుతో లక్ష మందితో పోస్టు కార్డులను ప్రధాని నరేంద్రమోదీకి పంపనున్నట్లు ప్రకటించారు. ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవద్దని సూచించారు. మతాన్ని బూచిగా చూపి ఆర్డీటీని అడ్డుకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మూతపడే స్థితిలో ఆర్డీటీ ఆర్డీటీ సంస్థ మూతపడే స్థితిలో ఉందని కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే 2025 ఏప్రిల్ నుంచే ఆర్డీటీ సంస్థకు చెందిన అకౌంట్లు ఫ్రీజ్ అయ్యాయన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ హయాంలో ఆర్డీటీకి ఎలాంటి ఇబ్బందులు కలగలేదని చెప్పారు. ఆర్డీటీ కోసం తాము పాదయాత్ర చేస్తే విమర్శలు చేశారని, ఆర్డీటీ విషయంలో తాము రాజకీయాలు చేయదలచుకోలేదన్నారు. ఆర్డీటీ అనేది ఒక కులం, మతానికి సంబంధించిదని కాదని.. ఇక్కడి ప్రజలకు సంబంధించినది తెలిపారు. ఇక్కడ త్రిబుల్ ఇంజన్ సర్కార్ ఉందని... మంత్రులు సత్యకుమార్, పయ్యావుల కేశవ్, అహుడా చైర్మన్ ఉన్నా ఎందుకు నచ్చజెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు. చివరకు ఆర్డీటీ సంస్థ క్రెడిబులిటీని ప్రభుత్వమే దెబ్బతీస్తోందన్నారు. మార్చి 10వ తేదీన కుందుర్పిలో ‘సేవ్ ఆర్డీటీ’ పేరుతో నాలుగు భాషల్లో ప్రధాని మోదీకి లక్ష పోస్టుకార్డులు పంపే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. అప్పటిలోగా ప్రభుత్వం ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆర్డీటీ బ్యాంక్ ఖాతాల్లో ఉన్న నిధులపై ఫ్రీజ్ ఎత్తివేయాలన్నారు.