ఎన్టీఆర్ జిల్లా: జగ్గయ్యపేట పట్టణంలోని బలుసుపాడు రోడ్డులో ఉన్న జగనన్న లేఅవుట్–2లో కనీస మౌలిక సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జగ్గయ్యపేట నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఆయన శనివారం కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి ఇంటూరి రాజగోపాల్ (చిన్న) *, పార్టీ పట్టణ అధ్యక్షుడు పఠాన్ ఫిరోజ్ ఖాన్ తో కలిసి కాలనీవాసులతో మాట్లాడి సమస్యలను విన్నారు. కాలనీలో సుమారు 400 కుటుంబాలు నివసిస్తున్నప్పటికీ తాగునీటి సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రజలు తెలిపారు. గతంలో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం పాలేరు ద్వారా మోటార్‌తో నీటి సదుపాయం కల్పించినప్పటికీ, తరువాత వైర్లు దొంగతనం కావడం, ప్రస్తుతం పాలేరు లో నీటి పారుదల లేకపోవడంతో దుర్వాసన రావడం వల్ల పరిస్థితి మరింత దారుణంగా మారిందని చెప్పారు. సమస్యకు పరిష్కారంగా కాలనీలో బోర్ వేయాలని కోరారు. కాలనీలో వీధి దీపాలు వెలగకపోవడంతో రాత్రి వేళల్లో మహిళలు భయాందోళనలకు గురవుతున్నారని తెలిపారు. వెంటనే వీధిదీపాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కాలనీలో రేషన్ షాప్ లేకపోవడంతో మూడు కిలోమీటర్ల దూరంలోని జగ్గయ్యపేట పట్టణానికి వెళ్లి సరుకులు తీసుకోవాల్సి వస్తోందని, దీనివల్ల ముఖ్యంగా వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. కాలనీలోనే రేషన్ షాప్ ఏర్పాటు చేసి నిత్యావసర సరుకులు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. రోడ్లు, డ్రైనేజీ సమస్యలు కూడా పరిష్కరించాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని తన్నీరు నాగేశ్వరరావు విమర్శించారు. జగ్గయ్యపేట మున్సిపాలిటీని స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా ప్రకటించినప్పటికీ, ఇక్కడ పరిస్థితులు చూస్తే **యాభై సంవత్సరాల క్రితం మారుమూల గ్రామంలో ఉన్నట్టుగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కన్నమాల శామ్యూల్ , రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి నంబూరి రవి , రాష్ట్ర చేనేత విభాగ అధికార ప్రతినిధి పెంటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.