ప్రైవేటీకరణే కూటమి ప్రభుత్వ లక్ష్యం

మత్స్యకారుల పొట్ట కొడుతున్న కూటమి ప్రభుత్వం

ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో 'జువ్వలదిన్నె' హార్భర్ 

ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

వైయస్.జగన్ హయాంలో మొదలైన హార్భర్ల నిర్మాణం కొనసాగాలి

లేని పక్షంలో గంగపుత్రుల పోరాటం తప్పదు

ప్రభుత్వాన్ని హెచ్చరించిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు

శ్రీకాకుళం లోని వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీపీ వైద్య విభాగం అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు.

జువ్వలదిన్నెలో ప్రైవేటు పెత్తనం..

గంగపుత్రులకు అన్యాయం

బియ్యపుతిప్ప హార్బర్‌ రద్దు దారుణం 

మత్స్యకారుల వలసలకు చంద్రబాబే బాధ్యుడు.

డిఫెన్స్ సంస్థల పేరుతో మత్స్యకారుల భూముల దోపిడీ.

లోకేష్ భూమిపూజపై మాజీ మంత్రి అప్పలరాజు నిప్పులు.

శ్రీకాకుళం:  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడమే ధ్యేయంగా పనిచేస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ వైద్య విభాగం అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.శుక్రవారం శ్రీకాకుళంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... మత్స్యకారుల సంక్షేమం కోసం వైయస్ జగన్ నిర్మించిన ఫిషింగ్ హార్బర్లను ప్రైవేటు పరంచేయడాన్ని తప్పుపట్టారు. రాష్ట్రంలో రోడ్లు, పోర్టులు, ఆసుపత్రులు, చివరకు ఇరిగేషన్ ప్రాజెక్టులను కూడా పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆరోపించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడం ద్వారా పేదలకు వైద్య విద్యను దూరం చేస్తున్నారని, ఇప్పుడు మత్స్యకారుల జీవనాధారమైన హార్బర్ల మీద కన్నేశారని ధ్వజమెత్తారు. జువ్వలదిన్నె హార్బర్‌ను తక్షణమే మత్స్యకారులకు అప్పగించాలని, ప్రైవేటు సంస్థలకు కేటాయించిన స్థలాన్ని రద్దు చేయాలని అప్పలరాజు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మత్స్యకారులను సంఘటితం చేసి రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు.

ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే... 

సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేష్ కలెక్టర్ల సదస్సు సైతం డుమ్మా కొట్టి, నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో వైయస్.జగన్ కట్టిన హార్భర్ లో ఓ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయబోతున్నారు.  ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవాల్సిన ప్రతి సంస్థను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టే కుట్రకు తెరలేపింది. అందులో భాగంగానే రోడ్లు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్ అండ్ బి రోడ్లు, మండలం నుంచి మండలాన్ని అనుసంధించే రోడ్లుపైనా టోల్ గేట్లు పెట్టి .. పీపీపీ విధానంలో ఆ రోడ్లను నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు.

● పోర్టులు, ఆసుపత్రులు సహా సర్వం ప్రైవేటు మయం...

మరోవైపు అత్యంత ప్రతిష్టాత్మకమైన బనకచర్ల వంటి ఇరిగేషన్ ప్రాజెక్టులనూ పీపీపీ మోడ్ లో  చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. పర్యాటక శాఖలో ప్రతి సంస్థను ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టారు. ఇటీవల కాలంలో మేధావులు, విద్యావంతులు పెద్ద ఎత్తున వ్యతిరేకించినా కూడా మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పెట్టడం అత్యంత దారుణం. దీనికి కొనసాగింపుగా... ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్ల లోనే 2024 డిసెంబరు 29న ఏపీ ప్రభుత్వం మారిటైమ్ బోర్డు వెబ్ సైట్ లో నోటిఫికేషన్ విడుదల చేస్తూ.. రాష్ట్రంలో ఉన్న హార్బర్లను ప్రైవేటీకరణ చేస్తూ, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడానికి ఎక్స్ ప్రెసన్ ఆఫ్ ఇంటరెస్ట్ (ఈఓఐ) కోరుతూ ప్రకటన ఇచ్చారు. 

సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ లను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ముఖ్యమంత్రిగా నాలుగో సారి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు గారూ.. ఒక మత్స్యకారుడుగా, ఆ సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధిగా, అదే శాఖకు మాజీ మంత్రిగా ప్రశ్నిస్తున్నాను. ఏపీలో సుమారు 1000 కిలోమీటర్ల తీరప్రాంతంలో మీ హాయంలో కేవలం ఒక్క రూ.10 అభివృద్ధి పనైనా ఉంటే చూపించగలరా? మీ నాలుగు దఫాలు ముఖ్యమంత్రిత్వంలో ఒక జట్టీ, ఒక పోర్ట్, హార్భర్ కానీ శంకుస్థాపన లేదా ప్రారంభం చేశారా? చంద్రబాబు గారూ?. దమ్ముంటే నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి.

● పోర్టులు, ఫిషింగ్ హార్భర్లు వైయస్.జగన్ హయాంలోనే...

మా పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్.జగన్ పాదయాత్రలో మత్స్య కార్లు కష్టాలు చూసి... శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు ఉన్న తీరప్రాంతంలో ఉన్న మత్స్యకార్లు .. వైయస్.జగన్ తో మన రాష్ట్రంలో డీప్ సీ ఫిషింగ్ కు అనువైన హార్భర్లు లేవు అని మొరపెట్టుకున్నారు. 2019లో తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి జిల్లా లోనూ ఒక హార్భర్ ఉండాలని 10 ఫిషింగ్ హార్భర్లు, 6 జట్టీలు మంజూరు చేసిన ఘనత వైయస్.జగన్ దే. ఈ విషయాన్ని చాలా గర్వంగా చెప్పుకోగలం. మత్స్యకార్ల సంక్షేమం కోసం, వారి వలసలను నిరోధించేందుకు, మన రాష్ట్ర మత్స్యకార్లు మన రాష్ట్రంలోనే వేటకు వెళ్లాలని ఆలోచన చేస్తూ ప్రతి జిల్లాలో ఒక హార్బర్ నిర్మాణానికి  శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా మొదటి విడత రూ.1522 కోట్లతో 4 హార్భర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో జువ్వలదిన్నెలో  తొలి హార్భర్  నిర్మాణానికి 2021 మార్చి 21న శంకుస్థాపన చేశారు. ఒకవైపు కోవిడ్ రెండోదశ చాలా తీవ్రంగా ఉన్న రోజుల్లో కూడా.. వర్చువల్ గా ఈ హార్భర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2024 మార్చి 12న వర్చువల్ గా ఈ హార్భర్ ను ప్రారంభించారు. కేవలం మూడేళ్లలో పనులు పూర్తిచేసి, అందుబాటులోకి తెచ్చారు. ఇదే కాకుండా బాపట్ల జిల్లాలో రూ.451 కోట్లతో 90 శాతం పనులు , రూ.422 కోట్లతో మచిలీపట్నం పనులు 90 శాతం, కాకినాడ జిల్లా ఉప్పాడలో రూ.361 కోట్లతోనూ పనులు దాదాపు పూర్తయ్యాయి. అంటే తొలిదశలో జువ్వలదిన్నె, మచిలీపట్నం, ఉప్పాడ, నిజాం పట్నంలో నాలుగు హార్బర్లకు శంకుస్థాపన చేసి.. రెండేళ్ల కరోనా ఉన్నప్పటికీ.. దాదాపు పూర్తయ్య స్థితికి తీసుకొచ్చాం. 

రెండో దశలో శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెం, అనకాపల్లి జిల్లా పూడిమడక, ప్రకాశం జిల్లా కొత్తపట్నం, బాపట్ల జిల్లా ఓడరేవు దగ్గర మరో నాలుగు హార్భర్లతో పాటు బియ్యపుతిప్ప, నువ్వులరేవు దగ్గర మంచినీళ్లు పేట వద్ద మంజూరు చేసిన జట్టీ స్ధానంలో హార్భర్ పనులకు శ్రీకారం చుట్టాం. రూ.85 కోట్లతో జియో ట్యూబింగ్ టెక్నాలజీతో హార్బరుగా మార్చే ప్రయత్నం చేశాం. కేంద్ర ప్రభుత్వం  పీఎంఎంఎస్ వై కింద ఇచ్చే కోటా పూర్తైంది, బియ్యపు తిప్ప దగ్గర హార్బర్ కి నిధులివ్వలేమని చెబితే ఆ రోజు వైయస్.జగన్ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేపడదామని  గొప్ప మనసుతో చెప్పారు. దానికోసం రూ.429 కోట్లు కేటాయించారు.   మొత్తం 10 హార్బర్ల నిర్మాణానికి శ్రీకారం చుడితే.. మీ హయాంలో ఒక్క హార్బర్, పోర్టు నిర్మాణానికి కనీసం శంకుస్థాపన కూడా చేయలేదు.  వైయస్.జగన్ హాయంలో మత్స్యకార్ల సంక్షేమం కోసం తీసుకొచ్చిన హార్బర్ల నిర్మాణం కోసం శ్రీకారం చుడితే వాటినీ ప్రైవేటు పరం చేస్తున్నారు. 

ఇటీవల చంద్రబాబు సమీక్ష చేస్తూ.. పశ్చిమ గోదావరి జిల్లాలో బియ్యపు తిప్ప దగ్గర హార్బర్ స్ధానంలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వైయస్.జగన్ హాయంలో రూ.429 కోట్లతో హార్భర్ నిర్మాణానికి నిధులు కూడా సమీకరించి శంకుస్థాపన చేస్తే... ఇప్పుడు ఆ స్ధానంలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పడం దారుణం. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ  నిర్ణయం మత్స్యకార్లకు తీరని నష్టం జరుగుతుంది. దీనిపై మత్స్యకార్లను సంఘటిత పరిచి.. ఉద్యమానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అనుకుంటున్న తరుణంలో మరింత పిడుగులాంటి వార్త బయటపడింది.

● పూర్తైన హార్బర్ నూ ప్రైవేటీకరణ కుట్ర దిశగా...

జువ్వలదిన్నెదగ్గర వైయస్.జగన్ 2024 మార్చి 12 ప్రారంభోత్సవం చేసిన హార్బర్ ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగష్టు లో ప్రధాని చేతులో మీదుగా మరలా ప్రారంభోత్సవం చేయించారు. ఇవాల్టికి ఆ ప్రారంభోత్సవం చేసుకుని రెండేళ్లైనా ఇవాల్టికి కూడా మత్స్యకారులు అ హార్బర్ లో అడుగు పెట్టడానికి అవకాశం ఇవ్వలేదు 1250 మెకనైజ్డ్ బూట్లు నిలిపి ఉంచడానికి అవసరమైన 809 మీటర్ల పొడవైన క్వే నిర్మాణం చేపట్టాం. 70 ఎకరాల్లో స్థలంలో, బ్రేక్ వాటర్స్ నిర్మాణం చేపట్టాం. అందులో 10 ఎకరాల్లో ఫిష్ ప్రాసెసింగ్ ప్లాంట్ కోసం కేటాయించాం. బోటింగ్ యార్డు కోసం, మోడరన్ బోట్ల నిర్మాణం కోసం కూడా స్థలాన్ని కేటాయించాం. కానీ రెండేళ్లలో మత్సకారులకు ఇంకా హార్బర్ ఎందుకు అందుబాటులోకి రాలేదు? కారణం రాష్ట్రంలో ఉన్న పోర్టులు, హార్బర్లను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం.. ఆ కుట్రలో భాగంగానే పూర్తి చేసిన హార్బర్ ను గంగపుత్రులకు అందుబాటులోకి తేవడం లేదు. 

● మత్స్య కార్లను నిలువునా మోసం చేస్తున్న చంద్రబాబు...

ఈ కార్యక్రమంలో బాగంగానే మంత్రి లోకేష్ నిన్న జువ్వలదిన్నె వద్ద సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ లిమిటెడ్ అనే సంస్థకు భూమిపూజ చేశారు. మత్స్యకార్లకు కేటాయించిన స్థలంలో కూటమి ప్రభుత్వం వారిని అందులో అడుగుపెట్టనీయకుండా చేసి.. జువ్వలదిన్నె హార్బర్ కు కేటాయించిన 70 ఎకరాల్లో 29 ఎకరాలు సాగర్ డిఫెన్స్ సంస్థకు కట్టబెట్టడానికి నిర్ణయించారు. సదరు సంస్థ అండర్ వాటర్ డిఫెన్స్ సిస్టమ్స్ అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు. నాలుగు దఫాలు సీఎం చేసిన చంద్రబాబుకి, ఎగిసెగిసి పడుతున్న ఆయన తనయుడు లోకేష్ కి ఈ తరహా సంస్థలు ఎక్కడ పెట్టాలో అవగాహన లేదా? మీరు ప్రైవేటు వ్యక్తులకు జువ్వలదిన్నె హార్బర్ మీద పెత్తనం ఇస్తే.. మత్స్యకారులకు అందులో అడుగుపెట్టే అవకాశం ఉంటుందా? అక్కడకి దగ్గరలోనే దుగ్గరాజపట్నంలో కేంద్రం షిఫ్ బిల్డింగ్ క్లస్టర్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది... అక్కడ ఇలాంటి డిఫెన్స్ ఇంజనీరింగ్ సంస్థలు ఏర్పాటు అయితే బాగుంటుంది. లేనిపక్షంలో కృష్ణ పట్నం ప్రైవేటు పోర్టులో పెట్టుకునే అవకాశం ఉంది. నావల్ ఆల్టర్ నేటివ్ ఆపరేటింగ్ బేస్ (ఎన్ ఏ ఓ బీ)వద్ద 10 ఎకరాలు మంజూరు చేసినా అక్కడ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. అవేవీ చేయకుండా మత్స్యకారులకు ఉపయోగపడే హార్బర్ ని ఎలా ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెడతారు? ఆ రోజు వైయస్.జగన్ చాలా స్పష్టంగా హార్బర్లు కేవలం మత్స్యకార్ల కోసమే అని చెప్పారు. మిగిలిన ప్రైవేటు కార్యకలాపాల కోసం పోర్టులు నిర్మాణం చేస్తున్నామని కూడా చెప్పారు. కానీ చంద్రబాబుకి మాత్రం మత్స్యకార్ల సంక్షేమం పట్ల కనీస శ్రద్ధ లేదనడానికి ఇదే సాక్ష్యం. పూర్తి చేసిన హార్బర్ ను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడం అంటే వారిని నిలువునా మోసం చేయడమే చంద్రబాబూ. కేవలం రూ.45 కోట్లు పెట్టుబడి పెడుతున్న ప్రైవేటు సంస్థకు 100 మీటర్ల క్వే, ఆర్ సీ సీ నిర్మాణాన్ని కూడా కేటాయిస్తూ.. వారి దగ్గర నుంచి కేవలం రూ.9 కోట్లు మాత్రమే వసూలు చేస్తామని చెప్పడం గంగపుత్రులను మోసం చేయడమే.  ప్రభుత్వ ఆస్తులను ఇంత పచ్చిగా ప్రైవేటు వ్యక్తులకు కేటాయించడం దుర్మార్గం. మత్స్యశాఖ అంటే అవగాహన లేని వ్యక్తుల చేతుల్లో పెట్టి, మత్స్యకారుల సమస్యల పట్ల కనీసం ఆలోచన చేయడం లేదు. ఇన్ ల్యాండ్ ఫిషింగ్, ఆక్వా రంగాల గురించి కూడా ఆలోచించే నాధుడే లేకుండా పోయాడు. ఆక్వారైతులను ఆత్మహత్యల దిశగా అడుగులు వేసే దుస్దితికి తీసుకొచ్చారు. జువ్వలదిన్నె ప్రాజెక్టును ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడం ద్వారా...   మత్స్యకారుల నోటిదగ్గర కూడుని ప్రభుత్వం కాలితో తంతోంది. ఇప్పటికైనా గంగపుత్రులకు మంచి చేయాలనుకుంటే జువ్వలదిన్నె హార్బర్ ను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టొద్దని విజ్ఞప్తి చేస్తూనే.. వైయస్.జగన్ హాయంలో మొదలుపెట్టిన హార్బర్లను పూర్తి చేయాలని సీదిరి అప్పలరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదే పంధా కొనసాగిస్తే మత్స్య కార్లు తిరుగుబాటు ఖాయమని హెచ్చరించారు. 

● పాత్రికేయుల ప్రశ్నలకు బదులిస్తూ..

పలాస వైయస్సార్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అండర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో తొలి సారి కిడ్నీట్రాన్స్ ప్లాంటేషన్ నిర్వహించడం సంతోషం. వైయస్.జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే ఉద్దానం ప్రాంతానికి వచ్చినప్పుడే కిడ్నీ రీసెర్ట్ సెంటర్ ఏర్పాటుతో పాటు, ఇంటింటికి వంశధార జలాలు ఇస్తానన్న రెండు హామీలను నిలబెట్టుకున్నారు. కిడ్నా వ్యాధిగ్రస్ధులకు రూ.10వేలు పెన్షన్, డయాలసిస్ అదనపు సెంటర్ల ఏర్పాటు చేశారు. రీసెర్చ్ సెంటర్ ప్రారంభోత్సవం రోజే ఆయన మాట్లాడుతూ... వీలైనంత వేగంగా తొలి కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేసే ఏర్పాటు చేసామని కూడా చెప్పారు. అంటే ఆసుపత్రి ప్రారంభించేనాటికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇవాల కొంతమంది వ్యక్తులు జబ్బలు చరుచుకుంటూ.. తాము ఏదో ఘనకార్యం చేసామన్నట్లు మాట్లాడుతున్నారు.  ఈ ఘనత కేవలం వైయస్.జగన్ కే దక్కుతుందని డాక్టర్ సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు.

Back to Top