తిరుపతి: తాను ఆధారాలు లేకుండా ఏనాడు మాట్లాడలేదని.. తనపై వ్యక్తిగత దాడికి పాల్పడుతున్నారని వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ‘‘11.04.25న మీడియా సమావేశంలో గోశాలలో గోవులు అధికంగా మరణిస్తున్నాయని నేను మాట్లాడిన దానికి కట్టుబడి ఉన్నా’’ అని భూమన స్పష్టం చేశారు. ‘‘గోవుల పట్ల నిర్లక్ష్యంగా తగదని నేను మాట్లాడాను. పోలీస్ విచారణకు పిలిచారు. నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండ అసభ్య పదజాలంతో కూటమి నేతలు ఆరోపణలు చేస్తున్నారు. నేను వాస్తవాలు చెబితే సమాధానాలు ఇవ్వడం లేదు. వాళ్ల మీడియాలో నాపై విష ప్రచారం చేస్తున్నారు. మీ చేతిలో అధికారం ఉంది. విచారణ చేయించాలి కదా?’’ అంటూ భూమన ప్రశ్నించారు.