ధాన్యం ధరలు తగ్గడం ఆందోళనకరం

నెల్లూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి

నెల్లూరు జిల్లా : సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం గొట్లపాలెం గ్రామంలో పర్యటించిన మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి ధాన్యం ధరలు రోజురోజుకు పడిపోవడం రైతులకు తీవ్ర ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు ఎన్నో కష్టాలు పడి పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర కూడా అందకపోవడం దురదృష్టకరమన్నారు. ధాన్యం ధరలు దిగజారకుండా ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని, కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల వద్ద నుంచి ధాన్యం సేకరించి కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.

ధాన్యం కొనుగోళ్ల విషయంలో జిల్లా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రైతుల పక్షాన నిలబడి అధికారులను నిలదీస్తామని హెచ్చరించారు. కూటమి పాలనలో రైతులకు సుఖసంతోషాలు లేకుండా పోయాయని, పంటలకు సాగునీరు, ఎరువులు సమయానికి అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు.

పంట దిగుబడులు పెరిగిన కొద్దీ దళారులు, వ్యాపారులు, మిల్లర్లు కలిసి ధరలను తగ్గిస్తూ రైతులను నష్టపరుస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం పేరుకే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, వాస్తవంగా రైతుల వద్ద నుంచి ధాన్యం సేకరించడం లేదని అన్నారు.

ఇక గతంలో వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులకు కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ధర లభించిందని గుర్తుచేశారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించి రైతులకు అండగా నిలిచినట్లు తెలిపారు. ధరల స్థిరీకరణ నిధి కింద ప్రతి ఏడాది భారీగా నిధులు కేటాయించేవారని, ప్రస్తుతం మాత్రం తక్కువ మొత్తంతో సరిపెట్టారని విమర్శించారు. రైతులు పండించిన ధాన్యానికి సరైన ధర లభించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేసిన కాకాణి, అవసరమైతే రైతులతో కలిసి జిల్లా అధికారుల కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం తిక్కవరప్పాడు మాజీ సర్పంచ్ నల్లగర్ల దేవసేనమ్మ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
 

Back to Top