చంద్రబాబు గత చరిత్ర అత్యంత హీనాతిహీనం

భూమన కరుణాకర్‌ రెడ్డి ధ్వజం

చంద్రబాబు పాపాల చరిత్ర రాసే దమ్ముందా?

ఎల్లో మీడియాకు భూమన కరుణాకర్‌ రెడ్డి సవాల్‌

తిరుపతి లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి.

చంద్రబాబు దొంగ, అవినీతిపరుడు, పచ్చి అవకాశవాది

చంద్రబాబు బుద్ధి గురించి ఆయన సన్నిహితులే చెప్పారు

చంద్రబాబుని తొలిసారి మంత్రిని చేసిందే వైయ‌స్ఆర్ 

ఆయన పెట్టిన రాజకీయ బిక్షతోనే చంద్రబాబు ఎదిగాడు

గుర్తు చేసిన భూమన కరుణాకర్‌ రెడ్డి

పాలనలో పోటీ పడలేక ఇప్పుడు వైయస్‌ కుటుంబంపై విషం 

వైయ‌స్ఆర్‌ నిజంగా చెడ్డవాడే అయితే, కోట్లాది అభిమానులు ఉంటారా?

ఇప్పుడు వైయస్‌ కుటుంబంపై ఎల్లో మీడియా విష ప్రచారం

తక్షణమే ఆ తప్పుడు ప్రచారం మొత్తం ఆపేయాలి

లేదంటే చంద్రబాబు గత చీకటి కోణాలన్నీ ప్రచారం చేస్తాం

ప్రెస్‌మీట్‌లో తేల్చి చెప్పిన భూమన కరుణాకర్‌ రెడ్డి 

తిరుపతి: చంద్రబాబు దొంగ, అవినీతిపరుడు, పచ్చి అవకాశవాది అని, ఆయన జీవితంలోని చీకటి కోణాలను ప్రస్తావిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ  రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. పాలనలో వైయస్‌ జగన్‌తో పోటీ పడలేక తనకు రాజకీయ బిక్ష పెట్టి మంత్రిని చేసిన వైయస్‌ కుటుంబంపైనే చంద్రబాబు ఇప్పుడు తప్పుడు ప్రచారం చేయిస్తున్నాడని ఆయన ఆక్షేపించారు. స్కూల్‌లో విద్యార్థి దశ నుంచే దొంగతనాలు చేయడం, మాయమాటలు చెప్పడం అలవాటైన చంద్రబాబు తాను ప్రజోద్ధారకుడినని ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని అన్నారు.
    
చంద్రబాబు గతం తెలిసిన ఎవరైనా ఆయన్ను ఛీకొట్టకుండా ఉండలేరని భూమన కరుణాకర్‌రెడ్డి చెప్పారు. మహానేత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి రాష్ట్ర ప్రజల హృదయాలను గెలిచిన చక్రవర్తి అని, అలాంటి వ్యక్తి గురించి చంద్రబాబు, ఎల్లో మీడియా కూడ బలక్కుని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్సార్‌ గారు నిజంగా చెడ్డవాడే అయితే ఆయనకు కోట్లాదిగా అభిమానులు ఉండేవారా అని ప్రశ్నించారు.
    జగన్‌గారు సూచించిన మావిగన్‌తో టీడీపీకి పుట్టగతులుండవనే భయం చంద్రబాబుని వేధిస్తోందని, దాన్నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే  అదేపనిగా జగన్‌ గారి వ్యక్తిత్వ హననం చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికైనా వైయస్‌ కుటుంబంపై చేస్తున్న తప్పుడు ప్రచారం ఆపకపోతే, చంద్రబాబులోని చీకటి కోణాలను ప్రజల ముందుంచి ఎండగడతామని తిరుపతిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన భూమన కరుణాకర్‌ రెడ్డి హెచ్చరించారు. 
ప్రెస్‌మీట్‌లో భూమన కరుణాకర్‌ రెడ్డి ఇంకా ఏమన్నారంటే..:

- వారం వారం ఏదో ఒక డైవర్షన్‌:

పాలనా వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి, ఎన్నికల్లో ఇచ్చిన 143 హామీలు నెరవేర్చాలన్న డిమాండ్ల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి సీఎం చంద్రబాబు ప్రతివారం ఏదో ఒక డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నాడు. అందులో భాగంగానే జగన్‌గారి వ్యక్తిత్వాన్ని హననం చేయాలన్న కుట్రతో మూడు రోజులుగా చంద్రబాబు సహా మంత్రులు, టీడీపీ నాయకులు, ఎల్లో మీడియా కూడబలుక్కుని దివంగత వైయస్సార్‌గారి గురించి వరుసపెట్టి తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు.  

- అదే నిజమైతే అంత ప్రజాదరణ ఉండేదా?:
    
ప్రజాసేవలో ఉంటూ చనిపోయిన వ్యక్తి గురించి నీచంగా మాట్లాడించడం కేవలం చంద్రబాబుకే చెల్లింది. టీడీపీ, ఎల్లో మీడియా ప్రచారం చేస్తున్నట్టు వైయస్సార్‌ గారు నిజంగా దుర్మార్గుడైతే ఆయన చనిపోయాడని తెలిసి దాదాపు 670 మంది గుండెలు ఆగిపోయేవా అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలి. చాలా మంది 5 రోజుల పాటు భోజనం కూడా చేయలేదు. చివరకు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వైయస్సార్‌ గారి అంతిమ యాత్రకు తరలివచ్చిన జన సునామీ ఆయన ప్రజల హృదయాలు గెల్చిన గొప్ప చక్రవర్తి అనేది చెప్పకనే చెబుతుంది.
    వైయస్సార్‌ గారి మీద మమకారంతో ఊరూరా ప్రతిష్టించిన విగ్రహాలు ఇప్పటికీ ఆయన మీద ఉన్న అభిమానాన్ని చాటి చెబుతాయి. ప్రజల గుండెల్లో వైయస్సార్‌ గారికి చిరస్మరణీయమైన స్థానం ఉందని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం ఇంకేం కావాలి? అలాంటి మహా నాయకుడి గురించి చంద్రబాబు సహా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు విషం చిమ్మడం సిగ్గుచేటు. ఆయనతో పాటు జగన్, ఆయన తాత వైయస్‌ రాజారెడ్డి గారి గురించి రోజుకొక తప్పుడు కథ సృష్టించి దుష్ప్రచారం చేస్తున్నారు. ఒక్క విషయం గుర్తు పెట్టుకొండి. తప్పుడు వార్తలు రాసినంత మాత్రాన వైయస్సార్‌గారు చెడ్డ వారైపోరు.

- బాల్యం నుంచే చంద్రబాబు అవినీతిపరుడు

అందుకు ఎన్నెన్నో ఉదాహరణలు:
    
చంద్రబాబు తాను దేశాన్ని ఉద్ధరించడానికే పుట్టినట్టు నీతులు చెబుతున్నాడు. కానీ ఆయన గతం గురించి తెలిసిన వారు ఎవరైనా ఛీ కొట్టకుండా ఉండలేరు. 
– 1974 లో నేను రాడికల్‌ విద్యార్థి సంఘంలో కీలకంగా వ్యవహరించే సందర్భంలో ఉద్యమం కోసం ఫండ్‌ రైజ్‌ చేయాలని నిర్ణయించాం. అందు కోసం అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన చక్రపాణి అనే చిత్రం తిరుపతిలోని రామరాజు థియేటర్‌లో ప్రదర్శించాలనుకొని దానికి రూ.2 టికెట్‌ ధర నిర్ణయించాం. టికెట్‌ అమ్మే పనిలో భాగంగా రీసెర్చ్‌ స్కాలర్‌గా ఉన్న చంద్రబాబు గదికి నా స్నేహితుడు శ్రీధర్‌తో కలిసి వెళ్లడం జరిగింది. చంద్రబాబుని డబ్బులడిగితే తన జేబులో ఉన్నవి ఇవ్వకుండా గదిలో నిద్రపోతున్న తన స్నేహితుడి జేబులో నుంచి డబ్బులు దొంగిలించి ఇచ్చాడు. తొలి రోజుల్లోనే చంద్రబాబు నైజం ఎలా ఉండేదని చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణ. ఆ దొంగతనానికి నేనే సాక్ష్యం. 
– దివంగత మాజీ మంత్రి ఎన్‌.శివప్రసాద్, నేను మంచి స్నేహితులం. నేను వైయస్సార్‌ యువసేన పెట్టినప్పుడు అందులో ఆయన సభ్యుడిగా ఉండేవారు. 1990 నుంచి 1997 వరకు చాలా యాక్టివ్‌గా పని చేశారు. అదే శివప్రసాద్, చంద్రబాబుకి చిన్ననాటి స్నేహితుడు. ఆ శివప్రసాద్‌ను 1996 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయించాలని నేను, దివంగత వైయస్సార్‌ గారు నాడు ప్రధానిగా ఉన్న పీవీ నరసింహారావుగారి ద్వారా తీవ్రంగా ప్రయత్నించాం. విద్యార్థిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఎలా ఉండేవాడే శివప్రసాద్‌ చెప్పిన ఒక సంఘటన అందర్నీ విస్మయానికి గురి చేస్తుంది.
– ఒక  నాటకం సందర్భంగా శివప్రసాద్‌కి హీరో వేషం, చంద్రబాబుకి కమెడియన్‌ వేషం ఇచ్చారు. కానీ అధ్యాపకుడికి చంద్రబాబు వేరుశెనక్కాయల మూట లంచంగా ఇచ్చి తనకు రావాల్సిన హీరో వేషం కొట్టేశాడని చెప్పాడు. 1968 ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన చంద్రబాబాబు నైజాన్ని సూచిస్తోంది. ఇక్కడ మరో గమ్మత్తేమంటే, చంద్రబాబు లంచంగా ఇచ్చిన ఆ శనక్కాయలు కూడా పక్క  పొలంలో కాజేసినవే. 
– 1977లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో రాజగోపాల్‌నాయుడు గారు చిత్తూరు నుంచి పోటీ చేసినప్పుడు చంద్రగిరి నియోజకవర్గంలో ప్రచారం నిమిత్తం చంద్రబాబుకి ఒక జీపు ఒక డీజిల్‌ క్యాన్‌ అప్పగించారు. కానీ చంద్రబాబు మాత్రం ప్రచారానికి తిరగకుండా ఇచ్చిన డీజిల్‌ని వారి పెట్రోల్‌ బంకులోనే అమ్మేసి డీజిల్‌ అయిపోయిందని మళ్లీ వెళ్లాడు. ఈ విషయం రాజగోపాల్‌నాయుడు స్వయంగా చెప్పారు. 
– జయచంద్రనాయుడు ఆ రోజుల్లో యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉండే వారు. ఆయన కింద చంద్రబాబు జిల్లా సెక్రటరీగా ఉండేవాడు. జయచంద్రనాయుడికి రూమ్‌ ఉంటే చంద్రబాబు తన ఖర్చులు కూడా ఆయన పేరు మీదనే రాసేసేవాడు. 
– తిరుపతి బాలాజీ కాలనీలో చలమయ్యగారికి ఒక పాన్‌ షాప్‌ ఉండేది. ఆయన వద్ద 1975 కాలంలోనే రూ.200 అప్పు చేసిన చంద్రబాబు, ఆ తర్వాత దొరక్కుండా తప్పించుకుని తిరిగేవాడు. 
– చంద్రబాబు మంత్రి అయ్యాక కట్టిన విష్ణుప్రియ హోటల్‌ నిర్మాణానికి కలప తీసుకొచ్చి దానికి డబ్బులు ఎగ్గొట్టిన ఘనుడు చంద్రబాబు.
– వైయ‌స్ఆర్ గారి బిక్ష  వల్లే చంద్రబాబు మంత్రి అయ్యాడు. నాటి ముఖ్యమంత్రి అంజయ్య గారిని ఒప్పించి తనతో పాటు చంద్రబాబుని మంత్రిని చేశారు. ఇది నూటికి నూరు శాతం నిజం. ఆ తర్వాత భవనం వెంకట్రాం, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి గారి మంత్రివర్గంలో కొనసాగడానికి, ఆయన రాజకీయ ఎదుగుదలకు కారణం కూడా ఆ రోజున వైయస్సార్‌ గారు వేసిన బిక్షే కారణం. ఈ కారణంతోనే వైయ‌స్ఆర్ నాకు మంచి స్నేహితుడు అని చంద్రబాబు అప్పుడప్పుడూ చెబుతుంటాడు. 
– చంద్రబాబు మీద అలిపిరిలో నక్స్‌లైట్లు దాడి చేసినప్పుడు వైయస్సార్‌గారు ఆగమేఘాల మీద తిరుపతి స్విమ్స్‌ ఆస్పత్రికి వచ్చి పరామర్శించి వెళ్లారు. ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా అప్పటివరకు ఆయన్ను పరామర్శించడానికి కనీసం 300 మంది కూడా రాలేదంటే ఎవరూ నమ్మలేరు. ఆయన మీద అంతటి ప్రజావ్యతిరేకత ఉండేది. చంద్రబాబు మీద జరిగిన దాడిని ఖండిస్తూ తిరుపతి గాంధీ బొమ్మ వద్ద శాంతియుతంగా నిరసన తెలియజేశారు. అప్పటి వరకు చంద్రబాబుని చూడటానికి అప్పటి హోం మంత్రి దేవేందర్‌గౌడ్‌ సహా మంత్రులు కూడా వెళ్లలేదు.  
– చంద్రబాబు సొంత తమ్ముడు రామ్మూర్తినాయుడు కూడా ఆయన్ను విభేదించి కాంగ్రెస్‌లో చేరాడు. చంద్రబాబు వంటి అన్న ఎవరికీ ఉండకూడదు. అలాంటి వ్యక్తికి తమ్ముడిగా పుట్టకూడదు అని ఆయన చెప్పేవాడు. 
– అన్న మీద నక్స్‌లైట్ల దాడి జరిగిందని తెలిసి పరామర్శకు వెళ్లిన తమ్ముడు రామ్మూర్తినాయుడిని పచ్చి బూతులు తిట్టి అవమానించాడని నాతో చెప్పుకుని బాధపడ్డాడు. అది నిజం కాదు అని చెప్పే దమ్ము చంద్రబాబుకి ఉందా? పైగా తనను తిట్టి, అందుకు పూర్తి విరుద్ధంగా తానే అన్నను తిట్టినట్లు అమ్మకి చెప్పాడని స్వయంగా రామ్మూర్తినాయుడు నా వద్ద కన్నీరు పెట్టుకున్నాడు. 
– పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచిన నీచుడు చంద్రబాబు. ఆందుకే ఆయనను ఉద్దేశించి జామాత దశమ గ్రహం అని ఎన్టీఆర్‌ అన్నాడు. ఔరంగజేబు కన్నా నీచుడు అన్నాడు. 
– చంద్రబాబు వ్యక్తిత్వం గురించి తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏకంగా ఒక పుస్తకమే రాశాడు. ఆయన అవినీతి, వెన్నుపోట్లు గురించి దగ్గర నుంచి చూసిన మనిషిగా ప్రతి విషయాన్ని ఒక చరిత్ర కొన్ని నిజాలు అని అక్షరబద్ధం చేశాడు.
– కాపు నేత వంగవీటి మోహనరంగా హత్య వెనుక చంద్రబాబు ఉన్నాడని, రంగా రక్తంతో చంద్రబాబు చేతులు తడిశాయని మాజీ హోం మంత్రి హరిరామజోగయ్యగారు తీవ్ర విమర్శలు చేశారు.
– ఎన్‌కౌంటర్‌ పత్రిక ఎడిటర్‌ పింగళి దశరథ్‌రామ్‌ హత్య వెనుక చంద్రబాబు పాత్ర ఉందన్నది ఓపెన్‌ సీక్రెట్‌.  
– దివంగత ఎన్టీఆర్, ఆయన కొడుకుల గురించి చంద్రబాబు ఎంత నీచంగా మాట్లాడేవాడో.. సీనియర్‌ నాయకుడు దేవినేని నెహ్రూ ఒక ఇంటర్వ్యూలో వివరంగా చెప్పాడు. 
– పరిటాల రవిని రాజకీయంగా ఎదగకుండా తొక్కేసింది చంద్రబాబే. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా అనంతపురంలో 1999–2004 మధ్య 600 ఫ్యాక్షన్‌ హత్యలకు చంద్రబాబే కారణం. 
    ఇదీ చంద్రబాబు గత హీన చరిత్ర. మరి ఇవన్నీ దమ్ము  ఈనాడు, ఆంధ్రజ్యోతికి ఉందా? పతాక శీర్షికల్లో చంద్రబాబు చీకటి జీవితం గురించి రాయగలరా? చంద్రబాబు నుంచి లబ్ధి పొందడానికి ఆయన్ను ఆకాశానికెత్తుతూ ఎల్లో మీడియా చేసుకున్న చీకటి ఒప్పందాన్ని ప్రజలు ఎప్పుడో అర్థం చేసుకున్నారు. ఎల్లో మీడియా తమ సొంత ప్రయోజనాల కోసం జగన్‌గారి వ్యక్తిత్వ హననానికి ప్రయత్నిస్తోంది.

- వైయస్‌ కుటుంబం మీద దుష్ప్రచారం ఆపకపోతే..:

అమరావతి రాజధాని నిర్మాణం ముసుగులో చంద్రబాబు చేస్తున్న అవినీతిని జగన్‌ గారు ప్రజల ముందు పెట్టడంతో పాటు, ఆచరణ సాధ్యం కాని అమరావతికి ప్రత్యామ్నాయంగా మావిగన్‌ సూచించారు. ఆ మావిగన్‌తో రాజకీయంగా టీడీపీకి పుట్టగతులుండవనే భయం చంద్రబాబుని భయపెడుతోంది. మరోవైపు మావిగన్‌పై ప్రజల్లో వచ్చిన స్పందన చూడలేకనే జగన్‌గారిపై నిందలు వేస్తూ వ్యక్తిత్వ హననం కుట్ర  చేస్తున్నారు.
    ఇప్పటికైనా వైయస్‌ కుటుంబంపై చంద్రబాబు దుష్ప్రచారం ఆపకపోతే, ఆయన గతాన్ని ఇంకా తవ్వి ప్రజల ముందు పెడతాం. ఎప్పుడు ఎన్నికలు జరిగినా చంద్రబాబు అధికారానికి సమాధి కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని భూమన కరుణాకర్‌ రెడ్డి స్పష్టం చేశారు.

Back to Top