తిరుపతి: చంద్రబాబుకు “మెగలోమేనియా” వ్యాధి ఉందని, తనను తాను అతిశయోక్తిగా చిత్రీకరించుకోవడం ఆయన స్వభావమని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. రాజకీయాల్లో తనను తాను అత్యున్నతుడిగా చూపించుకోవడమే కాకుండా, ఇతరులను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చంద్రబాబు ఎప్పటినుంచో చేస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ నూతన కార్యవర్గ సభ్యుల పదవీ ప్రమాణ స్వీకారోత్సవంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరమని, రెండేళ్లలో తాము చేసింది చెప్పుకునేందుకు ఏమీ లేక వైయస్ఆర్‌సీపీని, వైయస్ జగన్ గారిని నిందిస్తూ గతి తప్పి మతి లేకుండా మాట్లాడారని తిరుపతిలో మీడియాతో మాట్లాడిన భూమన చెప్పారు. ప్రెస్‌మీట్‌లో భూమన కరుణాకర్‌రెడ్డి ఏమన్నారంటే.. - చంద్రబాబుకు మెగలోమేనియా వ్యాధి ఈ రోజు సీఎం చంద్రబాబు టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం సందర్భంగా చేసిన ప్రసంగం వింటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పటి వరకు రాజకీయ నాయకులతోనే రాజకీయాలు చేశామని, హంతకులతో రాజకీయాలు చేయలేదంటూ మా నాయకుడిపై దుర్భాషలాడటం పూర్తిగా అనుచితం. వైయస్ఆర్‌సీపీకి ‘ఓసీడీ’ పట్టుకుందని మాట్లాడటం మరీ దారుణం. అసలు చంద్రబాబుకే ‘మెగలోమేనియా’ వ్యాధి ఉంది. ఉన్నది లేనట్లుగా భ్రమించి తనను తాను అత్యున్నతుడిగా చిత్రీకరించుకోవడం ఆయనకు అలవాటైపోయింది. - మీడియాను అడ్డం పెట్టుకొని అతి ప్రచారం వేదాలు వ్యాసుడు కాదు తానే రాసినట్లు, భగవద్గీతను శ్రీకృష్ణుడికంటే తానే బాగా చెప్పగలనని, రామాయణం వాల్మీకి రాయలేదు, భాగవతం పోతన రాయలేదు అన్నట్టుగా మాట్లాడగల వ్యక్తి చంద్రబాబు. ఫోన్‌ను అలెగ్జాండర్ గ్రాహంబెల్ కాదు తానే కనిపెట్టానని, పరిణామ సిద్ధాంతాన్ని డార్విన్ కాదు తానే ఆవిష్కరించానని కూడా నమ్మించగలడు. అదే స్థాయిలో ఎల్లో మీడియా రోజు చంద్రబాబును జాకీలతో ఎత్తుతోంది. - హింసా, కుల రాజకీయాలకు ఆధ్యుడు చంద్రబాబే వైయస్ఆర్‌సీపీవి హత్యారాజకీయాలు చేస్తుందని చంద్రబాబు పిచ్చిగా మాట్లాడుతున్నాడు. కానీ చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచే హింసా, కుల రాజకీయాలకు తెరతీసిన వ్యక్తి. వంగవీటి రంగా హత్య వెనుక మీ పేరు వినిపించినా అది ప్రజల్లోకి రాలేదు. నా మిత్రుడు పింగళి దశరథరామయ్య హత్యపై కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎన్టీఆర్ పీఎస్ రాఘవేంద్రరావు మరణం, మల్లెల బాబ్జి ఘటనలపై కూడా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా నిజాలు బయటకు రాకుండా పోయాయి. - రాజారెడ్డి హంతకులకు ఆశ్రయమిచ్చింది మీరు కాదా బాబూ? మా నాయకుడైన వైయస్ రాజారెడ్డిని 1998లో కిరాతకంగా హత్య చేశారు. ఆ హంతకులకు మీరు నెల రోజుల పాటు ఆశ్రయం కల్పించిన విషయం అందరికీ తెలిసిందే. 1999–2004 మధ్య అనంతపురం జిల్లాలో వందల సంఖ్యలో హత్యలు జరిగినా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. మీ హయాంలో రౌడీలు, గూండాలు, హంతకులు స్వైర విహారం చేసినా మీరు పట్టించుకోకుండా వారిని సంఘ సేవకులుగా చూపించే ప్రయత్నం చేశారు. ఆ విషయాన్ని నిజమేనని నమ్మించేంత శక్తి, సామర్థ్యం మీకు అనుకూలంగా ఉన్న ప్రసార మాధ్యమాల ద్వారా కలిగింది. - త్రాసు పాములా బుసకొట్టి తప్పుడు కేసులు వైయస్ జగన్ గారు దివంగత మహానేత వైయస్‌ఆర్ ఆశయ సాధన కోసం రాజకీయాల్లోకి వచ్చారని తెలుసుకున్న వెంటనే, మీరు త్రాసు పాములా బుసకొట్టి సోనియా గాంధీతో కలిసి తప్పుడు కేసులు బనాయించి 16 నెలలు జైలులో పెట్టించారు. మీరు అధికారంలోకి వచ్చిన 21 నెలల్లోనే 21 మంది వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు బలి అయ్యారు. దాదాపు 700 మందికి పైగా హత్యలు జరిగాయి. అలాంటి మీరు ఇవాళ మాకు పాఠాలు చెబుతున్నారు. వైయస్ఆర్‌సీపీని నేరగ్రస్తమైనది, నీచమైనది అని అభివర్ణిస్తూ మాట్లాడటం పూర్తిగా అన్యాయం. మాకు సోషల్ మీడియా బలంగా ఉందని, ప్రభుత్వం చేసే పనులను చెడ్డగా ప్రచారం చేస్తున్నామని, పరిశ్రమలు రాకుండా అడ్డుకుంటున్నామని మీరు చేసిన ఆరోపణలు ఆధారరహితం. మీరు చెప్పిన ఈ మాటలు, ఇవాళ ప్రమాణ స్వీకారం చేసిన మీ పార్టీ నాయకులకు కూడా వైయస్ఆర్‌సీపీపై దుష్ప్రచారం చేయాలనే సంకేతంగా మారాయి. - రాజకీయ ప్రయోజనాల కోసం భగవంతుడిని వదలడం లేదు ఈ రెండేళ్లలో సూపర్‌సిక్స్ హామీలు అమలు చేయకుండా, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పక్కనబెట్టి, స్వామి వారిని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. తిరుమల లడ్డూ నుంచి పరకామణి వరకు అన్నీ అబద్ధ ప్రచారాలకే వేదికగా మారాయి. భగవంతుడినే రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం మీ రాజకీయ శైలి. మీ స్వార్థం కోసం తల్లి, చెల్లి, భగవంతుడు ఎవరినైనా వాడుకునే నైజం చంద్రబాబుదే. - మేనేజ్‌మెంట్ స్కిల్స్‌తో పదే పదే అధికారం వైయస్ జగన్ రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల ప్రయోజనాల కోసం పనిచేసే నాయకుడు. కానీ చంద్రబాబు ఇన్నాళ్లు సీఎంగా ఉన్నప్పటికీ ప్రజల్లో సహజమైన ఆదరణ పొందిన నాయకుడు కాదు. కేవలం మేనేజ్‌మెంట్ స్కిల్స్‌తోనే పదే పదే అధికారంలోకి వస్తున్నారు. ప్రతి ఎన్నికలో అమలుకు సాధ్యంకాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి గెలిచి, తర్వాత వాటిని అమలు చేయకపోవడంతోనే ప్రజలు మళ్లీ రెండోసారి అవకాశమివ్వడం లేదు. ఈసారి కూడా 2029లో కచ్చితంగా వైయస్ఆర్‌సీపీ అధికారంలోకి వస్తుంది. మీరు చేసిన ఘోరాలకు, ప్రజా విద్రోహ చర్యలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు. - మీది వెన్నుపోటు పార్టీ 2029లో ఇంకా ఎక్కువ సీట్లు గెలుస్తామని చంద్రబాబు చెబుతుండటం చూస్తే ఈవీఎంలపై కూడా అనుమానాలు కలుగుతున్నాయి. మీ రాజకీయ జీవితం మొత్తం కుట్రలు, వెన్నుపోట్లు, మోసం, దగానే నిండి ఉంది. మమ్మల్ని గొడ్డలి పార్టీ అంటారా? మీది వెన్నుపోటు పార్టీ. పిల్లనిచ్చిన మామను, సొంత తమ్ముడిని, తోడళ్లుడిని, బావను ఇలా ఎంతో మందిని వెన్నుపోటు పొడిచిన చరిత్ర మీదే. మీరు మా గురించి మాట్లాడటం అంతకంటే దారుణం మరొకటి ఉండదు. మీరు మాట్లాడినంత మాత్రానా మా ఆత్మస్థైర్యం తగ్గదు. వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారు. ఇలాంటి చిత్రహింస రాజకీయాలు చేసినా వైయస్ఆర్‌సీపీ వెనక్కి తగ్గదు. చంద్రబాబు చేస్తున్న అరాచకాలను ఎండగట్టకుండా ఊరుకోబోమని భూమన కరుణాకర్‌రెడ్డి హెచ్చరించారు.