హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రచారం చేసిన ‘మెగా డీఎస్సీ’ నియామక ప్రక్రియపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని, నోటిఫికేషన్ నుంచి ప్రశ్నపత్రాల రూపకల్పన, పరీక్షల నిర్వహణ, ఎంపికల వరకు భారీ అవకతవకలు చోటుచేసుకున్నాయని వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆక్షేపించారు. మెగా డీఎస్సీ కాదిది.. పూర్తిగా “మాయ డీఎస్సీ”గా మారిందని అభివర్ణించారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ పూర్తిగా విఫలమయ్యారని, డీఎస్సీ–2025 అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని తన స్వగృహం నుంచి ఓ వీడియో రిలీజ్ చేశారు. మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఏమన్నారంటే.. - లోకేష్ అట్టర్ ఫ్లాప్ విద్యాశాఖలో రోజు రోజుకు వెలుగుచూస్తున్న అవినీతి కథనాలు చూస్తుంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు ఆ శాఖపై ఏమాత్రం పట్టు ఉన్నట్లు కనిపించడం లేదు. విద్యాశాఖను పూర్తిగా గాలికి వదిలేసి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారు. అన్ని శాఖల్లో జోక్యం చేసుకునే లోకేష్‌కు విద్యాశాఖలో జరుగుతున్న అవకతవకలు కనిపించడం లేదా?. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను కూటమి ప్రభుత్వం పక్కనపెట్టి, మెగా డీఎస్సీ పేరుతో భారీ ప్రచారం చేసుకుంది. కానీ నియామకాల ప్రక్రియలో ఎక్కడా పారదర్శకత కనిపించడం లేదు. నోటిఫికేషన్ నుంచి ప్రశ్నపత్రాల రూపకల్పన, పరీక్షల నిర్వహణ, పోస్టుల భర్తీ వరకు అన్నిచోట్లా అక్రమాలు జరిగాయి. లక్షలాది మంది ప్రతిభావంతులైన నిరుద్యోగ యువత భవిష్యత్తుతో చెలగాటమాడారు. - ఈ ప్రశ్నలకు బదులేదీ? డీఎస్సీ–2025 అవకతవకలపై సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరినా ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదు. నవీన్ అనే అభ్యర్థి కృష్ణా జిల్లా టాపర్‌గా నిలిచారు. అతను ఎస్‌ఈఆర్టీలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేశాడా? లేదా?. అతను ప్రశ్నపత్రాల కూర్పులో భాగమయ్యాడా? లేదా?. అతనికి ర్యాంకు వచ్చినప్పటికీ ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు. అతను కోర్టును ఆశ్రయించడం వాస్తవం కాదా ?. మూడు లక్షల మందికి పైగా అభ్యర్థులు పరీక్ష రాస్తే 16 వేలకుపైగా పోస్టులు భర్తీ చేశారు. అయినప్పటికీ మెరిట్ లిస్ట్ ఎందుకు విడుదల చేయలేదు. అభ్యర్థులకు టెక్ట్స్ మెసేజ్‌లు పంపడం వెనుక ఉద్దేశ్యం ఏమిటి. - ఒక్కో పోస్టు రూ.15 లక్షల చొప్పున అమ్ముకున్నారు స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లపై కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో పోస్టును రూ.15 లక్షల చొప్పున అమ్ముకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి బంధువుగా చెప్పుకునే వ్యక్తి ఈ పోస్టుల విక్రయంలో ప్రధాన పాత్ర పోషించారనే ఆరోపణలు ఉన్నాయి. - ప్రభుత్వం విఫలం ప్రశ్నపత్రాల రూపకల్పన పూర్తిగా గోప్యంగా జరగాల్సి ఉండగా లీకులు వెలుగుచూడడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. ప్రతిభావంతులైన నిరుద్యోగులకు వైయస్ఆర్‌సీపీ అండగా ఉంటుంది. డీఎస్సీ అవకతవకలపై సీబీఐతో విచారణ జరపాలి, లేదంటే సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ చేపట్టాలి. అవకాశాలు కోల్పోయిన అభ్యర్థులకు న్యాయం చేయాలి. విద్యాశాఖపై వచ్చిన అన్ని ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ పూర్తిగా విఫలమయ్యారు, వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు.