తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (మీడియా విభాగం) పూడి శ్రీహరి అక్రమ అరెస్టును వైయస్ఆర్‌సీపీ ముక్తకంఠంతో ఖండిస్తున్నట్లు పార్టీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రరెడ్డితో కలిసి లేళ్ల అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడారు. వారు ఏమన్నారంటే.. లేళ్ల అప్పిరెడ్డి , వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (మీడియా విభాగం) పూడి శ్రీహరిని ఈ రోజు ఉదయం అక్రమంగా అరెస్టు చేయడాన్ని వైయస్‌ఆర్‌సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. ఉదయం పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని కలిసి ఇంటికి వెళ్తున్న సందర్భంలో రోడ్డులో అడ్డగించి మఫ్టీ డ్రస్‌లో ఉన్న వ్యక్తులు శ్రీహరిని బలవంతంగా కారులో నుంచి దించి వారి వాహనంలోకి ఎక్కించుకున్నారు. మీరు ఎవరని అడుగుతున్నా కూడా కనీస సమాచారం ఇవ్వకుండా బలవంతంగా ఎత్తుకెళ్లారు. ఇప్పటికీ వరకు కూడా ఎక్కడికి తీసుకెళ్తున్నారో? ఎందుకు తీసుకెళ్తున్నారో ఎవరికి సమాచారం ఇవ్వలేదు. నిన్ననే కదా ఈ దేశానికి రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు జరుపుకున్నాం. ఆయన రచించిన రాజ్యాంగాన్ని, ఆ స్ఫూర్తిని మంటగలిపేలా ఒక సీనియర్ జర్నలిస్టుగా ఉన్న వ్యక్తి, గతంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారికి సీపీఆర్‌వోగా పని చేసిన శ్రీహరిని అక్రమంగా అరెస్టు చేస్తారా? కుటుంబ సభ్యులకు కనీస సమాచారం ఇవ్వరా? పోలీసులకు, గూండాలకు తేడా ఏంటి? అసలు ఈ సంస్కృతి ఏంటని అడుగుతున్నాం. ఈ విధమైన పరిపాలనతో రాష్ట్రంలో ఉన్న వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలను, నాయకులను భయపెడుతున్నారు. చివరకు సీనియర్ జర్నలిస్టు అయిన శ్రీహరిని కూడా ఇవాళ అక్రమంగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మా నాయకుడు వైయస్ జగన్ చెప్పిన మాటలను గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఏ విత్తనమైతే నాటారో.. అదే చెట్టు అవుతుంది. అవే ఫలితాలు పునరావృతం అవుతాయన్నది మరచిపోవద్దు. ఇంతటి దౌర్భాగ్యమైన పరిస్థితులు దారుణం. శ్రీహరి పక్కన ఉన్న వ్యక్తిని బెదిరించారు. ఆ తరువాత అక్రమంగా ఇంట్లోకి దూరి సోదాలు చేస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణలో ఏ స్థానంలో ఉందో కేంద్ర ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. ఒకపక్క యథేచ్చగా టీడీపీ నేతలు, కార్యకర్తలు రోడ్లపై దౌర్జన్యాలు చేస్తున్నారు. వాటిని కట్టడి చేయడం మరిచారు. ప్రజాస్వామ్యంలో గొంతెత్తి ప్రశ్నించే వారిని బలవంతంగా నోర్లు మూయిస్తున్నారు. పూడి శ్రీహరి అరెస్టును వైయస్ఆర్‌సీపీ యావత్తు ముక్తకంఠంతో ఖండిస్తోంది. ఇలాంటి దుశ్చర్యలకు భయపడే ప్రసక్తే లేదు. వైయస్ జగన్ నేతృత్వంలో చట్టపరంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. న్యాయస్థానాల తలుపు తట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. ప్రభుత్వ పెద్దలు ఈ ఘటనపై ఆలోచన చేస్తారని ఆశిస్తున్నాం. ఇదే పోకడలు అవలంభిస్తే ప్రజాస్వామ్యంలో కనుమరుగవక తప్పదని” లేళ్ల అప్పిరెడ్డి హెచ్చరించారు. పూడి శ్రీహరి అరెస్టు మానవహక్కుల ఉల్లంఘనే: మనోహర్‌రెడ్డి వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (మీడియా విభాగం) పూడి శ్రీహరిని అప్రజాస్వామికంగా, చట్టవిరుద్ధంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ చేసిన ఈ అరెస్ట్ మానవహక్కుల హననమే. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అరెస్టు సమయంలో కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలి. అది చేయకపోతే ఆ అరెస్టును ఇల్లీగల్‌గా పరిగణించి సంబంధిత పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. సివిల్ డ్రస్‌లో వచ్చి అరెస్టు చేయడం కూడా చట్టవిరుద్ధమే. రౌడీల మాదిరిగా ప్రవర్తిస్తూ శ్రీహరిని తీసుకెళ్లడం ఆక్షేపణీయం. శ్రీహరిని ఏ కేసులో అరెస్టు చేశారో ఎవరికి తెలియదు. పోలీసులు వచ్చారా? రౌడీలు వచ్చారా? అనేది కూడా స్పష్టంగా తెలియని పరిస్థితి నెలకొంది. డీజీపీ ఇటీవల చేసిన సోషల్ మీడియా అణచివేత వ్యాఖ్యల నేపథ్యంలోనే పూడి శ్రీహరిని టార్గెట్ చేసి అరెస్టు చేశారనే అనుమానం ఉంది. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్‌లో వైయస్ జగన్ కుటుంబంపై నిరాధార ఆరోపణలు చేసి ట్రోలింగ్ చేసినప్పటికీ, సంబంధిత చానల్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఐటీడీపీ ద్వారా జరుగుతున్న అసత్య ప్రచారం, వ్యక్తిత్వ హనన పోస్టులపై పలుమార్లు ఫిర్యాదులు చేసినా పోలీసులు స్పందించడం లేదు. వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను దుర్మార్గులు, హంతకులుగా చిత్రీకరిస్తూ తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఇది రాజకీయంగా మమ్మల్ని దెబ్బతీయడానికి చేస్తున్న కుట్ర. పూడి శ్రీహరిని ఎక్కడికి తీసుకెళ్లారు? ఏ కేసులో అరెస్టు చేశారు? అనే వివరాలను వెంటనే వెల్లడించాలి. ఆయనపై థర్డ్ డిగ్రీ పద్ధతులు ప్రయోగిస్తున్నారనే సమాచారం ఉంది. ఈ వ్యవహారంపై వైయస్ఆర్‌సీపీ లీగల్ సెల్ ద్వారా న్యాయపోరాటం చేస్తాం. అక్రమ అరెస్టులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. డీజీపీ ఎలాంటి తారతమ్యంలేకుండా సోషల్ మీడియాలో అసభ్యకర కంటెంట్ పెట్టేవారిపై చర్యలు తీసుకోవాలి.ఈ అంశంపై హైకోర్టులో లాంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తున్నాం” అని మనోహర్‌రెడ్డి తెలిపారు. పూడి శ్రీహరి అరెస్టు అక్రమం: వెన్నపూస రవీంద్రారెడ్డి పూడి శ్రీహరి అరెస్టు పూర్తిగా అక్రమం. ఆయనను నడిరోడ్డుపై అడ్డుకొని బలవంతంగా నిర్బంధించి కారులో ఎత్తుకెళ్లడం తీవ్రంగా ఖండనీయము. ఇది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమైన చర్య. ఇదేనా రెడ్‌బుక్ రాజ్యాంగం? ప్రజల్లో పెరుగుతున్న తీవ్ర వ్యతిరేకతను వైయస్ఆర్‌సీపీ నాయకులు వెలుగులోకి తీసుకువస్తుండటంతో వారి గొంతు నొక్కే ప్రయత్నంలో భాగంగానే ఈ అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఇలాంటి దుర్మార్గమైన నిర్ణయాలే వారి పతనానికి నాందిగా మారతాయి. అధికార పార్టీ నేతల ఒత్తిడికి లోనై వ్యవహరిస్తున్న పోలీసులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వైయస్ఆర్‌సీపీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుంది. అక్రమ చర్యలకు పాల్పడిన వారిని వదిలిపెట్టబోము” అని వెన్నపూస రవీంద్రారెడ్డి హెచ్చరించారు.