ఉరవకొండ : అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో కురిసిన అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారికి వెంటనే నష్టపరిహారం చెల్లించడంతో పాటు కనీస మద్దతు ధర కల్పించాలని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బెలుగుప్ప మండలం, కూడేరు పరిసర ప్రాంతాల్లో అకాల వర్షాల ప్రభావంతో పంటలు దెబ్బతిన్న విషయాన్ని ప్రస్తావిస్తూ రైతులతో కలిసి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అంకంపల్లి, గుద్దేకుంట, జీడిపల్లి, గంగవరం గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..బెలుగుప్ప మండలంలో వందల ఎకరాల్లో మొక్కజొన్న, అరటి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. సుమారు 400 ఎకరాల్లో మొక్కజొన్న, 200 ఎకరాల్లో అరటి పంటలు నష్టపోయాయని పేర్కొన్నారు. ఈ కారణంగా రైతులు కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టాన్ని అంచనా వేయడంలో వ్యవసాయ శాఖ అధికారులు విఫలమయ్యారని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో పర్యటించి పూర్తి స్థాయి అంచనా వేయాలని, నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా నష్టపోయిన పంటలకు కనీస మద్దతు ధర (MSP) కల్పించి రైతులను ఆదుకోవాలని కోరారు. రైతుల సమస్యలను పట్టించుకోకపోతే ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.