కాకినాడ: కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో నకిలీ మద్యం, గంజాయి విక్రయాలు, జూదగృహాల నిర్వహణ, సివిల్ పంచాయతీలతో ప్రజలను దోచుకునే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ ఉత్తరాంధ్ర జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు మండిపడ్డారు. కాకినాడ క్యాంప్ కార్యాలయంలో మీడియతో మాట్లాడుతూ... ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలను డిప్యూటీ సీఎం నుంచి టీడీపీ ఎమ్మెల్యే వరకు బయటపెడుతున్నా, ప్రభుత్వానికి సిగ్గు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రెడిట్ చోరీతో చంద్రబాబు బిజీ, డేటా సెంటర్‌తో లక్షల్లో ఉద్యోగాలంటూ అబద్దాలతో మంత్రి నారా లోకేష్‌లు బిజీబిజీగా ఉన్నారని ధ్వజమెత్తారు. ప్రజలు పడుతున్న అవస్థలు, నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు, హాస్టళ్ళలో విద్యార్ధుల మరణాలు, గ్రామాల్లో అంతుచిక్కని వ్యాధుల విజృంభణలు ఈ ప్రభుత్వానికి పట్టడం లేదని ఆక్షేపించారు. ఇంకా ఆయనేమన్నారంటే... ప్రజాసమస్యల కన్నా లేని గొప్పలు చెప్పుకోవడానికే కూటమి ప్రభుత్వ పెద్దలు ప్రాధాన్యత ఇస్తున్నారు. కేంద్రంలో బీజేపీ మద్దతు, రాష్ట్రంలో జనసేనతో అవగాహన ఉంది, ఎవరూ తమను ఏమీ చేయలేరనే ధీమాతో తెలుగుదేశం పార్టీ ఉంది. చంద్రబాబు ఏమి చేసినా పిట్టలదొర మాదిరిగా పొగడ్తలు చేసే ఈనాడు, ఆంధ్రజ్యోతి ఉందనే ధీమా కూడా వారిలో కనిపిస్తోంది. నేడు ఈ రాష్ట్రాన్ని ఎంతగా నాశనం చేస్తున్నారో, ప్రజలను ఎలా నిలువునా దగా చేస్తున్నారో క్షేత్రస్థాయికి వస్తే తెలుస్తుంది. ప్రజలకు సంబంధించి ఏ సమస్యను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నకిలీ మద్యంను డోర్ డెలివరీ స్థాయికి తెచ్చారు చిత్తూరుజిల్లా తంబళ్లపల్లె నుంచి ఉత్తరాంధ్రలోని పరవాడ వరకు నకిలీ మద్యం దందా నడుస్తోంది. కుటీర పరిశ్రమ మాదిరిగా ఈ నకిలీ మద్యం దందాను నడుపుతున్నారు. తాజాగా ఎక్సైజ్ కానిస్టేబుళ్ళను మద్యం షాప్ లకు పంపి, క్యూఆర్ కోడ్‌లపై మందుబాబులకు అవగాహనా కార్యాక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా ఎల్లో మీడియాలో వార్తలు రాయించుకుంటున్నారు. రాష్ట్రంలో మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూంలను పెట్టి, అడుగడుగునా బెల్ట్‌షాప్‌లను ఏర్పాటు చేసి మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. అలాంటప్పుడు క్యూఆర్ కోడ్‌లను ఎవరు పరిశీలిస్తారు, ఎవరు పరీక్షిస్తారు? నిన్నకే ఒక గ్రామంలో పర్యటిస్తూ బెల్ట్‌షాప్‌ల గురించి అడిగితే పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశారని, మద్యాన్ని ఏకంగా డోర్ డెలివరీ చేస్తున్నారని ఆ గ్రామస్తులు చెప్పారు. ఎన్‌ఫోర్స్‌మెంట్, తనిఖీలు అని చెబుతూ ఇలా డోర్‌డెలివరీ స్థాయిలో ఎలా మద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారో కూటమి పెద్దలు చెప్పాలి. గంజాయి అమ్మకాలు, జూదగృహాల నిర్వహణ బయటపడింది తిరువూరు తెలుగుదేశం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తనపార్టీకే చెందిన విజయవాడ ఎంపీ కేసినేని చిన్నిపైన చేసిన ఆరోపణలను పత్రికల్లో చూస్తున్నాం. ఎంపీ చిన్ని ప్రోత్సాహంతో ఆయన అనుచరులు గంజాయి అమ్మకాలు చేస్తున్నారని సాక్షాత్తు టీడీపీకి చెందిన ఎమ్మెల్యేనే వెల్లడించారు. అంటే అటు నకిలీ మద్యం, ఇటు గంజాయి అమ్మకాలు చేస్తూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారనేది బయటపడింది. ఇక ప్రభుత్వంలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ ప్రభుత్వంలో పేకాట శిబిరాల నిర్వహణపై పోలీస్ అధికారులు దృష్టి సారించాలంటూ ఏకంగా లిఖితపూర్వకంగా లేఖ రాశారు. జూదం ఆడటం, ఆడించడం, ప్రోత్సహించడం, కొందరు పెద్దలు పేకాట శిబిరాలను నిర్వహిస్తూ, నెలవారీ మామూళ్ళను అధికారులకు అందిస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి, దీనిపై విచారణ జరిపి, నిజానిజాలు తెలుసుకోవాలని అధికారులను ఆదేశించినట్లుగా డిప్యూటీ సీఎం విడుదల చేసిన లేఖలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో జూదశిబిరాలపై ఆందోళన చెందుతూ ఒక డిప్యూటీ సీఎం లేఖ రాసి, పోలీస్ అధికారులను నివేదిక కోరారంటేనే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలి. డిప్యూటీ సీఎం చెప్పిన దాన్ని డిప్యూటీ స్పీకర్ ఖండిస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భీమవరం ఎస్పీకి రాసిన లేఖలో డిఎస్పీపై ఆరోపణలు వస్తున్నాయని, జూదం, ప్రైవేటు పంచాయతీల్లో పోలీసులు జోక్యం చేసుకుంటున్నారని పలువురు తమ దృష్టికి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. సివిల్ తగాదాల్లో పోలీసులు జోక్యం చేసుకుంటున్నారనేందుకు, జూద గృహాలను పోలీసులే ప్రోత్సహిస్తున్నారనేందుకు డిప్యూటీ సీఎం రాసిన లేఖే నిదర్శనం. 'పేకాట మా ప్రాంతంలో ఊపిరి, సుప్రీంకోర్ట్ సైతం దీనిని తప్పుపట్టలేదు, పదమూడు ముక్కల ఆటలు ఆడవచ్చు' అంటూ అదే ప్రాంతానికి చెందిన డిప్యూటీ స్పీకర్ తేల్చి చెప్పారు. డిప్యూటీ సీఎం ఎవరి మీద అయితే ఆరోపణలు ఉన్నాయని చెప్పారో, ఆ అధికారి మంచి వ్యక్తి అని డిప్యూటీ స్పీకర్ కితాబు ఇచ్చినట్లుగా పత్రికల్లో వార్తలు వచ్చాయి. సిగ్గులేకుండా చంద్రబాబు క్రెడిట్ చోరీ గత ప్రభుత్వంలో వైయస్ జగన్ చేసిన కార్యక్రమాలను సిగ్గులేకుండా చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారు. ఈ క్రెడిట్ చోరీకి ఎల్లో మీడియా మద్దతు ఇస్తూ, పెద్ద ఎత్తున బాకాలు ఊదుతున్నాయి. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఆగిపోయి, రోగులు ఇబ్బందిపడుతున్నారంటే, నేను విశాఖలో గూగుల్ డేటా సెంటర తీసుకువచ్చానంటారు. హాస్టళ్ళలో విద్యార్ధులు కనీసం తాగేందుకు మంచినీరు లేక రోగాల బారిన పడుతున్నారంటే, నేను పశువులకు హాస్టళ్ళు పెడతాను అని చంద్రబాబు అంటున్నారు. అన్నిచోట్లా గంజాయి దొరుకుతోంది, యువత మత్తుకు బానిసలు అవుతున్నారని అంటుంటే, నా కొడుకు ఆస్ట్రేలియాలో తిరుగుతున్నాడు, యువతకు ఉద్యోగాలను తీసుకువస్తున్నాడని అంటున్నాడు. గ్రామాల్లో ఆర్వో ప్లాంట్ల మాదిరిగా నకిలీ మద్యం తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేసి, ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్నాని అంటుంటే, నేను దుబాయ్‌లో షేక్‌లతో పెట్టుబడులపై మాట్లాడుతున్నాను, అవి వస్తే రాష్ట్రం షేక్ అయిపోతుందని చంద్రబాబు అంటున్నాడు. ఇక చంద్రబాబుకు వంతపాడే ఈనాడు పత్రికలో 'మా రాష్ట్రం నవకల్పనల కేంద్రం' అంటూ చంద్రబాబు మాట్లాడిన మాటలను పతాక శీర్షికలతో రాశారు. అసలు నవకల్పనలు అంటే ఏమిటో చెప్పాలి. నవకల్పనలు అంటే గంజాయి, నకిలీ మద్యం, పేకాట, పందాలు, సివిల్ పంచాయతీలు... ఇవేనా? ప్రజలు అడిగేవాటికి సమాధానం చెప్పకుండా, తనకు తోచినవే వినాలనే స్థాయికి సీఎం చంద్రబాబు వచ్చేశారు. వైయస్ జగన్ హయాంలోనే ఆదానీ డేటా సెంటర్ ఒప్పందం 2020లోనే ఆనాడు సీఎంగా వైయస్ జగన్ విశాఖలో డేటా సెంటర్ పెట్టేందుకు ఆదానీతో ఒప్పందం చేసుకుంది. 3900 కిలోమీటర్ల మేర సముద్రంలో కేబుల్ లైన్ వేయాల్సి ఉన్నందున వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వంతో 2021 మార్చి 9న చర్చలు జరిపింది. 2023 మే 3న సీఎంగా వైయస్ జగన్ ఆదానీ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆదానీ డేటా సెంటర్ అనే మాట వాడకుండా, గూగుల్ డేటా సెంటర్‌ను తామే విశాఖకు తీసుకువచ్చామంటూ చంద్రబాబు పెద్ద ఎత్తున బ్రాండింగ్ చేసుకుంటున్నారు. ఇదే అంశంలో ఆదానీ సంస్థల అధినేత గౌతం ఆదానీ ఒక ట్వీట్ చేశారు. 'గూగుల్‌తో కలిసి విశాఖ లాంటి చోట ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్‌తో డేటా సెంటర్‌ను నిర్మాణం చేస్తున్నందుకు సంతోషిస్తున్నాం, దీనివల్ల ఈ ప్రాంతానికి ఎంతో మేలు జరుగుతుందంటూ' ఆయన ట్వీట్ చేశారు. చంద్రబాబుకే గొప్పతనం అంటగట్టేందుకు ఎల్లో మీడియా తంటాలు వాస్తవాలను మరుగున పరిచి, గూగుల్ డేటా సెంటర్‌ను తన ప్రతిభతోనే తెచ్చినట్లు చంద్రబాబు చెప్పుకుంటున్నారు. చంద్రబాబుకు భజన చేసే ఆంధ్రజ్యోతిలో 2022 ఫిబ్రవరి 12న 'ఆదానీ అడిగితే రూ.2 600 కోట్ల భూమిని 130 కోట్లకే వైయస్ జగన్ ఇచ్చారు', ఇది దుర్మార్గం అని ఒక వార్త రాశారు. 2025 అక్టోబర్ 14న 'అతీగతీ లేని ఆదానీ డేటా సెంటర్' అని మరో వార్త రాశారు. అంటే వైయస్ జగన్ హయాంలోనే ఆదానీ డేటాసెంటర్‌కు ఒప్పంద జరిగింది, భూములు కూడా కేటాయించారని ఆంధ్రజ్యోతి పత్రికే అంగీకరించింది. అదే ఆంధ్రజ్యోతి ఇప్పుడు వైయస్ జగన్ గారిని ఉద్దేశించి డేటా సెంటర్‌పై పిల్లిమొగ్గలు వేస్తున్నారని రాసేందుకు సిగ్గుపడాలి. ఆదానీ పేరు ఎత్తితే వైయస్ జగన్ గారికి పేరు వస్తుందని, గూగుల్ అంటూ వల్లేవేస్తున్నారు. అంతేకాదు డేటాసెంటర్‌ను వైయస్ఆర్‌సీపీ వ్యతిరేకిస్తోందంటూ ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. యువతను భ్రమల్లో పెడుతున్న నారా లోకేష్ గూగుల్ డేటా సెంటర్ వల్ల 1.88 లక్షల ఉద్యోగాలు వస్తాయని నారా లోకేష్ ప్రకటించారు. దీనిని గూగుల్ ఎక్కడా ధ్రువీకరించడం లేదు. నిజంగా ఎన్ని ఉద్యోగాలు వస్తాయో చెప్పాలి. ప్రజలను మోసం చేయవద్దు, యువతను భ్రమల్లో పెట్టవద్దని మాత్రమే కోరుతున్నాం. ప్రపంచ వ్యాప్తంగా గూగుల్‌కు ఉన్న ఉద్యోగుల సంఖ్య గత జూన్ 30వ తేదీ నాటికి 1,87,103 మంది. 2024 సంవత్సరం ఆఖరి నాటికి ఉన్న ఉద్యోగుల సంఖ్య 1,83,000 అంటే కేవలం నాలుగు లక్షల మంది మాత్రమే పెరిగారు. దీనికి మంత్రి నారా లోకేష్ చెప్పేదానికి ఎక్కడా పొంతన లేదు. విశాఖపట్నంలో స్టీల్‌ప్లాంట్, పోర్ట్, ఇతర అన్ని రంగాలు కలిపినా కూడా 2 లక్షల డైరెక్ట్ ఉద్యోగాలే ఉన్నాయి. అలాంటప్పుడు ఒక్క డేటా సెంటర్ ద్వారా ఏకంగా 1.88 లక్షల ఉద్యోగాలు వస్తాయని నారా లోకేష్ చెప్పడం మోసం కాదా? ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులతో చర్చలు జరిపే తీరిక లేదు వైయస్ జగన్ హయాంలో ఆరోగ్యశ్రీని మరింత బలోపేతం చేశారు. అదనంగా ఆరోగ్య ఆసరాను తీసుకువచ్చారు. నేడు కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తోంది. మొదటి సారి రాష్ట్ర చరిత్రలో ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులు సమ్మెలో ఉన్నాయి. ఆ ఆసుపత్రులను పిలిచి మాట్లాడే తీరిక కూటమి పెద్దలకు లేదు. రూ.3వేల కోట్ల బకాయిలు ఉంటే, రూ.250 కోట్లు రిలీజ్ చేశామని ప్రభుత్వం చెబుతోంది. అలా రిలీజ్ చేస్తే ఈ ఆసుపత్రులు ఎందుకు సమ్మె చేస్తున్నాయి? రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. పేదల ప్రాణాలతో ఈ ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది. పిహెచ్‌సీలు, సీహెచ్‌సీ వైద్యులు పోరుబాటలో ఉన్నారు. సీజనల్ వ్యాధులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. హాస్టళ్ళలో విద్యార్ధులు రోగాల బారిపడి మరణిస్తున్నారు. రాష్ట్రంలో వైద్యారోగ్యం పూర్తిగా పడకేసింది.