కాకినాడ: వైయస్ఆర్‌సీపీ నేత, ఉమ్మడి విశాఖ–విజయనగరం జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన రాష్ట్రంలో చట్టపరమైన వ్యవస్థలపై సందేహాలు రేకెత్తిస్తోందని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ, “చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా? లేక ప్రైవేట్ గ్యాంగ్‌లా వ్యవహరిస్తున్నారా?” అని ప్రశ్నించారు. పూడి శ్రీహరిని పోలీసులు ఒక ప్రైవేట్ గ్యాంగ్ ఎత్తుకెళ్లినట్లుగా తీసుకువెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా మఫ్టీలో పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడం తీవ్రంగా అభ్యంతరకరమని అన్నారు. “నిజంగా అరెస్ట్ చేస్తే కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలి. కనీసం ఎఫ్ఐఆర్‌లో కూడా శ్రీహరి పేరు లేకపోవడం అనుమానాస్పదం” అని పేర్కొన్నారు. ఈ అరెస్ట్ వెనుక అసలు బాధ్యులు ఎవరో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. “ఇది చంద్రబాబు కార్యక్రమమా? లేక లోకేష్, హోంమంత్రి కార్యక్రమమా?” అని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలు సంప్రదాయాలుగా మారితే భవిష్యత్తులో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడతాయని హెచ్చరించారు. వైయస్ జగన్‌పై జరుగుతున్న వ్యక్తిత్వ హననం ఎప్పుడూ చూడలేదని, టిడిపి సోషల్ మీడియా ద్వారా ప్రతిరోజూ దుష్ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. “ఒకవైపు మిషన్ మోడ్‌లో వైయస్ఆర్‌సీపీ, వైయస్ జగన్‌ను దెబ్బతీసే ప్రచారం… మరోవైపు తప్పుడు కేసులు పెట్టడం జరుగుతోంది” అని అన్నారు. దీనిపై డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ, “మీరు ఇండియన్ సివిల్ సర్వీస్‌లో పనిచేస్తున్నారా? లేక టిడిపి సివిల్ సర్వీస్‌లోనా?” అని తీవ్రంగా ప్రశ్నించారు. పూడి శ్రీహరిని వెంటనే విడుదల చేయాలని కురసాల కన్నబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.