అనంతపురం: రాష్ట్రంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుందా..? లేక నారా లోకేష్ చెప్పే “రెడ్ బుక్ రాజ్యాంగం” నడుస్తోందా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని మాజీ మేయర్ మహమ్మద్ వసీం వ్యాఖ్యానించారు. గురువారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నప్పటికీ, ఆరంభం నుంచే వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు చేసినా అక్రమ కేసులు నమోదు చేసి, అరెస్టులు చేసి వేధింపులకు గురి చేస్తున్నారని విమర్శించారు. “ఇది ప్రజాస్వామ్య దేశమా..? లేక వేరే దేశమా..?” అన్న సందేహం కలుగుతోందన్నారు. ఇటీవల ఘనంగా నిర్వహించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు సహా కూటమి నేతలు రాజ్యాంగం ప్రకారం నడవాలని చెప్పారని గుర్తుచేశారు. అయితే మరుసటి రోజే రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీహరిని అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. అరెస్ట్ సమయంలో ఏ కేసులో తీసుకెళ్లారో కూడా చెప్పలేదని విమర్శించారు. కూటమి నేతలు కక్ష సాధింపుతో వైయస్ఆర్‌సీపీ నాయకులను టార్గెట్ చేస్తున్నారని, పోలీసులు న్యాయం వైపు ఉండకుండా అధికార పార్టీ చెప్పిన విధంగానే వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనలకు ప్రజలు రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా ఆరోపించారు. అలాగే పలు ఘటనలను ప్రస్తావిస్తూ, వాటిపై ఫిర్యాదులు చేసినప్పటికీ పోలీసులు కేసులు నమోదు చేయలేదని తెలిపారు. వైయస్ఆర్‌సీపీ నేతలపై మాత్రం చిన్న విషయాలకే కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. నారా లోకేష్ నేతృత్వంలోని ఐటీడీపీ ద్వారా మాజీ సీఎం జగన్‌పై అసభ్యకర పోస్టులు పెడుతున్నా చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. పోలీస్ వ్యవస్థ పనితీరును ప్రజలు గమనించాలని కోరిన వసీం, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంక్షేమ పథకాల ద్వారా అన్ని వర్గాలకు మేలు జరిగిందని చెప్పారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన “సూపర్ సిక్స్” హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శిస్తూ, వెంటనే వాటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబా సలామ్, మాజీ కార్పొరేటర్ కమల్ భూషణ్, పార్టీ నాయకులు కుళ్ళాయి స్వామి, జావిద్ తదితరులు పాల్గొన్నారు.