తాడేపల్లి: విద్య ద్వారానే సమాజంలో శాశ్వత మార్పు సాధ్యమని వందేళ్ల క్రితమే నమ్మి, ఆ ఆలోచనను కార్యరూపంలోకి తీసుకువచ్చిన మహనీయుడు దొమ్మేటి వెంకట రెడ్డి గారు అని వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు. దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బోడసకుర్రు గ్రామంలో జన్మించిన దొమ్మేటి వెంకట రెడ్డి, 1905లోనే బర్మాలో ప్రవాస శెట్టిబలిజ సోదరులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ‘శెట్టిబలిజ సంక్షేమ సంఘం’ను స్థాపించి విద్యా విస్తరణకు పునాది వేశారని వైయస్ జగన్ స్మరించుకున్నారు. అదేవిధంగా ప్రాథమిక పాఠశాలలు, గ్రంథాలయాలు, రాత్రి పాఠశాలలను స్థాపిస్తూ వయోజన విద్యకు మార్గం సుగమం చేసిన ఆయన కృషి ఎంతో గొప్పదని కొనియాడారు. సమాజ అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. దొమ్మేటి వెంకట రెడ్డి చూపిన మార్గం తరతరాలకు ప్రేరణగా నిలుస్తుందని, విద్యా ప్రాధాన్యతను సమాజం మరింతగా గుర్తించాల్సిన అవసరం ఉందని వైయస్ జగన్ అభిప్రాయపడ్డారు.