తాడేపల్లి: రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మహిళల మాన ప్రాణాలకు రక్షణ కరువైందని, ప్రజలను కాపాడాల్సిన ఎమ్మెల్యేలే కామాంధులుగా మారి అబలలను బలి తీసుకుంటున్నారని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. వేధింపులు, అత్యాచారాలకు గురైన మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేస్తే, వారిపైనే తిరిగి కేసులు నమోదు చేస్తున్న దౌర్భాగ్య పరిస్జితి రాష్ట్రంలో నెలకొందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యల వల్లే రాష్ట్ర పోలీస్ వ్యవస్థ పనితీరు దేశంలోనే అట్టడుగు స్థానానికి పడిపోయిందని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన నందమూరి లక్ష్మీపార్వతి చెప్పారు. ప్రెస్‌మీట్‌లో నందమూరి లక్ష్మీపార్వతి ఇంకా ఏం మాట్లాడారంటే..: దురుద్దేశంతో ‘దిశ’ను నిర్వీర్యం చేశారు: గత ప్రభుత్వ హయాంలో దిశ యాప్ తీసుకొచ్చి మహిళలకు ఎళ్లవేళలా జగన్‌గారు అండగా నిలబడితే చంద్రబాబు సీఎం అయ్యాక దురుద్దేశంతో ఆ యాప్ నిర్వీర్యం చేశారు. కేవలం జగన్‌గారికి మంచి పేరొస్తుందన్న అక్కసుతో, ఇంకా ఆయన మీద కోపంతో మహిళల మాన ప్రాణాలను ఫణంగా పెట్టడం చంద్రబాబు క్రూరత్వానికి నిదర్శనం. గత ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని ఎలాగూ నెరవేర్చలేదు. కనీసం వారికి రక్షణ అయినా కల్పించాలి. మహిళల రక్షణ మాటలు నీటిమూటలు: చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైంది. చిన్నారులు, వృద్ధులు అనే తేడా లేకుండా మహిళలను మానవ మృగాలు లైంగికంగా వేధిస్తున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు జరిగాయి. మరీ నీచంగా ఎమ్మెల్యేలే మహిళలను చెరబట్టి వేధిస్తున్న దౌర్భాగ్య పరిస్థితులు రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యేల అండ చూసుకుని వారి అనుచరులు కూడా రెచ్చిపోతున్నారు. కానీ ఎక్కడా నిందితులపై కనీస చర్య తీసుకున్న దాఖలా లేదు. దేవుడే లేడని చెప్పిన చంద్రబాబు, మా నాన్న హారతితో సిగిరెట్ వెలిగించుకుంటాడని చెప్పిన పవన్‌కళ్యాణ్.. ఇప్పుడు కొత్తగా దేవుడి పేరుతో దొంగ జపం చేస్తున్నారు. దేవుడంటే భయం, భక్తి లేకుండా కేవలం వేషం మార్చుకుని ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారు. మహిళల రక్షణ పేరుతో వీరిద్దరూ చెప్పిన మాటలు కూడా అలాగే కనిపిస్తున్నాయి. ఆడబిడ్డలను వేధిస్తే అదే వారికి ఆఖరి రోజు అవుతుందని చెప్పిన చంద్రబాబు, మహిళలకు అన్యాయం జరిగితే తలలు తీసేసే చట్టం తెస్తానన్న పవన్‌కళ్యాణ్ మాటలు నీటి మూటలయ్యాయి. రామాయణ, భారతాలు చూసైనా తెలుసుకొండి: ఏ దేశమైనా నాగకరికతలో ముందుకు వెళ్లాలంటే స్త్రీలను గౌరవించాలని గాంధీజీ చెప్పిన మాటలను వీరు చెవికి ఎక్కించుకోవడం లేదు. దేవుడు, భక్తి అంటూ చెప్పుకునే వీరిద్ధరూ ద్రౌపదిని నిండు సభలో అవమానించిందుకు కౌరవులు, సీతను చెరబట్టిన రావణుడు సర్వనాశనం అయిపోయిన భారత, రామాయణాల సారాన్ని ఎలా విస్మరించారు? తిరుమల ప్రతిష్టను, హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి నాయకులు.. బీఆర్ నాయుడి దుర్మార్గాల గురించి, ఆయన స్త్రీలోలుడని లేఖ ద్వారా చెప్పినా పట్టించుకోకుండా టీటీడీ చైర్మన్‌గా నియమించారు. చివరికి ఆయన అశ్లీల వీడియో బయటకొచ్చినా రాజీనామా చేయించకపోవడం సిగ్గుచేటు. సుగాలి ప్రీతి పేరుతో ఎమ్మెల్యేగా గెలిచిన పవన్‌కళ్యాణ్, అధికారంలోకి వచ్చాక ఆమె తల్లికి కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదు. నాడు మహిళలకు అండగా శ్రీ వైయస్ జగన్: నాడు జగన్‌గారు సీఎం అయ్యక మహిళలకు గౌరవం పెరిగింది. సంక్షేమ పథకాల రూపంలో ఆర్థికంగా చేయూత ఇవ్వడమే కాకుండా రాజకీయంగా ఉన్నత పదవులు ఇచ్చి ప్రోత్సహించిన ఘనత కేవలం శ్రీ వైయస్ జగన్‌కే దక్కుతుంది. మహిళ రక్షణ కోసం దిశ యాప్‌ను తీసుకొచ్చి అండగా నిలబడ్డారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం దిశ యాప్‌ను నిర్వీర్యం చేయడంతో పాటు, పోలీసు వ్యవస్థను కూడా పూర్తిగా దుర్వినియోగం చేస్తోంది. అందుకే గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో దేశంలోనే తొలి స్థానంలో నిల్చిన పోలీసులు, ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వంలో అట్టడుగు స్థానానికి పడిపోయారు. మరోవైపు ఈ ప్రభుత్వానికి ప్రజా సమస్యలు అస్సలు పట్టడం లేదు. ఎంతసేపూ కుట్రపూరిత, కక్ష రాజకీయాలు తప్ప. ఏ సమస్య వచ్చినా డైవర్షన్ పాలిటిక్స్ చేయడం, రోజూ జగన్‌గారిని, గత ప్రభుత్వాన్ని నిందించడం, ఎక్కడ, ఏం జరిగినా దాన్ని వైయస్ఆర్‌సీపీకి ఆపాదించడమే చంద్రబాబు పనిగా మారిందని నందమూరి లక్ష్మీపార్వతి చెప్పారు.