ప‌ల్నాడులో మ‌రోసారి రెచ్చిపోయిన ప‌చ్చ‌మూక‌లు

జూలకల్లులో వైయ‌స్ఆర్‌సీపీ కార్య‌క‌ర్త‌పై దాడి

ప‌ల్నాడు:  ప‌ల్నాడు జిల్లాలో అధికార పార్టీ ఆగ‌డాల‌కు హ‌ద్దు అదుపు లేకుండా పోయింది. ప్ర‌శాంతంగా ఉన్న ప‌ల్నాడు ప్రాంతంలో కూట‌మి నేత‌లు రెచ్చిపోయి దాడుల‌కు తెగ‌బ‌డుతున్నారు. గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల మండలం జూలకల్లు గ్రామంలో ప‌చ్చ‌మూక‌లు బ‌రితెగించారు. టీడీపీ వర్గీయుల దాడిలో వైయ‌స్ఆర్‌సీపీ  కార్యకర్త బీరవల్లి రామిరెడ్డి తీవ్రంగా గాయపడి,  ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

గ్రామంలో వరుస దాడులు జరుగుతుండటం స్థానికుల్లో భయాందోళనలు కలిగిస్తోంది. శాంతిభద్రతల పరిస్థితిపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల భద్రత కంటే రాజకీయ ప్రాధాన్యత పెరుగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదని, భయపెట్టే రాజకీయాలు ఎప్పటికీ నిలవవని స్థానిక నాయకులు పేర్కొన్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇక గాయపడిన రామిరెడ్డిని అర్ధరాత్రి 2 గంటల సమయంలో కూడా అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త డాక్ట‌ర్‌. అశోక్ కుమార్ చింతలపూడి  పరామర్శించి చికిత్స అందించారు.  రాష్ట్రంలో కూట‌మి నేత‌ల తీరును  ప్రజలు గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు తమ తీర్పు ఇస్తారని అశోక్‌కుమార్ వ్యాఖ్యానించారు. కాగా, గుర‌జాల నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త కాసు మ‌హేష్‌రెడ్డి సంఘ‌ట‌న‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రామిరెడ్డిని ఆయ‌న ప‌రామ‌ర్శించి ధైర్యం చెప్పారు.

Back to Top