వైయస్ఆర్ జిల్లా: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై కూటమి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, కుటుంబ సభ్యులు కలిసి కుట్రలు చేస్తున్నారని, ఈ పద్మవ్యూహంలో జగన్ అభిమన్యుడు కాదు… అర్జునుడు” అంటూ వైయస్ఆర్‌సీపీ నేత రెడ్డ్యం వెంకటసుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్ని కుట్రలు జరిగినా చివరకు ధర్మమే గెలుస్తుందని, వైయస్ జగన్ విజయాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కమలాపురం నియోజకవర్గ పరిశీలకుడు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి శనివారం కడపలో మీడియాతో మాట్లాడుతూ..వైయస్ విజయమ్మ నిన్న విడుదల చేసిన ప్రకటనను ఆయన తప్పుపట్టారు. ఈ ప్రకటన వైయస్ జగన్‌ను రాజకీయంగా దెబ్బతీయడానికే ఉద్దేశించబడిందని ఆరోపించారు. వైయస్ జగన్ తల్లిగా ఆయనతో నేరుగా మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ, అలా చేయకుండా పత్రికల ద్వారా ప్రకటన విడుదల చేయడం అనుమానాలకు తావిస్తోందన్నారు. కుమార్తె షర్మిలను రక్షించేందుకు ఈ ప్రకటన ఇచ్చారని పేర్కొన్నారు. వివేకానందరెడ్డి హత్యకేసులో వైయస్ జగన్‌ను ఇరికించేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. సరస్వతి పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన షేర్ల విషయంలో వైయస్ జగన్ బెయిల్ రద్దు అయ్యేలా ప్రయత్నాలు చేశారని అన్నారు. ఇది కూటమి నాయకులతో కుమ్మక్కై చేసిన కుట్రలో భాగమని ఆరోపించారు. కడప ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డిపై టిడిపి నేత బీటెక్ రవి చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన తీవ్రంగా ఖండించారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డిని అనవసరంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని అన్నారు. కేసు సంబంధిత అంశాల్లో పలు ప్రశ్నలు లేవనెత్తుతూ, దీనిపై సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.సమావేశంలో వైయస్ఆర్‌సీపీ నాయకులు సుధ ఉత్తమ రెడ్డి, జి.ఎన్. భాస్కర్ రెడ్డి, చీర్ల సురేష్ యాదవ్, మున్నెల్లి వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.