ఆడబిడ్డలకు రక్షణ కూడా కల్పించలేరా ?

రెండేళ్ల రెడ్ బుక్ పాలనే ఇందుకు కారణం

పల్నాడు ఘటనపై మాజీ మంత్రి విడదల రజిని ఫైర్

చిలకలూరిపేటలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి విడదల రజిని

చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ కరవు

ఎటుచూసినా దాడులు, అఘాయిత్యాలే

వీటి వల్ల మహిళల ఆత్మహత్యలూ పెరుగుతున్నాయి

పల్నాడులో మహిళా ఉద్యోగిపై అఘాయిత్యమే నిదర్శనం

జగన్ హయాంలో మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు

దిశా యాప్, దిశా పోలీసు స్టేషన్లు, జీరో ఎఫ్ఐఆర్ లు

అప్పట్లో దేశంలోనే మొదటి స్ధానంలో ఏపీ పోలీసులు

కూటమి పాలనలో 36వ స్ధానానికి దిగజారిన దుస్దితి

మాజీ మంత్రి విడదల రజిని ఆక్షేపణ

చిలకలూరిపేట:   రెండేళ్ల కూటమి పాలనలో మహిళలపై దాడులు, లైంగిక వేధింపులు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయని, పల్నాడు జిల్లా మాచర్లలో  తాజాగా ప్రభుత్వ ఉద్యోగిని ఇంటిపై దాడి చేసి మరీ అఘాయిత్యానికి పాల్పడటమే ఇందుకు నిదర్శనమని మాజీ మంత్రి విడదల రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట వ్యాప్తంగా మహిళలపై దాడులు పెరిగిపోతున్నా, పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో బిజీగా ఉన్నారని విడదల రజిని ఆక్షేపించారు. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏపీ పోలీసులు దేశంలోనే నంబర్ వన్ గా ఉండే వారని, కానీ కూటమి పాలనలో 36వ స్ధానానికి దిగజారారన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్లు తెరిచి మహిళల రక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలని విడదల రజిని డిమాండ్ చేశారు. 
ప్రెస్ మీట్ లో విడదల రజిని ఇంకా ఏమన్నారంటే..

- మహిళలకు దినదిన గండంగా చంద్రబాబు పాలన

రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఈ రెండేళ్లలో మహిళలకు రక్షణ పూర్తిగా కరవైంది. రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై దాడులు, హత్యలు, అఘాయిత్యాలు పెరిగాయి. ఇవన్నీ తట్టుకోలేక మహిళల ఆత్మహత్యలు కూడా పెరిగాయి. మహిళల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం సాధించిన ఘనత ఇదే. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళ ఇంటికి వెళ్లి తలుపు కొట్టి లోపలికి ప్రవేశించి అఘాయిత్యం చేసిన ఘటన షాక్ కు గురి చేసేలా ఉంది. రెండేళ్ల కూటమి పాలన కూడా ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో ఈ ఘటన నిరూపిస్తోంది. మహిళలపై దాడులు, అఘాయిత్యాలు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు ? చంద్రబాబు దృష్టికి ఇవన్నీ వస్తున్నాయనే అనుకుంటున్నాం. అయినా ఇలాంటి దాష్టికాలపై దృష్టి సారించడం లేదు. పోలీసులకు విధులు, బాధ్యతల మీద చిత్తశుద్ది లేదు. చంద్రబాబుకు కూడా మహిళలపై జరుగుతున్న దాడులపై చర్యలు తీసుకునే తీరిక లేదు. ప్రభుత్వానికీ, పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి ఘటనలు జరగవు. 

- జగన్ హయాంలో దేశంలోనే నంబర్ వన్ పోలీసింగ్ 

జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏపీలో పోలీసులు ఫస్ట్ ప్లేస్ లో ఉండేవారు. వందకు పైగా అవార్డులు, రివార్డులు వచ్చాయి. ఇప్పుడు హోంశాఖకు పాస్ మార్కులు కూడా రాలేదట. 36వ స్ధానంలో ఉన్నామని చెప్తున్నారు. ఈ డిజాస్టర్ కు కారణం చంద్రబాబు ప్రభుత్వం తెచ్చిన రెడ్ బుక్ పాలనే. అధికారంలోకి రాగానే చంద్రబాబు పోలీసుకు రెడ్ బుక్ అజెండా అమలు చేయమని చెప్పారు. వాళ్లు తూచా తప్పకుండా దాన్నే అమలు చేస్తున్నారు. ఈ రెడ్ బుక్ అజెండాలో భాగంగా వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు ఎక్కడున్నా, ఏ యాక్టివిటీలో పాల్గొంటున్నా, ప్రభుత్వాన్ని ప్రశ్నించినా అక్రమ కేసులు పెట్టడం, అక్రమ అరెస్టులు చేయడం, బెదిరించడం, కొట్టడం, తిట్టడాలే చేస్తున్నారు. పోలీసులు రెడ్ బుక్ అమల్లో బిజీగా ఉన్నారు. పోలీసులు వారి విధుల నుంచి ఎప్పుడో దారి మళ్లారు. 

- మహిళల రక్షణ విషయంలో చంద్రబాబు మొద్దునిద్ర వీడాలి

జగన్మోహన్ రెడ్డి పాలనలో మహిళల రక్షణ కోసం దిశ యాప్, జీరో ఎఫ్ఐఆర్ నమోదులు, డ్రైవ్స్, కౌన్సెలింగ్స్ ఉండేవి. తద్వారా మహిళలు, విద్యార్ధులు, వృద్ధులు జగన్ గారి పాలనలో సంతోషంగా ఉండేవి. ఇప్పుడు కూటమి పాలనలో వారెవరికీ రక్షణ లేదు. శాంతిభద్రతలపై చంద్రబాబుకే దృష్టి లేదు. కేవలం రెడ్ బుక్ పైనే ఉంది. ఇప్పటికైనా మహిళల రక్షణ కోసం, ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అడ్డుకునేలా పోలీసులు తమ విధులు అమలు చేసేలా అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అంబేద్కర్ రాజ్యాంగం స్ధానంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం వల్లే ఏపీ పోలీసు శాఖ 36వ స్ధానానికి దిగజారింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో మహిళల భద్రత కోసం ఎన్నో చర్యలు తీసుకున్నాం. కానీ గత ఎన్నికల సమయంలో మహిళల అక్రమ రవాణా, మిస్సింగ్ అని దిక్కుమాలిన ఆరోపణలు చేశారు. రెండేళ్ల మీ పాలనలో వాటిపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి, ఇవాళ జరుగుతున్న వరుస ఘటనలు నియంత్రించడానికి తీసుకున్న చర్యలేంటో చెప్పండి. ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు, మద్యం షాపులు, గంజాయి, డ్రగ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని కంట్రోల్ చేసే వ్యవస్థలు లేవు. దీని ప్రభావం అంతిమంగా మహిళలపై పడుతోంది. ఇప్పటికైనా మహిళల రక్షణ కోసం పనిచేయండి, మరో మహిళకు ఇలాంటి పరిస్ధితి రాకుండా చూడాలని చంద్రబాబును విడదల రజిని డిమాండ్ చేశారు.

Back to Top