ప్రజాపక్షాన పోరాటం.. ధరల పెంపుపై సమరభేరి!

పెట్రోల్, డీజిల్ ధరల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలి

శాస‌న మండ‌లి విప‌క్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్‌

చీపురుపల్లి: రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను విచ్చలవిడిగా పెంచుతూ సామాన్య ప్రజలపై ప్రభుత్వం మోయలేని భారం మోపుతోందని నిరసిస్తూ చీపురుపల్లి జంక్షన్‌లో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసనమండలి విపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. “ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో రైతులు, కార్మికులు, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో.. ఇంధన ధరల పెంపు ప్రజలకు కోలుకోలేని దెబ్బ” అని ఆవేదన వ్యక్తం చేశారు.

“ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరిచేలా అదనపు భారాలు మోపడం మానుకుని, పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలి” అని డిమాండ్ చేశారు.వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం తమ పార్టీ రాజీలేని పోరాటం చేస్తుందని, ఎల్లప్పుడూ ప్రజల పక్షానే నిలుస్తుందని స్పష్టం చేశారు.ఇంధన ధరల పెంపును నిరసిస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున చీపురుపల్లి జంక్షన్ నుంచి మండల రెవెన్యూ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అధికారులను కలిసి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వినతిపత్రం అందజేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో మాజీ జీసీసీ చైర్‌పర్సన్ శోభా స్వాతిరాణి, చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, వివిధ అనుబంధ విభాగాల నాయకులు, సోషల్ మీడియా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
 

Back to Top