తాడేపల్లి: రాష్ట్రంలో రైతుల పట్ల కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తోందని వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి విమర్శించారు. రైతులకు పెట్టుబడి సాయం అందించాలనే ఆలోచనను దేశంలో తొలిసారిగా ప్రకటించిన నాయకుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు అని ఆయన పేర్కొన్నారు. 2014 నుంచి 2016 వరకు రాష్ట్రంలో వందలాది మండలాలు కరువు పరిస్థితులను ఎదుర్కొన్న సమయంలో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నారని నాగిరెడ్డి గుర్తుచేశారు. ఆ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని 2017లో జరిగిన పార్టీ ప్లీనరీలో రైతులకు పెట్టుబడి సాయం అందించే పథకాన్ని జగన్ ప్రకటించారని తెలిపారు. తరువాత కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు సంవత్సరానికి రూ.6 వేల సాయం ప్రకటించినప్పటికీ, రాష్ట్రంలో అప్పటికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఆ తరహా ఆలోచన చేయలేదని విమర్శించారు. వైయస్ఆర్‌సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో రైతుకు సంవత్సరానికి రూ.12,500 పెట్టుబడి సాయం అందిస్తామని హామీ ఇచ్చిన వైయస్ జగన్, అధికారంలోకి వచ్చిన తరువాత దానిని రూ.13,500కు పెంచి ఐదేళ్లలో మొత్తం రూ.67,500 చొప్పున రైతులకు అందించారని తెలిపారు. కౌలు రైతులు, అటవీ హక్కుల పట్టాదారులు (ROFR) కూడా ఈ పథకంలో భాగమయ్యారని చెప్పారు. వైయస్ జగన్ పాలనలో 53.58 లక్షల మంది రైతులకు రైతు భరోసా కింద మొత్తం రూ.34,288 కోట్లు చెల్లించారని నాగిరెడ్డి పేర్కొన్నారు. అయితే ఎన్నికల సమయంలో రైతుకు సంవత్సరానికి రూ.20 వేల సాయం ఇస్తామని ప్రకటించిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకోలేకపోయిందని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకం కేవలం 46.86 లక్షల మంది రైతులకు మాత్రమే పరిమితమైందని తెలిపారు. గతంలో ఉన్న 53.58 లక్షల లబ్ధిదారులను తగ్గించి రైతులను పథకం నుంచి తప్పించారని అన్నారు. ఇంకా కౌలు రైతులు, అటవీ హక్కుల పట్టాదారులకు పెట్టుబడి సాయం గురించి ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం కూడా ఆందోళనకరమని చెప్పారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, ఉచిత పంటల బీమా పథకాన్ని నిలిపివేయడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రైతులు స్వయంగా బీమా ప్రీమియం చెల్లించినా రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను చెల్లించకపోవడం వల్ల పంట బీమా అమలు కావడం లేదని నాగిరెడ్డి విమర్శించారు. ఇన్‌పుట్ సబ్సిడీ బకాయిలు కూడా ఇప్పటికీ చెల్లించలేదని, సున్నా వడ్డీ రాయితీ కూడా రైతులకు అందడం లేదని తెలిపారు. మొక్కజొన్న, శనగ వంటి పంటలకు మద్దతు ధర లేకపోవడంతో రాయలసీమ, ప్రకాశం, బాపట్ల, గుంటూరు జిల్లాల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలని నాగిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.