‘కోటి సంతకాల సేకరణ’కు అనంతలో అనూహ్య స్పందన

పెద్ద ఎత్తున తర‌లివ‌చ్చిన విద్యార్థులు, యువ‌కులు

ప్ర‌జా ఉద్య‌మానికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శివ‌ర్గ స‌భ్యుడు జ‌గ‌దీష్‌

అనంతపురం : ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో  ‘కోటి సంతకాల సేకరణ’ కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. బుధ‌వారం ఆర్ట్స్‌ కళాశాల ఎదురుగా చేప‌ట్టిన కార్య‌క్ర‌మంలో   అనంత వెంకటరామిరెడ్డి తొలి సంత‌కం చేశారు. ప్రజా ఉద్యమానికి జిల్లా ప్ర‌జ‌ల నుంచి అనూహ్య స్పందన వ‌చ్చింది. అనంత వెంకటరామిరెడ్డి శిబిరంలో కూర్చుని ప్రజల నుంచి సంతకాలు సేకరిస్తూ మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ వ‌ల్ల క‌లిగే న‌ష్టాల‌ను వివ‌రించారు. రాజకీయాలు, పార్టీలకు అతీతంగా నాయకులు, ప్రజా సంఘాల నేతలు శిబిరానికి వ‌చ్చి సంత‌కాలు చేశారు. పెద్ద ఎత్తున విద్యార్థులు, యువత, ప్రజలు  త‌ర‌లివ‌చ్చి చంద్రబాబు వైఖరికి నిరసనగా సంతకం చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగదీష్ కూడా సంత‌కం చేసి ప్రైవేటీక‌ర‌ణ‌ను తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు.  ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలను ప్రైవేట్‌ పరం చేసే ఆలోచనను చంద్రబాబు విరమించుకోవాలని  జగదీష్  ప్ర‌భుత్వాన్ని కోరారు. 

 ఈ సంద‌ర్భంగా అనంత వెంకటరామిరెడ్డి ఏమ‌న్నారంటే..` ఏ నాయకుడి ఆలోచన అయినా ప్రజలకు మేలు చేసేలా ఉంటే దాన్ని విజన్‌ అంటారు. కానీ దురదృష్టవశాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు విజనరీ పేరుతో ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్‌పరం చేస్తున్నారు.  వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ప్రజలకు మెరుగైన వైద్యం, వైద్య విద్య అందించాలని భావించి రూ.8 వేల కోట్లతో 17 ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల నిర్మాణానికి  శ్రీకారం చుట్టారు.  వైయ‌స్‌ జగన్‌ హయాంలో కోవిడ్‌ తర్వాత ఏడు కళాశాలలు పూర్తి చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే ఐదు మెడికల్‌ కళాశాలలను అందుబాటులోకి తెచ్చాం. నిర్మాణాలు పూర్తయినా ఎన్నికల కోడ్‌తో రెండు కళాశాలలు అందుబాటులోకి రాలేదు.  

కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలను పీపీపీ పేరుతో ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఇది పేదలకు వైద్య విద్యను దూరం చేయడమే. లక్షల కోట్ల ఆదాయం వచ్చేలా చంద్రబాబు తన బంధువులు, పార్టీ వాళ్లకు కళాశాలలను హస్తగతం చేయడానికి కుట్ర చేస్తున్నారు. కూటమి నిర్ణయంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటు పేదలకు వైద్య విద్య దూరం అవుతుంది.  ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాల్సిన కళాశాలలను ప్రైవేట్‌పరం చేస్తే ప్రజలకు వైద్యం కూడా దూరం అవుతుంది.  మెడికల్‌ కళాశాలలను పిపిపి విధానంలో నిర్వాహణ చేస్తామంటే వైద్య కళాశాలల నిర్వహణ బాధ్యత నుంచి ప్రభుత్వం పరోక్షంగా వదిలించుకుని, ప్రైవేట్‌ వాళ్లకు వైద్య విద్యను అప్పగించడమే.  

చంద్రబాబు తీరు, కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.  రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలు సేకరించి వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో గవర్నర్‌ను కలిసి అందజేస్తాం. సీఎం చంద్రబాబు కుట్రలకు అడ్డుకట్ట వేసే బాధ్యతను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీసుకుంది.  ఈ ప్రజా ఉద్యమంలో మేధావులు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, యువత, రాజకీయాలకు అతీతంగా పార్టీలు పాల్గొనాలని కోరుతున్నాం.  అందరూ కలిసికట్టుగా ప్రభుత్వం మెడలు వంచుదాం` అని అనంత వెంక‌ట్రామిరెడ్డి పిలుపునిచ్చారు.

Back to Top