టెక్కలి జిల్లా: ఆసుపత్రిలో తీవ్ర నీటి కొరత కారణంగా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైయస్ఆర్‌సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జ్ పేరాడ తిలక్ ఆరోపించారు. శుక్రవారం ఆయన టెక్కలి ఏరియా ఆసుపత్రిని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఆసుపత్రిలో బాత్‌రూమ్‌లలో నీటి కొరత కారణంగా తీవ్ర దుర్వాసన వ్యాపిస్తోందని, రోగులు మరియు వారి సహాయకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తిలక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో మాట్లాడి మంచినీటి సమస్య, రోగులు పడుతున్న ఇబ్బందుల గురించి వివరాలు తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి ఆసుపత్రిలో నీటి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అభివృద్ధి పేరుతో గొంతు చించుకుంటున్న స్థానిక మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు నియోజకవర్గంలోని ఆసుపత్రి దుస్థితిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే వైయస్ఆర్‌సీపీ తరఫున వాటర్ ట్యాంకర్ల ద్వారా ఆసుపత్రికి నీటి సరఫరా చేపడతామని పేరాడ తిలక్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.