ఆంధ్రప్రదేశ్‌లోనే పెట్రోల్, డీజిల్ సంక్షోభం

ఎమ్మెల్సీ పాల‌వ‌ల‌స విక్రాంత్ ఆగ్ర‌హం

పాలకొండలో పెట్రోల్, డీజిల్ కృతిమ కొరతపై నిర‌స‌న‌ 

పాలకొండ:  పాలకొండ పట్టణంలో పలు పెట్రోల్ బంకులను ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు పాలవలస విక్రాంత్, మాజీ శాసన సభ్యులు విశ్వాసరాయి కళావతి కలిసి పరిశీలించారు. బంకుల్లో “నో స్టాక్” బోర్డులు కనిపించడంతో పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే పెట్రోల్, డీజిల్ సంక్షోభం ఉత్పన్నమైందని వారు పేర్కొన్నారు. ఇది సహజ కొరత కాదని, పూర్తిగా కృతిమ కొరతేనని ఆరోపించారు. గత నాలుగు రోజులుగా ఈ సమస్య మరింత తీవ్రమైందని, అయినప్పటికీ కూటమి ప్రభుత్వంలో ఎలాంటి స్పందన లేకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. రాష్ట్రంలో మొత్తం 4,510 పెట్రోల్ బంక్‌లు ఉండగా, అందులో సుమారు 70 శాతం బంకుల్లో “నో స్టాక్” బోర్డులు పెట్టడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోందన్నారు. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో ఎక్కడా ఇలాంటి కొరత లేదని, అక్కడ సరఫరా సజావుగానే కొనసాగుతోందని గుర్తుచేశారు.

వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు కేంద్ర మంత్రిని సంప్రదించినప్పుడు, సరఫరాలో ఎక్కడా లోటు లేదని, పెట్రోల్ బంకుల నుంచి ఒక్క ఇండెంట్ కూడా పెండింగ్‌లో లేకుండా సరఫరా జరుగుతోందని కేంద్రం స్పష్టం చేసిందన్నారు. అలాంటప్పుడు రాష్ట్రంలో ఈ కొరత ఎందుకు ఏర్పడిందనే ప్రశ్నకు ఒకటే సమాధానం ఉందని—డీలర్లు ఉద్దేశపూర్వకంగా స్టాక్ దాచిపెడుతున్నారని ఆరోపించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయన్న ప్రచారం నేపథ్యంలో డీలర్లు స్టాక్ నిల్వ ఉంచుతున్నారని, ఈ విషయాన్ని ప్రభుత్వం తెలిసినా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. మరోవైపు కమర్షియల్ ఆయిల్ ధరలు పెరగడంతో సాధారణ సరఫరాకు వచ్చే ఇంధనాన్ని ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయని తెలిపారు.

ప్రభుత్వం ఈ సమస్యపై సమీక్ష చేయకుండా కేవలం లీకులు ఇచ్చి బాధ్యత తప్పించుకుంటోందని మండిపడ్డారు. డీలర్లు, ప్రభుత్వం, కూటమి నాయకులు కుమ్మక్కై రాష్ట్రంలో కృతిమ కొరత సృష్టించారని ఆరోపించారు. ఇక ప్రభుత్వం మాత్రం వాహనదారులు భయంతో అధికంగా ఇంధనం కొనుగోలు చేయడం వల్ల డిమాండ్ పెరిగి కొరత ఏర్పడిందని చెప్పడం కేవలం కుంటి సాకేనని విమర్శించారు. ఈ సంక్షోభం అన్ని వర్గాల ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. ముఖ్యంగా డీజిల్ కొరత రైతులను తీవ్రంగా దెబ్బతీస్తోందని చెప్పారు. ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలకు అవసరమైన డీజిల్ అందక వ్యవసాయ పనులు నిలిచిపోతున్నాయని తెలిపారు. రబీ పంటల కోత సమయంలో ఈ సమస్య మరింత తీవ్రమైందని పేర్కొన్నారు. కోత యంత్రాలకు రోజుకు 100 నుంచి 160 లీటర్ల డీజిల్ అవసరం ఉండగా, సరఫరా లేకపోవడంతో యంత్రాలు పొలాల్లోనే నిలిచిపోతున్నాయని వివరించారు.

అలాగే చేపలు, రొయ్యల పెంపకంలో ఉపయోగించే ఏరియేటర్లు కూడా డీజిల్‌పై ఆధారపడటంతో ఆక్వా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పరిస్థితిని చక్కదిద్దాలని, లేకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వీరఘట్టం ఎంపీపీ దమలపాటి వెంకటరమణ నాయుడు, వైస్ ఎంపీపీ కనపాక సూర్యప్రకాష్, వైశ్యరాజు గోవిందరాజు, కడగల వెంకటరమణ, దుప్పాడ పాపినాయుడు, కిల్లారి మోహన్‌రావు, తూముల లక్ష్మణరావు, పల్లా భాను, ఉపేంద్ర, శేఖర్, మురళి, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
 

Back to Top