తాడేపల్లి: టీటీడీలో దశాబ్దాలుగా సన్నిధి గొల్లలుగా దేవుడికి సేవ చేస్తున్న యాదవులను తొలగించి వారి స్థానంలో తమకు నచ్చిన వారిని నియమించుకునే కుట్ర జరుగుతోందని, యాదవ జాతిని టీటీడీ నుంచి సాగనంపే కుట్రను ఎట్టి పరిస్థితుల్లో వైయస్ఆర్‌సీపీ సాగనివ్వదని, పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ హెచ్చరించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీకి చెందిన తిరుపతిలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో సన్నిధి గొల్లగా దశాబ్ధాలుగా సేవలందిస్తున్న వెంకటేశ్వర్లు యాదవ్‌ని తొలగించడం యాదవుల పట్ల సీఎం చంద్రబాబుకు ఉన్న వ్యతిరేతకు నిదర్శనమని మండిపడ్డారు. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరస్వామివారు యాదవులకు సన్నిధి గొల్లలుగా ఉండే వరం కల్పిస్తే, బీఆర్ నాయుడిని అడ్డం పెట్టుకుని వారిపై చంద్రబాబు విషం కక్కుతున్నాడని «ఆయన ద్వజమెత్తారు. గతంలోనూ యాదవుల మీద కోపంతో గొల్ల మండపాన్ని కూల్చాలని చంద్రబాబు కుట్ర చేస్తే యాదవుల ప్రతిఘటనతో వెనక్కి తగ్గాడని తెలిపారు. క్రీస్తు శకం 1472 లో యాదవ మహారాజు సాలువా మల్లయ్య దేవ మహారాయ వేయి కాళ్ల మండపాన్ని కట్టిస్తే దాన్ని కూల్చిన నీచ చరిత్ర కూడా చంద్రబాబుదేనని గుర్తు చేశారు. తాజాగా, ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో సన్నిధి గొల్లగా దశాబ్ధాలుగా సేవలందిస్తున్న వెంకటేశ్వర్లు యాదవ్‌ని గత నెల 1 నుంచి విధుల నుంచి తప్పించారని, దీన్ని సహించబోమని నాగార్జునయాదవ్ హెచ్చరించారు. ఆయనను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుమలలో కూడా సన్నిధి గొల్లలపై కక్ష కట్టిన చంద్రబాబు, నాడు సీఎంగా ఉన్నప్పుడు 2016లో వారిని తొలగించాలని ప్రయత్నించారని.. కానీ, తీవ్ర వ్యతిరేకత రావడంతో వెనక్కు తగ్గారని చెప్పారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా బీసీలను, ముఖ్యంగా యాదవులను వేధించడం ఆనవాయితీగా మారిందని, వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో విశాఖలో యాదవ భవన్ కోసం స్థలం కేటాయిస్తే కూటమి ప్రభుత్వం రాగానే, సీఎం చంద్రబాబు దాన్ని రద్దు చేశాడని నాగార్జునయాదవ్ ఆక్షేపించారు.