అమరావతి: శాసనమండలి సమావేశాలు ప్రారంభమైన అనంతరం ప్రశ్నోత్తరాల సమయంలో మహిళల భద్రత అంశంపై ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలు పెరుగుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలపై నేరాలు పెరిగాయని ఆమె ఆరోపించారు. సుమారు 1485 మంది మహిళలపై నేరాలకు సంబంధించి కేసులు నమోదయ్యాయని, రోజుకు సగటున నలుగురు మహిళలు అత్యాచారానికి గురవుతున్నారని మండలిలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే మహిళలపై నేరాలు దాదాపు 10 శాతం పెరిగాయని, అలాగే హోంమంత్రి ఇన్‌చార్జిగా ఉన్న విజయనగరం జిల్లాలో కూడా మహిళలపై నేరాలు అధికమయ్యాయని విమర్శించారు. రాష్ట్రంలో గంజాయి లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందని అన్నారు. ప్రత్యేకంగా మదనపల్లెలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనను ప్రస్తావిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే తిరుపతిలో డ్రగ్స్, గంజాయి వినియోగం పెరిగిందని ఆరోపించారు. 112 అత్యవసర సేవలకు ఫోన్ చేస్తే పోలీసులు సుమారు 25 నిమిషాల తరువాత చేరుతున్నారని, ఇది మహిళల భద్రతకు ప్రమాదకరమని తెలిపారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, బాధిత కుటుంబాలను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, అధికార పార్టీ ఎమ్మెల్యే ఒక మహిళను గర్భవతిని చేసి ఐదు సార్లు గర్భస్రావం చేయించారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మహిళల రక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె సభలో డిమాండ్ చేశారు.