తాడేపల్లి: 20 నెలల కూటమి పాలనలో కేవలం రూ.1.05 లక్షల కోట్ల అప్పులే చేశామని, ఏనాడూ నెట్ బారోయింగ్స్ అధిగమించలేదని చెబుతున్న ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్.. ఇవే మాటలను ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శితో రాయించి అధికారికంగా ప్రభుత్వం విడుదల చేసే దమ్ముందా అని కృష్ణా జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని పేర్ని వెంకట్రామయ్య (నాని) సవాల్ విసిరారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని పయ్యావుల కేశవ్ నోటితో చెబితే సరిపోదని, వైయస్ జగన్ గారిలా ఆధారాలతో నిరూపించాలని డిమాండ్ చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక రూ. 3.27 లక్షల కోట్ల అప్పులు చేసినట్టు పేర్ని నాని కాగ్ లెక్కలతో వివరించారు. నెట్ బారోయింగ్స్ దాటి అప్పులు చేయలేదని పయ్యావుల పచ్చి అబద్దం చెప్పాడని కాగ్ వెబ్‌సైట్ సాక్షిగా ఆయన నిరూపించారు. మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పినట్టు కూటమి అప్పులు రూ. 1.05 లక్షల కోట్లని వారం రోజుల్లో నిరూపించలేకపోతే అబద్ధాల కేశవ్ అని నేమ్ బోర్డు మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. రాష్ట్ర అప్పులపై అసెంబ్లీ, మండలిలో తప్పుడు సమాచారం ఇచ్చిన సంబంధిత అధికారులపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ), మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ మంత్రి అయిన ప్రధానికి ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు. చంద్రగిరిలో ఉన్న చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్ యూనిట్‌లో మెషినరీ అప్‌గ్రడేషన్ కోసం ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై ఆయన మండిపడ్డారు. దీనివల్ల రాష్ట్ర ప్రజలకు ఏం ప్రయోజనం ఉంటుందని ప్రశ్నించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.... అప్పుల మంత్రి, అబద్ధాల కేశవ్ రాష్ట్ర అప్పులపై పచ్చి అబద్ధాలతో వైయస్ జగన్ గారి మీద మరోసారి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తప్పుడు ప్రచారానికి పూనుకున్నాడు. పేరుకి ఆర్థికశాఖ మంత్రేకానీ నోటి మాటలతో ఇష్టమొచ్చినట్టు మాట్లాడే ఆయన, తాను చేసిన ఆరోపణలు ఏ ఒక్కదానికీ ఆధారాలు చూపించే ధైర్యం చేయలేదు. ఈ అబద్ధాల అప్పుల మంత్రి ఏ ఒక్కరోజూ డాక్యుమెంట్ ఎవిడెన్స్‌తో మాట్లాడలేదు. వైయస్ జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందనడానికి ఆయన దగ్గరున్న ఆధారాలుంటే చూపించాలి కదా. వైయస్ జగన్ గారి ప్రెస్‌మీట్‌లో చెప్పినవన్నీ అబద్ధాలని తేల్చేసిన పయ్యావుల.. ఏయే అంశాలు అబద్ధాలు చెప్పారు, వాటికి సంబంధించి నిజమైన ఆధారాలు మీ దగ్గరుంటే బయటపెట్టాలి. మీ రూ.3.27 లక్షల కోట్ల అప్పులకు లెక్కలివిగో 20 నెలల పాలనలో మా ప్రభుత్వం చేసింది కేవలం రూ.1.05 లక్షల కోట్ల అప్పేనని, కానీ వైయస్ జగన్ గారు రూ. 3.20 లక్షల కోట్ల అప్పులు చేసినట్టు చెప్పారని పయ్యావుల చెబుతున్నాడు. కానీ కరెక్టుగా చెప్పాలంటే ఆ అప్పు రూ. 3,27,370.37 కోట్లు. (రూ. 3.27 లక్షల కోట్లు). కాగ్ లెక్కల ప్రకారం 2024-25లో బడ్జెట్ బారోయింగ్స్ రూ.81,082.51 కోట్లని వెబ్‌సైట్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ దానికి పయ్యావుల మాత్రం రూ.69 వేల కోట్లేనని పచ్చి అబద్ధం చెబుతున్నాడు. ఏప్రిల్ 1, 2025 నుంచి 2026 జనవరి 31నాటికి బడ్జెట్ బారోయింగ్స్ రూ. 87,674.04 కోట్లని కాగ్ వెబ్‌సైట్ చెబుతోంది. అంటే, ప్రత్యక్షంగా ప్రభుత్వం నుంచి తీసుకున్న అప్పులు రూ. 1.70 లక్షల కోట్లు. ప్రభుత్వ గ్యారెంటీ ఇచ్చి వివిధ కార్పోరేషన్ల ద్వారా తీసుకొచ్చిన అప్పులు మరో రూ. 89,026.82 కోట్లు. ఇవేకాకుండా ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ బాండ్ల ద్వారా రూ. 11,850 కోట్లు. ఫిబ్రవరి 2026, మార్చిలో ఎస్‌డీఎల్ బాండ్స్ ద్వారా రూ. 9,900 కోట్లు అప్పులు తెచ్చారు. మొత్తం 20 నెలల్లో కూటమి ప్రభుత్వం తెచ్చిన అప్పు రూ.3,27,370.37 కోట్లు. ఇవన్నీ రాష్ట్ర ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులు. అప్పులు రూ.1.05 లక్షల కోట్లేనని లేఖ ఇప్పించు వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం రూ.9.74 లక్షల కోట్ల అప్పులను వారసత్వంగా ఇచ్చిందని చెబుతున్న పయ్యావుల కేశవ్.. ఇదే మాటను రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శితో రాయించి స్టేట్‌మెంట్ రిలీజ్ చేసే దమ్ముందా? మంత్రి మాట్లాడింది అబద్ధం కాదని, రెండేళ్లలో కూటమి ప్రభుత్వం చేసిన అప్పులు కేవలం రూ. 1.05 లక్షల కోట్లేనని వారం రోజుల్లో రాయించి ప్రభుత్వం తరఫున అధికారికంగా ఇవ్వగలరా? ఇవ్వలేకపోతే పయ్యావుల కేశవ్ ఛాంబర్ బయట అబద్దాల కేశవ్ అని పేరు మార్చుకోవాలని ఛాలెంజ్ విసురుతున్నా. నెట్ బారోయింగ్ ఎక్కడా మా ప్రభుత్వం అధిగమించలేదని పయ్యావుల మరో అబద్ధం చెప్పాడు. రాష్ట్ర జీఎస్‌డీపీ మీద 3 శాతం నెట్ బారోయింగ్ దాటి అప్పులు చేసినట్టు కాగ్ వెబ్‌సైట్‌లో చెప్పింది. ఏపీ ప్రభుత్వం 2024 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు ఎక్కడా నెట్ బారోయింగ్ అధిగమించలేదని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శితో ప్రభుత్వం తరఫున స్టేట్‌మెంట్ ఇప్పించే ధైర్యం పయ్యావులకు ఉందా? అసెంబ్లీ, కౌన్సిల్‌లో అప్పులపై తప్పుడు లెక్కలు రాసి ఇచ్చారో ఆ అధికారులందరిపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ శాఖ మంత్రి అయిన మోడీ గారికి ఫిర్యాదు చేస్తాం. ఎమ్మెల్యే బాధితురాలికి నేరం జరిగిందా? నిందితులను బాధితులుగా చేర్చడమే వైయస్ జగన్ పరిపాలన అంటాడు.. కూటమి ప్రభుత్వంలో రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే ఒక మహిళకు మాయమాటలు చెప్పి వివాహం చేసుకుంటానని నమ్మించి వేధించి పలుమార్లు అబార్షన్లు చేయిస్తే.. ఆమెకు మీ ప్రభుత్వం ఏం న్యాయం చేసిందో చెప్పాలి. మహిళలకు అన్యాయం చేసిన వాడికి అదే ఆఖరి రోజు అని పదే పదే చెప్పుకుని తిరిగే సీఎం చంద్రబాబు.. ఆ బాధిత మహిళకు ఏం న్యాయం చేశాడు? మీ ముఖ్యమంత్రి, మీ ఉప ముఖ్యమంత్రి, మీ మంత్రి లోకేష్‌లను కలిసి మొరపెట్టుకుంటే ఆమె జరిగిన న్యాయం ఏంటి? ఆ కూటమి ఎమ్మెల్యేని శిక్షించకపోగా తిరిగి ఆమె మీదనే కేసులు పెట్టి వేధించింది మీరు కాదా? ఆ కేసులను చూసి హైకోర్టు చీవాట్లు పెట్టలేదా? బాధితులను వేధించింది మీరు కాదా? హెరిటేజ్ మెషినరీ అప్‌గ్రేడ్ కోసం రూ.200 కోట్లు హెరిటేజ్ వ్యాపారం తన కుటుంబ సభ్యులు జీవోనోపాధి కోసం చేస్తున్నారని, వారు ఏనాడూ ప్రభుత్వ టెండర్లలో పాల్గొనలేదని చంద్రబాబు అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు చెప్పాడు. ఎప్పుడెప్పుడు టెండర్లలో పాల్గొన్నారు. నెయ్యితో పాటు టెండర్లలో ఏవేవీ సప్లై చేశారు? ఎల్ 3 గా ఎప్పుడు వచ్చారు. 2 వేల కేజీల పాల పొడిని ఏ రేటుకు సప్లై చేశారు వంటి అన్ని వివరాలు ఆయన మాట్లాడిన కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయన అబద్ధం చెప్పాడని ప్రజలే తేల్చేశారు. అవేకాదు.. టీటీడీ సొమ్ము దోచుకోవడానికి హెరిటేజ్ డెయిరీ సిండికేట్ చేసిన దారుణాలు కూడా అన్ని వెలుగులోకి వచ్చాయి. ఇదంతా దేవుడి మహిమ. చంద్రబాబు పాపాలను దేవుడే దగ్గరుండి బయటపెట్టిస్తున్నాడు. ఇది కాకుండా ఈరోజు కేబినెట్‌లో చంద్రగిరి ప్రాంతంలో ఉన్న హెరిటేజ్ డెయిరీలో రూ. 200 కోట్లతో మిషనరీ అప్‌గ్రేడ్ కోసం ఇండస్ట్రియల్ పాలసీలో ఇచ్చే రాయితీలు కాకుండా టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్ సిద్ధం చేసి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా కొత్తగా 35 మందికి ఉద్యోగాలిస్తారట. నా జీవితం తెరిచిన పుస్తకం అని చెప్పుకునే చంద్రబాబు కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎందుకు దాచిపెట్టారు? దీనివల్ల రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం ఏమిటని అడిగితే ఫ్లేవర్డ్ పాలు 131 శాతం అదనంగా ఉత్పత్తి జరుగుతుందని చెబుతున్నారు. పన్నీరు 400 శాతం అదనంగా వస్తుందట. వాటి వల్ల ప్రయోజనం ప్రజలకా హెరిటేజ్‌కా? పైగా ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 పేరుతో హెరిటేజ్‌కి భారీ రాయితీలు ప్రకటించారు. కరెంట్ యూనిట్‌కి రూపాయి తగ్గింపు. ఐదేళ్లపాటు 100 శాతం జీఎస్టీ రీయింబర్స్‌మెంట్ ఇచ్చారు. బీఆర్ నాయుడితో రాజీనామా చేయించలేరా? టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడి అశ్లీల వీడియో బయటకొచ్చినా ఆయనతో ఇప్పటివరకు రాజీనామా చేయించని చంద్రబాబుకి దేవుడంటే భయం, భక్తి ఉందని ఎలా అనుకోవాలి? వీడియో బయటకొచ్చిన తర్వాతైనా పశ్చాత్తాపం చెందకుండా అంతలా బరితెగించి మాట్లాడుతున్న బీఆర్ నాయుడిని వెనకేసుకు రావడం సిగ్గుచేటు. టీటీడీ చైర్మన్‌కి ఉన్న పాత బాగోతాలను ఆపాదించవచ్చా అని ప్రశ్నిస్తున్న ఎల్లో మీడియాకి నా సూటి ప్రశ్న.. అలాంటి బాగోతాలున్న వ్యక్తిని దేవుడి సేవకు వాడటం కరెక్టా? ఇలాంటి బాగోతం గురించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కి తెలిసే టీటీడీ చైర్మన్‌గా నియామకం జరిగిందని బాధితురాలి లేఖల ద్వారా ప్రపంచానికి తెలిసింది. అయినప్పటికీ ఆయన్ను చైర్మన్‌గా నియమించారు. వీడియోలు బయటకొచ్చినప్పుడైనా నిఆయనతో రాజీనామా చేయించి టీటీడీ ప్రతిష్ట కాపాడాలని అనిపించలేదా? లోకేష్ పాపానికి హెడ్ మాస్టర్ బలి రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగోలేదని రోజూ పేపర్ల నిండా వార్తలు, సోషల్ మీడియా నిండా వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. కానీ ఏనాడూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించలేదు. రెండేళ్లుగా ఈ సమస్య ఉన్నా నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించడానికి ఆయన ఏనాడూ ప్రయత్నించలేదు. పిల్లల ఆవేదన ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు. దేశాలు దాటి క్రికెట్ మ్యాచ్‌లు చూడటంపైన ఆయనకున్న శ్రద్ధ పిల్లలకు మంచి భోజనం పెట్టడం పైన లేదు. మధ్యాహ్న భోజనం బాగోలేదని మైలవరం తారకరామ నగర్ పాఠశాల హెచ్ఎం డ్రామా చేశాడని ఆంధ్రజ్యోతిలో వార్త రాస్తే, హెచ్ఎం బాధ్యత లేకుండా ప్రవర్తించాడన్న కారణంతో డీఈవో ఆయన్ను సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకున్నారు. కానీ వాస్తవానికి వంట బాగోలేదని ఎన్నోసార్లు విద్యార్థులు పోరు పెడుతున్నట్టు హెచ్ఎం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. ఎంక్వయిరీకి వెళ్లిన అధికారుల ముందు అన్నం బాగుండటం లేదని విద్యార్థులు ఏడుస్తూ చెప్పిన మాటలను కూడా ఈ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు? సోషల్ మీడియా దెబ్బకి నారా లోకేష్ వైఫల్యం గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగడంతో హెడ్ మాస్టర్‌ను బలి తీసుకున్నారు. ఇంతకన్నా దారుణం ఇంకోటి ఉంటుందా? విద్యాశాఖను నిర్వహించడం చేతకానప్పుడు ఏశాఖా లేని మంత్రి పదవి తీసుకుని లోకేష్ బయట తిరుగుతూ ఎంజాయ్ చేసినా విద్యార్థులకు మేలు చేసిన వాడవుతాడని మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు.