గుంటూరు: పొన్నూరు నియోజకవర్గంలోని పెదకాకాని మండలం పెదకాకాని బాజీ బాబా దర్గా ఉరుసు మహోత్సవాల్లో జరిగిన బాణాసంచా ప్రమాదంలో గాయపడిన చిన్నారులను పరామర్శించిన వైయస్ఆర్‌సీపీ పొన్నూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ అంబటి మురళీకృష్ణ ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. నిన్న జరిగిన ఉరుసు మహోత్సవ ఊరేగింపు సందర్భంగా బాణాసంచా పేలి చిన్నారులు లీనో, అజయ్ తీవ్రంగా గాయపడి ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు ఆసుపత్రికి వెళ్లి వారిని పరామర్శించిన అంబటి మురళీకృష్ణ, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం బాజీ బాబా దర్గా ఉరుసు మహోత్సవాలకు భారీగా భక్తులు హాజరవుతారని, అయినప్పటికీ తగిన భద్రతా చర్యలు చేపట్టకపోవడం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని విమర్శించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారులకు తక్షణమే రూ.5 లక్షల నుండి రూ.10 లక్షల వరకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలు అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.