ఐవీఆర్ఎస్ కాల్స్‌ పై డీజీపీ కార్యాలయంలో వైయస్ఆర్‌సీపీ ఫిర్యాదు 

అక్రమ మద్యం కేసులో డైవర్షన్‌ కోసమే విష ప్రచారం

వ్యక్తిత్వ హననంకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి

ఫిర్యాదులో పేర్కొన్న వైయస్ఆర్‌సీపీ నేతలు

మంగళగిరి: నకిలీ మద్యం దందాలో అడ్డంగా దొరికిపోయి, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న కూటమి పెద్దలు కుట్రపూరితంగా ఐవీఆర్‌ఎస్ కాల్స్‌ ద్వారా వైయస్ఆర్‌సీపీ నేతలపై విష ప్రచారం నిర్వహించారని, వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళగిరి డీజీపీ కార్యాయలంలోని సైబర్ క్రైం విభాగంలో వైయస్ఆర్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్‌, వైయస్ఆర్‌సీపీ లీగ‌ల్ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు మ‌నోహ‌ర్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు, ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్య‌క్షులు దేవినేని అవినాశ్ త‌దిత‌రులతో కలిసి వెళ్ళిన మాజీ మంత్రి జోగి రమేష్ ఈ ఫిర్యాదును అందచేశారు. అనంతరం డీజీపీ కార్యాలయం వెలుపల జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ.... న‌కిలీ మ‌ద్యం దందాలో అడ్డంగా దొరికిపోయిన కూటమి ప్ర‌భుత్వాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. దీనికి సమాధానం చెప్పుకోలేక కూటమి నేతలు డైవర్షన్ పాలిటిక్స్‌కు తెగబడ్డారని మండిపడ్డారు. దీనిలో భాగంగానే ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే...
 
అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ మీద బుర‌ద జ‌ల్ల‌డ‌మే ధ్యేయంగా ఎల్లో మీడియాలో అడ్డ‌గోలుగా అబ‌ద్ధాల‌ను ప్ర‌చారం చేస్తున్నారు. "జోగి ర‌మేశ్ ఆదేశాల‌తోనే న‌కిలీ మ‌ద్యం త‌యారు చేస్తున్నార‌ని" ఆధారాలు చూపించ‌కుండా వారం రోజులుగా విష‌ప్ర‌చారం చేసి నా వ్య‌క్తిత్వ హ‌న‌నం చేస్తున్నారు. దీనిపై పార్టీ నాయ‌కుల‌తో క‌లిసి డీజీపీ కార్యాలయంలోని సైబ‌ర్ క్రైమ్ విభాగం పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం జ‌రిగింది. వైయస్ఆర్‌సీపీ మీద బుర‌ద‌జ‌ల్లడ‌మే ల‌క్ష్యంగా చేస్తున్న ఐవీఆర్ఎస్ కాల్స్ పై విచార‌ణ జ‌రిపించి దాని వెనుక ఎవ‌రున్నారో నిగ్గుతేల్చాలి. అందుకు బాధ్యులైన వారిని క‌ఠినంగా శిక్షించాల‌ని వైయస్ఆర్‌సీపీ డిమాండ్ చేస్తోంది. 

ద‌మ్ముంటే సీబీఐ విచార‌ణ చేయించాలి

నింద‌లు మోప‌డం, విష ప్ర‌చారం చేసి వ్య‌క్తిత్వ హ‌న‌నం చేయ‌డం చంద్ర‌బాబు, నారా లోకేష్‌ల‌కే సాధ్యం. చేతిలో అధికారం ఉంది క‌దా అని అన్ని వ్యవ‌స్థ‌ల‌ను అడ్డ‌గోలుగా వాడుకుంటున్నారు. లై డిటెక్ట‌ర్ టెస్ట్‌కి సిద్ధ‌మ‌ని వారం రోజులుగా చెబుతున్నా దానికి స్పందించే ధైర్యం చంద్ర‌బాబు, లోకేష్‌ల‌కి లేదు. తిరుమ‌ల‌, విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ స‌న్నిధిలో ప్ర‌మాణం చేస్తాన‌ని చెప్పినా ఆరోప‌ణ‌లు చేసిన వారు ఎందుకు భ‌య‌ప‌డిపోతున్నారు. చంద్ర‌బాబుకి ద‌మ్ముంటే న‌కిలీ మ‌ద్యం వ్య‌వ‌హారంపై సీబీఐ ద‌ర్యాప్తుకి ఆదేశించి వాస్త‌వాల‌ను నిగ్గుతేల్చాలి. టీడీపీ నాయ‌కుడు వ‌ర్ల రామ‌య్య కోరిన‌ట్టు నార్కో ఎనాలిసిస్ టెస్ట్‌కైనా నేను సిద్ధ‌మే. వ‌ర్ల రామ‌య్య‌కి ద‌మ్ముంటే దానికి చంద్ర‌బాబుతో మాట్లాడి అందుకు అవ‌స‌ర‌మైన అనుమ‌తులు తీసుకొస్తే నా నిజాయితీని నిరూపించ‌డానికి నేను ఎప్పుడూ సిద్ధమే. దేశంలోని అత్యున్న‌త స్థాయి ద‌ర్యాప్తు సంస్థ దీనితో విచార‌ణ చేయించినా అందుకు నేను సిద్ధంగా ఉన్నా.

Back to Top