చీపురుపల్లి : గుర్ల మండలం జమ్మూపేట గ్రామంలో మహాగణపతి, షిర్డి సాయి, హనుమత్, లక్ష్మణ సీతారామస్వామి వారి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవం శనివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది. గ్రామం అంతటా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ పుణ్య కార్యక్రమంలో విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), పార్టీ రాష్ట్ర కార్యదర్శి కేవీ సూర్యనారాయణరాజు తదితరులు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామాల్లో ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతి, సౌహార్దాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ఆలయ నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరినీ అభినందిస్తూ, దేవాలయాలు ప్రజల ఐక్యతకు ప్రతీకలుగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పొట్నూరు సన్యాసినాయుడు, జడ్పీటీసీ శిర అప్పలనాయుడు, జిల్లా గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు బెల్లాన బంగారు నాయుడు, రాష్ట్ర ఆర్టీఐ వింగ్ కార్యదర్శి కెంగువ మధుసూదన్ రావు, మెరకముడిదాం నరేష్, గుర్ల గ్రామ పార్టీ అధ్యక్షుడు మంత్రి వెంకటరమణతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.