అసెంబ్లీ మీడియా పాయింట్, వెలగపూడి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా గాడితప్పాయని, దేశంలో ఏ రాష్ట్రంతో పోల్చి చూసినా ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక దోపిడీలు, దౌర్జన్యాలు, హత్యలు, మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువైపోయానని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలగపూడిలోని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ సర్వేలే శాంతిభద్రతలు పతనమైపోయాయనే విషయాన్ని రుజువు చేస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రభుత్వం పబ్బం గడుపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనను పూర్తిగా గాలికొదిలేశారని, వైయస్ఆర్‌సీపీ హయాంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న పోలీస్ వ్యవస్థ నేడు అట్టడుగు స్థానానికి పడిపోయిందని చెప్పారు. రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతల గురించి చర్చించమంటే వైయస్ఆర్ హయాంలో అంటూ డైవర్షన్ పాలిటిక్స్‌కి కూటమి ప్రభుత్వం తెరలేపిందని ధ్వజమెత్తారు. దేశానికే ఐకాన్‌గా నిలిచిన ఆయన పాలనను విమర్శించే అర్హత కూటమి నాయకులకు లేదని చెప్పారు. కూటమి పాలనలో అవనీతి కింది స్థాయి వరకు వేళ్లూనుకుని పోయిందని, చినబాబు, పెదబాబులకు కమీషన్లు ఇచ్చే పేరుతో రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారని మండిపడ్డారు. వైయస్ జగన్ గారు సీఎంగా ఉన్న ఐదేళ్లలో ప్రధాని మోడీ గారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకున్నామని చెబుతూ సోము వీర్రాజు వ్యాఖ్యలను ఖండించారు. ● నేరస్తుల్లో తప్పు చేసినా ఏమీ కాదన్న ధైర్యం రాజమండ్రిలో కల్తీ పాలతో జరిగిన మరణాలు ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని, కల్తీ పాలు తాగి ఐదురుగు చనిపోయి, వందల మంది ఆస్పత్రిపాలైనా ఇప్పటికీ సంబంధిత అధికారులు ఒక్కరిపైనయినా చర్య తీసుకున్నారా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో అవినీతి వ్యవస్థీకృతం చేశారని మండిపడ్డారు. తప్పు చేస్తే ప్రభుత్వం శిక్షింస్తుందన్న భయం నేరగాళ్లలో లేదని, ఎన్ని తప్పులు చేసినా తప్పించుకోవచ్చన్న ధైర్యం ప్రభుత్వం నిందితులకు కల్పించిందని చెప్పారు. రాష్ట్రంలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే కూటమి నాయకులు మాత్రం మంచి ప్రభుత్వం అంటూ సభలో భజన చేయడం సిగ్గుచేటన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వారిని వేధిస్తున్నారని, నిందితులను వదిలేసి బాధితులపై కేసులు నమోదు చేస్తున్న దుర్మార్గమైన వాతావరణం రాష్ట్రంలో నెలకొందని అసహనం వ్యక్తం చేశారు. ప్రజా పాలన పట్ల ఈ ప్రభుత్వం బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని చెప్పారు. ప్రతి గంటకు 50 మంది మహిళలపై వేధింపులు : స‌్పష్టం చేసిన ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి గత కొన్నేళ్లుగా ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థినులపై జరుగుతున్న అఘాయిత్యాలు పెరుగుతున్న మాట వాస్తవమేనా? ఆ నిందితులపై తీసుకున్న చర్యలేంటి? రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు పెరుగుతున్న మాట వాస్తవమేనా? 2024 జూన్ నుంచి వాటి వివరాలు ఇవ్వాలని సభలో ప్రశ్నించడం జరిగింది. దీనికి 2024లో 1,533 కేసులు, 2025లో 1,445 కేసులు నమోదయ్యాయని ప్రభుత్వ బదులిచ్చింది. అంటే గంటకు నాలుగైదు కేసులు నమోదయ్యాయని ప్రభుత్వమే అంగీకరించింది. ప్రతి గంటకు 50 నుంచి 60 మంది మహిళలపై వేధింపులు జరుగుతున్నాయని తెలిపింది. రాష్ట్రంలో మహిళలపై నేరాలు విపరీతంగా పెరిగిపోయాయని, ఈ ఒక్క ఏడాదిలోనే 1,628 మంది మహిళలపై దాడులు జరిగాయని కలెక్టర్ల కాన్ఫరెన్సులో సీఎం చంద్రబాబుకి అధికారులే చెప్పారు. చంద్రబాబు నివాసం ఉంటున్న గుంటూరు జిల్లాలో మహిళలపై 11 శాతం నేరాలు పెరిగిపోయాయి. హోంమంత్రి ఇన్చార్జిగా ఉన్న విజయనగరంలోనూ మహిళలపై నేరాలు పెరిగిపోయాయి. మహిళలపై నేరాలు పెరిగిపోవడానికి కారణం రాష్ట్రంలో ఏరులైపారుతున్న గంజాయి, మద్యం, డ్రగ్స్‌తోపాటు పోలీసుల అలసత్వమే కారణం. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే మదనపల్లెలో ఏడేళ్ల బాలికను చంపేసిన ఘటన చోటుచేసుకుంది. ఎన్‌డీపీఎస్ కేసులు శ్రీకాకుళం జిల్లాలో ఏకంగా 213 శాతం, నెల్లూరులో 121 శాతం, కోనసీమలో 72 శాతం, ఏలూరు, కర్నూలు జిల్లాలలో 50 శాతం పెరిగాయి. ఏకంగా 15 జిల్లాల్లో మద్యం, గంజాయి, డ్రగ్స్ వాడకం పెరిగిపోయింది. కానీ పోలీస్ కాల్ సెంటర్ 112కి ఫిర్యాదు చేస్తే 26 నిమిషాల వరకు పోలీసులు స్పందించడంలేదని, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేరుగా ఏపీ సీఎం చంద్రబాబుకి లేఖ రాశారు. కాగా పోలీస్ స్పందనలో నేషనల్ యావరేజ్ చూస్తే 18 నిమిషాలే ఉంది. ఏకంగా కూటమి ఎమ్మెల్యే మహిళల జీవితాలతో చెలగాటం ఆడుతున్నా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. మాజీ మంత్రి ఆర్కే రోజా గారి మీద కూటమి ఎమ్మెల్యే నీచంగా మాట్లాడినా ప్రభుత్వం పట్టించుకోలేదు. కృష్ణా జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక మీద దాడి చేసిన రౌడీలపై కూడా చర్యల్లేవు. కూటమి ఎమ్మెల్యేల వేధింపులో ఎంతోమంది మహిళలు ఆత్మహత్యాయత్నాలు చేశారో లెక్కేలేదు. అయినా ఏ ఒక్కరి మీద కనీసం కేసు కూడా నమోదు చేసినా దాఖలాలు లేవు. ఎమ్మెల్యేలే బరితెగించి నేరాలు చేస్తున్నా.. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవడం లేదు. మహిళల భద్రతను ఈ ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది. పోలీస్ శాఖ పనితీరుపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక నివేదిక విడుదల చేయడం వాస్తవమేనా? ఇందులో ఏపీ ర్యాంకు ఎంత అని ప్రశ్నిస్తే.. ఈ ప్రశ్న వర్తించదని ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. కానీ వాస్తవం చూస్తే బీఎన్ఎస్ఎస్ చట్టాల అమలులో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ దేశంలో 36వ స్థానంలో ఉందని కేంద్రం స్పష్టంగా చెప్పింది. పోలీసులను రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకు వాడుతున్న కారణంగా ఈ దుస్థితి వచ్చింది. ఇప్పటికైనా ప్రజల రక్షణపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి.