గుంటూరు: చంద్రబాబు చెప్పిందల్లా చేయడమే పవన్ కళ్యాణ్ నమ్ముకున్న సిద్ధాంతమని, తనకు కావాల్సిందల్లా చంద్రబాబు నుంచి తీసుకుంటూ ఆయన ఆదేశించినప్పుడల్లా వైయస్ జగన్ గారిని తిట్టడానికి పవన్ కళ్యాణ్ తయారవుతున్నాడని గుంటూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తన బుర్రను స్విచ్చాఫ్ చేసుకున్నాడని, అందుకే ఎప్పుడేం మాట్లాడతాడో ఆయనకే క్లారిటీ ఉండటం లేదన్నారు. తీవ్రమైన పొలిటికల్ దారిద్ర్యంలోకి పడిపోయిన పవన్.., లోకేష్ కన్నా ఇమ్మెచ్యూర్డ్ పొలిటీషియన్ అనిపించుకుంటున్నాడనని వివరించారు. చంద్రబాబు నుంచి పుచ్చుకుంటున్నాడు కాబట్టే ఆయన అసమర్థ, అనైతిక విధానాలపై పవన్ కి నోరు పెగలడం లేదని ఎద్దేవా చేశారు. పార్టీ పెట్టిన నాటి నుంచి మూడు ఎన్నికలొస్తే మూడు సిద్దాంతాలు చెప్పిన పవన్ కళ్యాణ్ అంతిమ సిద్ధాంతం మాత్రం చంద్రబాబుకి చెంచాగిరీ చేయడమేనని దుయ్యబట్టాడు. ఆయన ఇంకా ఏమన్నారంటే... 18 నెలలుగా జగన్ మీద బురదజల్లడమే పని మెడికల్ కాలేజీల ప్రైవటీకరణకు వ్యతిరేకంగా వైయస్ఆర్‌సీపీ చేపట్టిన ఉద్యమాన్ని రాక్షసుల్లా అణచడానికి కూటమి పార్టీ సర్వశక్తులూ ఒడుతున్నాయి. ఏదో విధంగా ప్రజల దృష్టిని మరల్చడమే లక్ష్యంగా కూటమి భాగస్వామ్య పక్షాలన్నీ పనిచేస్తున్నాయి. అధికారంలోకి వచ్చి 18 నెలలైనా ఏ ఒక్క క్షణం కూడా ప్రజలు మేలు చేసే ఆలోచన చేయకుండా ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారి మీద బురదజల్లే కార్యక్రమాలనే పదే పదే చేస్తున్నారు. అబద్ధాన్ని నిజమని నమ్మించేందుకు అనుకూల మీడియాలన్నీ ఒకటే స్వరం వినిపిస్తూ అడుగడుగునా ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా దుష్ప్రచారాలు సాగిస్తున్నారు. చివరికి మరింత దిగజారిపోయి దేవాలయాలను అడ్డం పెట్టుకుని బురదజల్లడానికి కూడా వెనుకాడటం లేదు. ఆఖరుకి వైయస్ జగన్ గారు కోర్టుకు హాజరయ్యేందుకు పక్క రాష్ట్రానికి వెళ్లినప్పుడు వచ్చిన ప్రజాదరణ చూసి కూడా ఓర్వలేకపోతున్నారు. అనుక్షణం వైయస్ జగన్ గారిని, వైయస్ఆర్‌సీపీని టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టాలని చూస్తూ ప్రజా సమస్యలను, ఎన్నికల హామీలను గాలికొదిలేశారు. వైయస్ జగన్ వ్యక్తిత్వాన్ని పలచన చేయాలని చూసిన ప్రతి సందర్భంలోనూ మూల్యం చెల్లించుకుంటూనే ఉన్నారు. పార్టీని కూడా పవన్ గాలికొదిలేశాడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, ఎన్నికలకు ముందు చెప్పిన మాటల గురించి పట్టించుకోకుండా చంద్రబాబు ఇస్తున్నది తీసుకుంటూ వైయస్ జగన్ గారిని తిట్టడానికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ తపన పడుతున్నాడు. 100 శాతం స్ట్రైక్ రేట్ ఇచ్చారని గొప్పలు చెప్పుకున్న ఆ మనిషి, ఓటేసిన ప్రజలకు న్యాయం చేయాలన్న బాధ్యతను పక్కన పెట్టేసి డైవర్షన్ పాలిటిక్స్‌తో కాలక్షేపం చేస్తున్నాడు. చంద్రబాబు ఆదేశిస్తే మీడియా ముందుకొచ్చి వైయస్ జగన్ గారి మీద నిందలేసే పొలిటికల్ దారిద్ర్యానికి దిగజారిపోయిన పవన్.. ఆఖరుకి తన పార్టీని కూడా గాలికొదిలేశాడు. మాజీ ముఖ్యమంత్రి తన సుదీర్ఘమైన ప్రెస్‌మీట్‌లో అనేక అంశాలను ప్రస్తావించి ప్రభుత్వాన్ని నిలదీస్తే వాటికి సమాధానం చెప్పుకోకుండా పరకామణి చోరీ కేసు గురించి ప్రస్తావన వచ్చినప్పుడు అదొక చిన్న చోరీ అన్న విషయాన్ని పట్టుకుని కూటమి నాయకులంతా వేలాడుతున్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో పవన్ కూడా అదే విషయం గురించి మాట్లాడాడు. పవన్ మాటలు, సిద్ధాంతాలపై ప్రజల్లోనే అనుమానాలు కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాలతో పరకామణి భవనాన్ని కట్టించి స్వయంగా ప్రారంభించింది వైయస్ జగన్ గారేనన్న విషయాన్ని పవన్ కి తెలుసుకోవాలి. చోరీకి పాల్పడిన వ్యక్తి రూ. 70 వేల చోరీకి రూ. 14 కోట్ల విలువైన ఆస్తులను స్వామివారికి స్వాధీన పరిచిన విషయం గురించి తెలుసుకోవాలి. రూ. 14 కోట్లతో పోల్చితే రూ. 70 వేలు చిన్నది కాదా? ఈ విషయాన్ని పట్టుకొచ్చి వైయస్ జగన్ గారి మీద బురదజల్లాలని చూడటానికి పవన్ కళ్యాణ్‌కి సిగ్గుండాలి. ఒక్కోసారి ఒక్కో మతం గురించే చెప్పుకునే అసలు పవన్ కళ్యాణ్.. ఏ ధర్మం పాటిస్తున్నాడో చెప్పాలి. తన తండ్రి కూడా కమ్యూనిస్ట్ అని ఒకసారి, దీపారాధనతో సిగిరెట్ వెలిగించుకుంటాడని ఒకసారి చెప్పి, ఇప్పుడు ఆయన ఇంట్లో ఉన్నప్పుడు నిత్యం రామ నామం వినిపించదని చెబుతున్నాడు. ఇవన్నీ విన్న ఎవరికైనా ఇంతకీ ఆయన ఏ ధర్మానికి కట్టుబడి ఉన్నట్టని అనుమానం కలగకుండా ఉంటుందా? ఆయనకు ఒక మతం, ధర్మం, సిద్దాంతం, నమ్మకం ఏవీ లేవని అనుమానం రావడంలో తప్పేముంది? ఒక్కో ఎన్నికకు పవన్ కళ్యాణ్ ఒక్కో వేషం కడతాడు. 2019లో పవన్ కళ్యాణ్.. చంద్రబాబుతో లేడు కాబట్టి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలాలి కాబట్టి ఆయన లౌకికవాది. 2024 ఎన్నికల్లో చంద్రబాబుతో ఉన్నాడు కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పాడు. ఇలా పార్టీ పెట్టిన నాటి నుంచి మూడు ఎన్నికలు జరిగితే మూడు వేషాలేసి చంద్రబాబుకి చెంచాలా పనిచేశాడు. దేవుడి పేరుతో రాజకీయం చేసే దౌర్భాగ్య పరిస్థితికి పడిపోయాడు. చంద్రబాబు చెప్పాడని జగన్‌ని తిడుతున్నాడు చంద్రబాబు చెప్పిందల్లా చేయడమే పవన్ కళ్యాణ్ నమ్ముకున్న సిద్ధాంతం. తాను అడిగిందల్లా చంద్రబాబు ఇస్తున్నాడు కాబట్టే చంద్రబాబుని ప్రశ్నించకుండా వైయస్ జగన్ గారి మీద నిందలేస్తున్నాడు. వైయస్ జగన్ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని అడ్డం పెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తున్నాడు. ఆధారాలేవీ లేకుండా జంతువుల కొవ్వు కలిసిన తిరుమల లడ్డూను దేశమంతా తినేశారని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విష ప్రచారం చేశారు. దేవుడంటే భయం భక్తి లేకుండా చేస్తున్న ఇలాంటి తప్పుడు ప్రచారాల కారణంగానే రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో అపశృతులు జరిగి అమాయక భక్తులు ప్రాణాలు కోల్పోతున్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ చేసిన తప్పులకు అన్నెపుణ్నెం ఎరుగని భక్తులు బలవుతున్నారు. ధర్మాన్ని నూటికి నూరు పాళ్లు ఆచరించి చూపించారు కాబట్టే వైయస్ జగన్ పాలనలో ఏనాడూ ఇలాంటి ఘటనలు జరగలేదు. వీటిపై చంద్రబాబుని ఎందుకు నిలదీయడం లేదు? గత సెప్టెంబర్ నెలలో సింహాచలం నరసింహస్వామి ఆలయంలో ఇద్దరు ఉద్యోగులు హుండీలో రూ. 55 వేలు దొంగతనం చేస్తే వారికి పోలీస్ స్టేషన్‌లో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారు. పరకామణి కేసు గురించి కూటమి పార్టీలన్నీ కలిసి తీవ్రమైన విష ప్రచారం చేస్తూ దొంగలను ఇలా వదిలేస్తారా? దీనిపై చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ఎందుకు నిలదీయడం లేదు. అధికారంలో ఉండి కూడా పట్టు వస్త్రాల పేరు మీద స్కాం జరిగిందని ఆరోపణలు చేస్తున్న పవన్ కళ్యాణ్.. విచారణ చేసి నిరూపించవచ్చు కదా. 2003 లో తిరుమలలో వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చింది ఎవరని చంద్రబాబుని ఎందుకు అడగడం లేదు? విజయవాడలో 40కి పైగా గుడులు కూల్చిన చంద్రబాబుని నిలదీయలేదే? చంద్రబాబు ప్రచార ఆర్భాటం వల్ల గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోయారని ఎందుకు చెప్పడం లేదు? సదావర్తి భూములు కాజేయాలని చూస్తే చంద్రబాబు అండ్ కో గురించి ఎందుకు నోరెత్తడం లేదు? టీటీడీకి చెందిన 50 ఆస్తుల్ని విక్రయించాలని చూసిన చంద్రబాబుని ప్రశ్నించడం లేదే? రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం ధ్వంసం చేసిన చిన సూరిబాబు అనే నిందితుడికి చంద్రబాబు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ. 5 లక్షలిస్తే తప్పని నిలదీయొచ్చు కదా. నాలుగైదు నెలల క్రితం అహోబిళం నరసింహస్వామి ఆలయంలో హుండీ చోరీ జరిగింది. దాన్ని పవన్ కళ్యాణ్ ప్రశ్నించలేదు. చంద్రబాబు దగ్గర తనకు కావాల్సింది పుచ్చుకుంటున్నాడు కాబట్టే సమయం వచ్చినా ఆయన్ను అడగలేని దౌర్భాగ్య దుస్థితికి పవన్ కళ్యాణ్ దిగజారిపోయాడు. మీడియా చేతిలో ఉంది కదా అని వైయస్ జగన్ మీద నిందలేయడానికి మాత్రం తయారైపోతున్నాడు. పవన్ తన బుర్రను స్విచ్చాఫ్ చేసి చంద్రబాబు ఏది మాట్లాడమంటే అది మాట్లాడుతున్నాడు. లోకేష్ కన్నా ఘోరంగా ఇమ్మెచ్చూర్డ్ పొలిటీషియన్‌గా పవన్ తయారయ్యాడు. ఎప్పుడేం మాట్లాడతాడో ఆయనకే స్పష్టత ఉండదు. పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ అన్నా ఆగనేలేదు. ఇప్పటికీ పీడీఎస్ బియ్యం దారిమళ్లిపోతోంది. ఆ విషయం ఆయనకు కూడా తెలుసు. హిందూ ధర్మాన్ని కాపాడింది జగనే ఎవరెంత బురదజల్లినా వైయస్ జగన్ వ్యక్తిత్వాన్ని కించపరచలేరు. వైయస్ఆర్‌సీపీ హయాంలోనే వందలాది ఆలయాల జీర్ణోద్ధరణ జరిగింది. వందలాది ఆలయాల నిర్మాణం జరిగింది. వేలాది ఆలయాల పునర్మిర్మాణం జరిగింది. పవన్ కళ్యాణ్ మాదిరిగా అవసరాన్ని బట్టి వేషాలేసే వ్యక్తిత్వం వైయస్ జగన్ గారిది కాదు. మనసా వాచ కర్మణ మంచి వ్యక్తిత్వాన్ని పాటిస్తాడు కాబట్టే దేవుడి దయ, కోట్లాది మంది ప్రజల దీవెనలు ఆయనకున్నాయి. ఆయన హయాంలోనే ఈ రాష్ట్రంలో ధార్మిక సంస్థలు గొప్పగా విరాజిల్లాయి.