భోగాపురం ఎయిర్‌పోర్ట్ పేరుతో భారీ స్థాయిలో భూస్కాం 

విజయనగరం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు ఫైర్ 

విజయనగరం: భోగాపురం ఎయిర్‌పోర్ట్ పేరుతో భారీ స్థాయిలో భూస్కాం జ‌రుగుతుంద‌ని విజయనగరం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు మండిప‌డ్డారు. విజయనగరం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ కార్యాల‌యంలో బుధ‌వారం మీడియా స‌మావేశంలో టీడీపీ డైవర్షన్ రాజకీయాలపై మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కూట‌మి ప్ర‌భుత్వ తీరును ఎండ‌గ‌ట్టారు.  రాష్ట్ర రాజకీయాల్లో అసలు సమస్యలపై చర్చ జరగకుండా దారి మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

“మావిగాన్ వంటి కీలక అంశాన్ని పక్కదారి పట్టించేందుకే మంత్రి అచ్చెన్నాయుడు అనవసరంగా పాత విషయాలను లేవనెత్తుతున్నారు” అని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖర రెడ్డి మరణాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం మళ్లీ ప్రస్తావించడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. ప్రజలకు ఉపయోగపడే అంశాలపై చర్చించకుండా భావోద్వేగాలను రెచ్చగొట్టడం ప్రజాస్వామ్యానికి హానికరమని స్పష్టం చేశారు. టీడీపీ నాయకులు బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించడం వెనుక ప్రజలను తప్పుదారి పట్టించే ఉద్దేశమే ఉందని చిన్న శ్రీను విమర్శించారు. “15 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలను ఇప్పుడు లేవనెత్తడం ప్రజలను మభ్యపెట్టే యత్నమే” అని అన్నారు.

“మీరు గతంలో ఇతర నేతలపై మాట్లాడిన మాటలు ప్రజలకు తెలియవా?” అని ప్రశ్నించిన ఆయన, ఎన్టీఆర్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వరకు టీడీపీ నాయకులు ఉపయోగించిన భాషను ప్రజలు మరచిపోలేదని చెప్పారు. అచ్చెన్నాయుడు చేసిన “పార్టీ లేదూ, బొక్కా లేదూ” వంటి వ్యాఖ్యలు ఇప్పటికీ ప్రజల మదిలో ఉన్నాయని గుర్తుచేశారు. అలాగే పార్థసారధి, కన్నా లక్ష్మీనారాయణ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వంటి నాయకులు గతంలో చంద్రబాబు నాయుడు గురించి చేసిన విమర్శలను ప్రజలు మరిచిపోలేరని అన్నారు. ఈ నేపథ్యంలో ఒక్కపక్ష విమర్శలు చేయడం సరికాదని సూచించారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ పేరుతో భారీ స్థాయిలో భూస్కాం జరుగుతోందని చిన్న శ్రీను ఆరోపించారు. వివిధ ప్రాజెక్టుల పేరుతో రైతులను బెదిరించి, ఒత్తిడి తెచ్చి వారి భూములను లాక్కునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల హక్కులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని గుర్తుచేశారు.

ప్రస్తుత ప్రభుత్వంలో ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి ప్రాజెక్టులు అమలు అయ్యే పరిస్థితి కనిపించడం లేదని, ప్రచార కార్యక్రమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. ప్రజల సమస్యలను పక్కనబెట్టి రాజకీయ లాభాల కోసం ఇలాంటి చర్యలు చేపట్టడం సరికాదని హెచ్చరించారు. “ప్రజలు అన్నింటిని గమనిస్తున్నారు. తప్పుడు ప్రచారాలకు రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారు” అని చిన్న శ్రీను స్పష్టం చేశారు. స‌మావేశంలో వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు కెవి సూర్యనారాయణ రాజు, నెక్కల నాయుడు బాబు; జిల్లా జనరల్ సెక్రటరీలు ఇప్పలి అనంత, రవి కుమార్, నరసింహ మూర్తి; జిల్లా ఆర్‌టీఐ విభాగ అధ్యక్షుడు అప్పాన సుబ్రహ్మణ్యం; జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు జై హింద్ కుమార్; భోగాపురం, గరివిడి మండల అధ్యక్షులు ఉప్పాడ సూర్యనారాయణ, విశ్వేశ్వరరావు; జిల్లా అధికార ప్రతినిధి కనకల రఘు; జిల్లా పార్టీ ఆక్టివిటీ కార్యదర్శి పోలీసు కృష్ణ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
 

Back to Top