డీఎస్సీ నిర్వహణలో అడుగడుగునా అక్రమాలే

మెరిట్ లిస్ట్ మాయం, స్పోర్ట్ కోటాలో అనర్హులు

పేపర్ తయారు చేసిన కాంట్రాక్టు ఉద్యోగే టాపర్

సీబీఐ లేదా సిట్టింగ్ జడ్డితో విచారణ చేయించాల్సిందే

వైయ‌స్ఆర్‌సీపీ మాజీ మంత్రులు పేర్నినాని, మేరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా డిమాండ్

విజయవాడ, ఒంగోలు, రాజమండ్రిలో నిర్వహించిన ప్రెస్ మీట్లలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రులు పేర్ని 
వెంకట్రామయ్య (నాని), మేరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా 

విద్యావ్యవస్ధలోనూ కూటమి సర్కార్ స్కాంలు

లక్షల మంది పరీక్ష రాస్తే కొందరికే ఫలితాలు 

హైకోర్టు చెప్పినా మెరిట్ లిస్ట్ బయటపెట్టలేదు

ఇంతకన్నా పచ్చిమోసం, దగా ఎక్కడైనా ఉంటుందా ?

మాజీ మంత్రి పేర్నినాని ఫైర్

మెగా డీఎస్సీనా ? మెగా మోసమా ?

తప్పు చేయకపోతే కాంట్రాక్ట్ ఉద్యోగిని ఎందుకు తీసేశారు ?

టెట్, డీఎస్సీకి ఒకే కన్వీనర్ ను పెట్టి అక్రమాలు

సీబీఐ దర్యాప్తు లేదా సిట్టింగ్ జడ్డి విచారణ జరిపించాలి

మాజీ మంత్రి మేరుగు నాగార్జున డిమాండ్ 

చంద్రబాబు హయాంలో అన్నీ స్కాంలే

తాజాగా డీఎస్సీ నియామకాల్లోనూ మోసం

డీఎస్సీ పేపర్ తయారు చేసిన వ్యక్తే టాపర్

స్పోర్ట్స్ కోటాలోనూ ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు

మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ధ్వజం

విజయవాడ, ఒంగోలు, రాజమండ్రి: లక్షలాది మంది అభ్యర్ధుల భవిష్యత్తుతో ముడిపడిన డీఎస్సీ పరీక్షను అక్రమాలకు చిరునామాగా మార్చేశారని, ప్రశ్నాపత్రం తయారీలో భాగమైన కాంట్రాక్ట్ ఉద్యోగే టాపర్ గా రావడం, అతని ఆ తర్వాత ఉద్యోగం నుంచి తప్పించడం, మెరిట్ లిస్ట్ ను వెబ్ సైట్ నుంచి మాయం చేయడమే ఇందుకు నిదర్శనమని మాజీ మంత్రులు పేర్ని వెంకట్రామయ్య (నాని), మేరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మండిపడ్డారు. హైకోర్టు ఆదేశాలనూ ఈ ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని వారు తెలిపారు. డీఎస్సీ అక్రమాలపై నిగ్గుతేల్చేందుకు సీబీఐ దర్యాప్తు లేదా సిట్టింగ్ హైకోర్టు జడ్డితో విచారణ చేయించాలని మాజీ మంత్రులు పేర్ని వెంకట్రామయ్య (నాని), మేరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 
ప్రెస్ మీట్లలోపేర్ని వెంకట్రామయ్య (నాని), మేరుగు నాగార్జున, జక్కంపూడి రాజా ఇంకేమన్నారంటే..    

● డీఎస్సీ నియామకాల్లో ప్రభుత్వం బరితెగింపు 
- పేర్ని వెంకట్రామయ్య (నాని), మాజీ మంత్రి 

సమాజానికి భావి పౌరుల్ని అందించాల్సిన విద్యావ్యవస్ధలో సైతం స్కాంలు చేసే దౌర్భాగ్యస్దితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉంది. డీఎస్సీలో కాంట్రాక్ట్ ఉద్యోగికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఈ చోద్యం ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. లక్షలాది మంది పరీక్ష రాస్తే ఎవరికి ఏ ర్యాంక్ వచ్చిందో బోర్డు పెట్టరు, ఎవరికీ చెప్పరు. సాక్ష్యాత్తూ హైకోర్టు మెరిట్ లిస్ట్ ప్రకటించమని చెప్పినా కాలిగోటితో సమానంగా చూసారు. నిస్సహాయంగా ఆ జడ్డిగారు విద్యాశాఖ మంత్రిని, ఐఏఎస్ అధికారుల్ని నానా తిట్లూ తిట్టారు. అయినా భయం లేదు, వెరుపు లేదు, బరితెగింపు మాత్రమే కనిపిస్తోంది. మెరిట్ లిస్ట్ లేకుండా ప్రపంచంలో ఏ పోటీ పరీక్ష నిర్వహించరు. అడిగితే మెసేజ్ వస్తుందంటున్నారు. వారిని ఏ కేటగిరీ కింద ఎంపిక చేశారో చెప్పాల్సిన బాధ్యత లేదా ? ఇంతకన్నా పచ్చి మోసం, దగా ఇంకెక్కడా జరగదు. 

● చంద్రబాబు స్కాంల చరిత్రలో డీఎస్సీ మరొకటి
- జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు

చంద్రబాబు హయాంలో అన్నీ స్కాంలే. వీటిలో మరో కొత్త స్కాం డీఎస్సీ నియామకాలు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఆశలపై నీళ్లు చల్లే విధంగా డీఎస్సీ పరీక్ష నిర్వహించారు. చంద్రబాబు 1999-2004 సమయంలో సీఎంగా ఉండగా డీఎస్సీ అభ్యర్ధుల్ని మోసం చేశారు.  2014లో మరోసారి సీఎం అయినప్పుడూ డీఎస్సీ అభ్యర్ధుల్ని మోసం చేశారు. ఇవాళ మరోసారి తన సుపుత్రుడిని విద్యాశాఖకు మంత్రిగా పెట్టి డీఎస్సీ స్కాం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే దుష్ప్రచారం చేశారు. ప్రజలకు మోసపూరిత మాటల చెప్పి ఓట్లు దండుకుని, ఆ తర్వాత వాళ్లను మోసం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఈ ప్రభుత్వం ఏర్పడగానే మెగా డీఎస్సీ పేరిట ప్రతీ ఏడాదీ ఖాళీల్ని భర్తీ చేస్తామన్నారు. రాష్ట్ర విద్యా పరిశోధక మండలి పేరుతో నిర్వహించిన డీఎస్సీ నియామక ప్రక్రియలో అనేక తప్పిదాలు ఆధారాలతో సహా కనిపిస్తున్నాయి. ఎవరైతే ఎస్సీఈఆర్టీ డిజిటల్ విభాగంలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న వ్యక్తి డీఎస్సీ ప్రశ్నాపత్రం తయారీలో భాగమయ్యాడు. అలాగే పరీక్ష కూడా రాసి కృష్ణాజిల్లా నుంచి టాపర్ గా ఎంపికయ్యాడు. జోన్ 2 టీజీటీలో ర్యాంకర్ గా కూడా నిలిచాడు. పరీక్ష నిర్వహించే వ్యక్తే పరీక్ష కూడా రాస్తాడా ? అతనికే టాపర్ గా ర్యాంకు కూడా వస్తుందా ? 

- ఫేక్ సర్టిఫికెట్లతో స్పోర్ట్ కోటాలో ఉద్యోగాలు కొట్టేశారు

ఏ రోజూ గ్రౌండ్ లో అడుగుపెట్టని వారు, క్రీడలతో సంబంధం లేని వాళ్లు, స్పోర్ట్స్ కోటాలో జాతీయ స్ధాయిలో క్రీడాకారులుగా ఫేక్ సర్టిఫికెట్లు తెచ్చుకుని ఉద్యోగాలు సంపాదించారు. వాళ్లు కూడా ఒక్కో పోస్ట్ నూ 15-20 లక్షలకు బేరాలు ఆడినట్లు ఆడియో టేప్ లు ఉన్నాయి. రహస్యంగా ఉండాల్సిన డీఎస్సీ ప్రశ్నాపత్రాలు బయటికి వచ్చినట్లు అనేక ఆధారాలు కనిపిస్తున్నాయి. దాదాపు 
3.36 లక్షల మంది పరీక్ష రాస్తే కేవలం ఐదారు వేల మందికి మాత్రమే సెలెక్టెడ్ అని మెసేజ్ పంపించారు. సాధారణంగా పరీక్ష రాసిన వాళ్లందరికీ ఫలితం తెలుస్తుంది. కానీ ఇక్కడ పరీక్ష రాసిన 3.36 లక్షల మందికి ఫలితం తెలిసేలా కాకుండా ఎంపికైన వారికి మాత్రమే సెలెక్టెడ్ అని మెసేజ్ పెట్టారు. దీని మీద కొందరు హైకోర్టుకు వెళ్తే మిగతా వాళ్ల ఫలితాలు కూడా బయటపెట్టాలని ఆదేశించింది. ఎంపికైన అభ్యర్ధులకు మెసేజ్ ను ట్రయల్ రన్ గా మాత్రమే పంపినట్లు విద్యాశాఖ చెబుతోంది. దీన్ని బట్టి ఇందులో చాలా పెద్ద స్కాం జరిగిందని అర్దమవుతోంది. డీఎస్సీ అభ్యర్దుల జీవితాలతో ఆడుకున్న వారంతా బయటికి రావాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టడం సర్వసాధారణ విషయంగా చంద్రబాబు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కొడుకు మంత్రిగా పనిచేస్తున్న శాఖలో ఇలా అక్రమాలు జరగడం అనుమానాలకు తావిస్తోంది. కాబట్టి సీబీఐ దర్యాప్తు లేదా సిట్టింగ్ జడ్డితో విచారణ చేయించాలని వైఎస్సార్సీపీ యువజన విభాగం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఆలస్యం చేస్తే మాత్రం డీఎస్సీ అభ్యర్ధులకు అండగా పోరాటాలకు సిద్దంగా ఉన్నామని హెచ్చరిస్తున్నాం. 

● మెగా డీఎస్సీయా లేక మెగా స్కామా ?
- మేరుగు నాగార్జున, మాజీ మంత్రి

డీఎస్సీ అభ్యర్ధులు తాము కష్టపడి రాశాం, అర్హత సాధిస్తాం, ఉద్యోగం వస్తుందని ఆశగా ఎదురుచూశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ పరీక్ష నిర్వహణలో ఆ యువత భవిష్యత్తుతో చెలగాటమాడింది.మెగా డీఎస్సీ నిర్వహించారా లేక మెగా స్కాం చేశారా అని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. డీఎస్సీ ప్రక్రియ లక్షలాది మందితో ముడిపడిన సున్నిత అంశం. దాన్ని ఎందుకు మీ గుప్పిట్లో ఉంచుకున్నారు? జిల్లా కమిటీ పాత్రను ఎందుకు నిర్వీర్యం చేశారు ? టెట్ కన్వీనర్లను ఎందుకు మార్చేశారు ? టెట్, డీఎస్సీకీ ఒకే అధికారిని ఎందుకు నియమించారు ? ఇది అధికార దుర్వినియోగం కాదా ? అత్యంత రహస్యంగా ఉంచాల్సిన డీఎస్సీ ప్రశ్నాపత్రాల తయారీలో కాంట్రాక్టు ఉద్యోగుల్ని ఎందుకు నియమించారు ? ప్రభుత్వ ఉద్యోగులే దొరకలేదా ? చంద్రబాబు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే. డీఎస్సీ ప్రశ్నాపత్రాల తయారీ ప్రక్రియలో కాంట్రాక్టు ఉద్యోగి ఉంటడమేంటి ?,అతనికి స్టేట్ టాప్ ర్యాంక్ రావడమేంటి ? ఇది కావాలనే జరిగిందా, యాదృచ్ఛికంగా జరిగిందా చెప్పాలి. అతన్ని డీఎస్సీ తర్వాత ఉద్యోగంలో నుంచి ఎందుకు తీసేశారు ? ఇందులో తప్పు జరగకపోతే ఎందుకు తీయాల్సి వచ్చిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎవరైనా హైకోర్టుకు వెళ్తే వాళ్లను భయపెడుతున్నారు. ఈ వ్యవహారాన్ని గుట్టుచప్పుడు కాకుండా మేనేజ్ చేయాలని చూడటం బాధ్యతారాహిత్యమే. డీఎస్సీ పేపర్ లీకేజ్ లో చాలా డబ్బులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. వాటిపై సీబీఐ దర్యాప్తు వేస్తారా ? లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి. 

- సీబీఐ దర్యాప్తు లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి

టెస్టింగ్ మెసేజ్ ల పేరుతో డీఎస్సీ అభ్యర్ధుల జీవితాలతో ఆడుకున్నారు. మూడు పోస్టులకు ఒక వ్యక్తి అర్హత సాధిస్తే ఒక పోస్టుకే కాల్ లెటర్ పంపారు. దీని వల్ల దాదాపు నాలుగు వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. హైకోర్టు ఆదేశాలనూ నిర్లక్ష్యం చేశారు. చివరికి ఈ వ్యవహారం చాలా దారుణం, దుర్మార్గమని హైకోర్టే అంటే మీరు చర్యలు తీసుకోరు. ఈ తతంగంలో ఉన్న ఉద్యోగులపై చర్యలు తీసుకోరు. దీని వల్ల నష్టపోయింది పేద వర్గాలే. రాష్ట్ర  ప్రభుత్వాన్ని నమ్మి డీఎస్సీ రాసిన వారిని మోసం చేశారు. ఇంత ఆర్భాటం చేసిన వారు ఈ స్కాంకు బాధ్యులెవరో చంద్రబాబు, లోకేష్ తేల్చలేరా ? ఇందులో మీ బంధువులు ఉన్నట్లు చెప్తున్నారు. వారిపై చర్యలు తీసుకోలేరా ? కాంట్రాక్టు ఉద్యోగి డీఎస్సీలో టాపర్ గా రావడంతోనే మెరిట్ లిస్ట్ వెబ్ సైట్ నుంచి తీసేశారా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎక్కడైనా ఎంట్రన్స్ జరిగితే ఫలితాలు ప్రకటించేటప్పుడు అంత మందికీ ర్యాంకులు ఇస్తారు. ఈ డీఎస్సీ ఏంటో మరి.. మెరిట్ లిస్ట్ మాత్రం బయటపెట్టరు. కొందరికి మాత్రమే మెసేజ్ లు పెట్టి మెరిట్ లిస్ట్ తీసేశారు. ఈ ప్రభుత్వంలో విద్యామంత్రి చాలా కారుకూతలు కూస్తుంటారు. దీనిపై మాత్రం సమాధానం చెప్పడం లేదు. ఒక్కో పోస్టుకూ 15 నుంచి 25 లక్షలు తీసుకున్నారని బయట చెప్తున్నారు. దీనిపై సీబీఐ దర్యాప్తు లేదా జడ్డితో విచారణ చేయించండి.

Back to Top