చంద్ర‌బాబు, లోకేష్‌ల‌కి జ‌గ‌న్ ఫోబియా

ఆయ‌న పేరెత్త‌కుండా టీడీపీకి రోజు గ‌డ‌వ‌డం లేదు

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి, మాజీ మేయ‌ర్ బీవై రామ‌య్య విమ‌ర్శ‌

తాడేప‌ల్లి లోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి, మాజీ మేయ‌ర్ బీవై రామ‌య్య‌

వ‌య‌సు పెరిగే కొద్దీ చంద్ర‌బాబు దిగ‌జారి మాట్లాడుతున్నాడు

వేదిక‌ల‌తో సంబంధం లేకుండా మైకు దొరికితే జ‌గ‌న్‌ని తిట్ట‌డ‌మే ప‌ని

అబ‌ద్ధాలతో వైయ‌స్ జ‌గ‌న్ వ్య‌క్తిత్వ హ‌న‌నం చేయ‌డ‌మే టీడీపీ ల‌క్ష్యం

రాష్ట్రంలో హ‌త్యా రాజ‌కీయాల‌కు ఆద్యుడు చంద్ర‌బాబే

వైయ‌స్ఆర్‌సీపీని గొడ్డ‌లి పార్టీ అంటే, టీడీపీని వెన్నుపోటు పార్టీ అంటాం

ఘాటుగా స్పందించిన బీవై రామ‌య్య‌

తాడేప‌ల్లి: తెలుగుదేశం పార్టీకి జ‌గ‌న్ ఫొబియా ప‌ట్టుకుంద‌ని, సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న కొడుకు నారా లోకేష్‌తోపాటు ఆ పార్టీ నాయ‌కుల‌కు జ‌గ‌న్ పేరు త‌లుచుకోకుండా పొద్దు పోవ‌డం లేద‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి, మాజీ మేయ‌ర్ బీవై రామ‌య్య ఆరోపించారు. తాడేప‌ల్లి పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడుతూ వ‌య‌సు పెరిగే కొద్దీ చంద్ర‌బాబుకి మ‌తి భ్రమించి ఏం మాట్లాడుతున్నాడో త‌న‌కే తెలియ‌డం లేదని పార్టీ స‌మావేశం, కంపెనీకి భూమి పూజ‌, పింఛ‌న్ల పంపిణీ అనే తేడా లేకుండా మైకు దొరికితే జ‌గ‌న్‌ని తిట్ట‌డమే అన్న‌ట్టు రెచ్చిపోతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో హ‌త్యారాజ‌కీయాల‌కు ఆద్యుడు, పేటెంట్ ఉన్న పొలిటీషియ‌న్ చంద్రబాబేన‌ని, వైయ‌స్ఆర్‌సీపీ గొడ్డ‌లి పార్టీ అయితే, టీడీపీ వెన్నుపోటు పార్టీనా? అని ప్ర‌శ్నించారు. పారిశ్రామికవేత్త‌ల ముందు తండ్రీకొడుకులు రాజ‌కీయ ప్ర‌సంగాలతో రాష్ట్ర ప‌రువు తీస్తున్నార‌ని విమ‌ర్శించారు. చంద్ర‌బాబుకి నేనే... నేనే అనే క్రెడిట్ చోరీ పిచ్చి పీక్స్‌కి చేరిపోయిందని బీవై రామ‌య్య ఆరోపించారు. 
ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే...  

- పారిశ్రామికవేత్త‌ల ముందు రాజ‌కీయ ప్ర‌సంగాలు సిగ్గుచేటు

సాధార‌ణంగా పార్టీ కార్య‌వ‌ర్గ స‌మావేశంలో పార్టీ గురించి, లేదా ప్ర‌భుత్వంలో తాము ఏం చేశామో చెప్పుకుంటారు. కానీ చంద్ర‌బాబు మాత్రం సంద‌ర్భంతో ప‌నిలేకుండా మైకు దొరికితే వైయ‌స్ జ‌గ‌న్ గారిని తిట్ట‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నాడు. ఆయ‌న పేరు త‌ల‌వ‌కుండా తండ్రీకొడుకులకు రోజు గ‌డ‌వ‌డం లేదు. మొన్న అన‌కాప‌ల్లిలో జరిగిన రెన్యూ ఎన‌ర్జీ స‌మావేశంలో ద‌స్త‌గిరి హ‌త్య గురించి చంద్రబాబు మాట్లాడితే నిన్న జ‌రిగిన గూగుల్ డేటా సెంట‌ర్ శంకుస్థాప‌న కార్య‌క్ర‌మంలో ఆయ‌న కొడుకు లోకేష్ ఇష్ట‌మొచ్చిన‌ట్టు రాజ‌కీయాలు మాట్లాడాడు. తండ్రీకొడుకులిద్ద‌రూ పారిశ్రామికవేత్త‌ల ముందు రాజ‌కీయ ప్ర‌సంగాల‌తో రాష్ట్ర ప‌రువు తీస్తున్నారు. అసెంబ్లీ కావొచ్చు, ప్రారంభోత్స‌వం కావొచ్చు, పింఛ‌న్ల పంపిణీ కావొచ్చు.. వేదిక ఏదైనా వైయ‌స్ జ‌గ‌న్ ని తిట్టి వ్య‌క్తిత్వ హ‌న‌నం చేయ‌డ‌మే అజెండాగా పెట్టుకున్నారు. 

- వ‌యసు పెరిగే కొద్దీ చంద్ర‌బాబు మ‌తిపోతోంది 

చ‌దవేస్తే ఉన్న‌మ‌తి పోయింద‌ని సామెత ఉన్న‌ట్టు వ‌య‌సు పెరిగే కొద్దీ చంద్ర‌బాబుకి మ‌తి భ్రమించి మాట్లాడుతున్నాడు. ఎక్క‌డికెళ్లి ఏం మాట్లాడ‌తాడో తెలియ‌దు. చిల్ల‌ర వ్యాఖ్య‌ల‌తో ఎన్నిసార్లు అభాసుపాల‌య్యాడో లెక్కేలేదు. సెల్‌ఫోన్, కంప్యూట‌ర్‌ క‌నిపెట్టింది నేనే అంటాడు. స‌త్య నాదెళ్ల‌ను అమెరికా పంపింది నేనే అంటాడు. మ‌హిళ‌ల‌కు గ్యాస్ వాడ‌టం నేర్పింది నేనే అంటాడు. నేను సీఎంగా ఉంటే క‌రోనా వ‌చ్చేదే కాదంటాడు. న‌న్ను చూసి హుద్‌హుద్ తుపాన్ దారి మ‌ళ్లిదంటాడు. అన్నింటికీ నేనే.. నేనే.. పిచ్చి బాగా ప‌ట్టుకుంది. అమ‌రావ‌తిలో ఉష్ణోగ్ర‌త‌లు 10 డిగ్రీలు త‌గ్గించాలంటాడు. ఆయ‌న పిచ్చి ఏ స్థాయికి వెళ్లిందంటే అనంత‌పురంలో చెట్లు కూడా నేనే నాటాన‌నే స్థాయికి వెళ్లాడు. అస‌మ‌ర్థుడైన కొడుకుని త‌ల‌చుకుని చంద్ర‌బాబుకి పిచ్చి ప‌ట్టినట్టుంది. క‌ళ్లార్ప‌కుండా అబ‌ద్ధాలు చెప్ప‌డంలో మాత్రం చంద్ర‌బాబు ఆరితేరిపోయాడు. ఇవ‌న్నీ చూసే చంద్ర‌బాబు డ‌ర్టీయెస్ట్ పొలిటీషియ‌న్ అని కేసీఆర్ అన్నాడు. చంద్ర‌బాబు న‌న్ను మించిన న‌టుడు అని 90వ ద‌శ‌కంలోనే ఎన్టీఆర్ చెప్పాడు. గ‌త టీడీపీ హ‌యాంలో జరిగిన వివేకానంద రెడ్డి మ‌ర్డ‌ర్ కేసుపై ఇక విచార‌ణ అవ‌స‌రం లేద‌ని సుప్రీంకోర్టు అభిప్రాయ‌ప‌డితే గొడ్డ‌లి పార్టీ అంటూ వైయ‌స్ఆర్‌సీపీ మీద బుర‌ద‌జ‌ల్లుతున్నాడు. ఏదో విధంగా వైయ‌స్ జ‌గ‌న్ గారి మీద నింద‌లు వేయ‌కపోతే వారికి రోజు గ‌డ‌వ‌డం లేదు. టీడీపీని వెన్నుపోటు పార్టీ ని ఎందుకు అన‌కూడ‌దు. వాళ్లు చేసిన త‌ప్పుల‌ను ఎదుటి వారి మీద‌కు నెట్టేసి బుర‌ద‌జ‌ల్ల‌డం చంద్ర‌బాబుకి వెన్న‌తో పెట్టిన విద్య‌. హ‌త్యా రాజ‌కీయాల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ చంద్ర‌బాబే. సొంత మామ‌ను వెన్నుపోటు పొడవ‌డానికి వెనుకాడ‌ని వ్య‌క్తి చంద్రబాబు.  

- ప్ర‌జ‌లే బుద్ధి చెబుతారు

వైయ‌స్ జ‌గ‌న్ గారు పార్టీకి నేర్పిన సంస్కారం కార‌ణంగా తెలుగుదేశం పార్టీని, చంద్ర‌బాబుని అన‌లేక‌పోతున్నాం. చంద్ర‌బాబు చేసే విష ప్ర‌చారానికి ప్ర‌జ‌లే గ‌ట్టిగా బుద్ధి చెబుతారు. రెండేళ్లు కాకుండానే చంద్ర‌బాబు పాల‌న తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త మూట‌గ‌ట్టుకుంది. కాదేది అవినీతికి అన‌ర్హం అన్న‌ట్టు చివ‌రికి డీజిల్ దోపిడీకి కూడా పాల్ప‌డి ప్ర‌జ‌ల‌ను ఇబ్బంది పెడుతున్నారు. ఏం చేసినా బాకా ఊదే ఎల్లో మీడియా ఉంది క‌దా అనే అహంకారంతో రెచ్చిపోతున్నారు. జీవితం చ‌ర‌మాంక‌లంలోనైనా మంచి ప‌నులు చేసి ప్ర‌జ‌ల్లో మంచి పేరు తెచ్చుకోవాల‌ని చూస్తే మంచిదని బీవై రామ‌య్య హిత‌వు ప‌లికారు.

Back to Top