విశాఖపట్నం: విశాఖలో గూగుల్ సంస్థను ముందుపెట్టి డేటా సెంటర్ ఏర్పాటుకు కుదుర్చుకున్న ఒప్పందానికి సీఎం చంద్రబాబు చేసుకున్న ప్రచారం జాస్తి... దీనివల్ల యువతకు కొత్తగా వచ్చే ఉద్యోగాలు నాస్తి... అని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. విశాఖపట్నం నగర పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ ఒప్పందంలో రూ.22 వేల కోట్ల రాయితీలను ఇచ్చేందుకు ఒప్పుకున్న సీఎం చంద్రబాబు, దాని వల్ల కేవలం 200 ఉద్యోగాలు మాత్రమే వస్తాయనే నిజాన్ని ఎందుకు వెల్లడించలేక పోతున్నారని నిలదీశారు. దీనిని ప్రశ్నిస్తే మేం పెట్టుబడులకు వ్యతిరేకం అంటూ మాపై బుదరచల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో సీఎంగా వైయస్ జగన్ డేటా సెంటర్ల ఏర్పాటు వల్ల ఉద్యోగాల కల్పన స్వల్పంగా ఉంటుందని గ్రహించే, అనుబంధ కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. దానిలో భాగంగానే ఆనాడే ఆదానీతో చేసుకున్న ఒప్పందాల్లో ఏపీ ప్రయోజనాలకు పెద్ద పీట వేశారని వెల్లడించారు. ఇంకా ఆయనేమన్నారంటే... విశాఖపట్నంలో గూగుల్‌కు చెందిన సంస్థతో డేటా సెంటర్ ఏర్పాటుపై కుదుర్చుకున్న ఒప్పందంపై ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకు సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి. వాస్తవానికి ఆదానీ భాగస్వామ్యంతోనే గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఈ ఒప్పందం జరిగింది. కానీ ఉద్దేశపూర్వకంగానే ఆదానీ పేరును బయటపెట్టకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలోనే సీఎంగా వైయస్ జగన్ హయాంలోనే ఆదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు పునాది పడింది. ఈ మేరకు భూముల కేటాయింపు, అనుమతుల ప్రక్రియ కూడా పూర్తయ్యింది. ఆనాడు ఆ ఒప్పందంతో టెక్నాలజీలో భారీ పెట్టుబడులకు విశాఖను గేట్‌వే గా మార్చేందుకు సీఎంగా వైయస్ జగన్ శ్రీకారం చుట్టారు. టెక్నాలజీ అనుబంధం సంస్థలను ప్రోత్సహించడం ద్వారా భారీ ఉద్యోగ కల్పన జరగాలని కూడా సంకల్పించారు. ఒకవైపు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడం, మరోవైపు భారీగా ఉద్యోగాలను సృష్టించేందుకు చర్యలు తీసుకున్నారు. ఆదానీతో ఆనాడు చేసుకున్న ఒప్పందంలో సీఎంగా తన పాలనాదక్షతను, నేర్పును వైయస్ జగన్ చాటుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు కుదుర్చుకున్న ఒప్పందంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భారీ రాయితీలను కల్పిస్తూ, సాధించే ఉద్యోగాల విషయంలో ఎందుకు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు? ఈ ఒప్పందం ద్వారా చంద్రబాబు తన ప్రచారానికి ఇచ్చిన ప్రాధాన్యత ప్రజలకు ఇవ్వలేదని స్పష్టం అవుతోంది. ఉద్యోగాల్లేని ఒప్పందం గురించి టన్నుల కొద్దీ ప్రచారం చేసుకున్నారు. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి ప్రభుత్వ సంస్థ నిర్వీర్యం అవుతున్నా దాని గురించి పల్లెత్తు మాట మాట్లాడరు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ద్వారా వేలమంది ఉద్యోగుల పొట్ట కొడుతున్నారు. కాంట్రాక్ట్ కార్మికుల రూపేణా, వీఆర్‌ఎస్ రూపేణా వేలకొద్దీ ఉద్యోగులను రోడ్డుమీదకు తీసుకువచ్చారు. ప్రైవేటీకరణతో ఉత్తరాంధ్ర ఉపాధి ఉసురు తీస్తున్నారు. ఆ రోదనలు, వేదనలు చంద్రబాబుకు వినిపించడం లేదు. ● ప్రజలకు నిజాయితీగా వాస్తవాలు చెప్పాలి దేశ ఐటీ మినిస్టర్ అశ్వనీ వైష్ణవ్, ఆర్థిక మంత్రి నిర్మళా సీతారామన్, ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో గూగుల్ అనుబంధ సంస్థ రైడన్ తో విశాఖపట్నం కేంద్రంగా వన్ గిగా వాట్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఢిల్లీలో ఎంవోయూ చేసుకున్నారు. విశాఖపట్నంలోని నాలుగైదు లోకేషన్లలో దాదాపు పది బిలియన్ డాలర్లు (సుమారు రూ. 87వేల కోట్లతో..) ఈ రైడన్ కంపెనీ డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతున్నట్టు ఒప్పందం చేసుకున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. కంపెనీల ఏర్పాటు వల్ల స్థానిక యువతకు ఏ మేరకు లాభం ఉంటుందో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. ఆ మేరకు డేటా సెంటర్ ఏర్పాటు సందర్భంగా నిపుణుల నుంచి సేకరించిన సమాచారంతో ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం. సంస్థ ఏర్పాటు కోసం ప్రభుత్వం భారీగా భూములిచ్చి, రాయితీలిచ్చి ఇతర సహకారం అందిస్తున్న నేపథ్యంలో దీనిపై చర్చ జరగాలి. కంపెనీ ఏర్పాటు వల్ల రాష్ట్ర యువతకు వచ్చే ఉద్యోగాలతోపాటు ఆ కంపెనీ ఏర్పాటు వల్ల జనరేట్ అయ్యే రెవెన్యూ గురించి కూడా ప్రజలకు నిజాయితీగా తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ● వచ్చేది 200 ఉద్యోగాలేనని 'ఈనాడు' రాసింది మొన్న పదో తారీఖున ఎస్ఐపీబీ సమావేశం జరిగితే మరుసటి రోజున ఈనాడు పత్రికలో రాష్ట్రానికి రూ.1.14 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు రాశారు. ఈ గూగుల్ డేటా సెంటర్‌కి సంబంధించి రూ. 87,520 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ప్రపోజల్ ఇచ్చిందని చెబుతూ 200 మందికి ఉపాధి లభిస్తుందని రాశారు. 2023లో వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 200 మెగా వాట్స్ తో అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు విశాఖలో 132 ఎకరాలు కేటాయించాల్సి వచ్చినప్పుడు డేటా సెంటర్ ఏర్పాటు చేయడం వల్ల యువతకు ఉపాధి అవకాశాలు వచ్చే పరిస్థితి పెద్దగా ఉండదని దానిపై ఆరోజున కేబినెట్‌లో చర్చించాం. ఇటీవలే సిఫీ డేటా సెంటర్ ఏర్పాటుకు భూమి పూజ జరిగితే, ఆ సందర్భంగా ఆ సంస్థ అధినేత మాట్లాడుతూ డేటా సెంటర్ ఏర్పాటు వల్ల ఉద్యోగాలు రావని స్పష్టంగా చెప్పారు. ఇక్కడే కాదు, ప్రపంచంలో ఎక్కడ డేటా సెంటర్ ఏర్పాటు జరిగినా ఉపాధి కల్పన జరగదు. ఆరోజున అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చినప్పుడు దాని వల్ల యువతకు ఉపాధి దొరకదు కాబట్టి, వారికి రాయితీ కింద ఇచ్చిన స్థలంలో ఐటీ టవర్స్ కట్టి ఐటీ ఎకో సిస్టం డెవలప్ చేసి 25 వేల మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకోవాలని వారితో ఒప్పించాం. ● యువతను ఉద్దరిస్తున్నట్టు తండ్రీ కొడుకులు మార్కెటింగ్ డేటా సెంటర్ ఏర్పాటు వల్ల యువతకు ఉపాధి అవకాశాలు రావని తెలిసి కూడా గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు పేరుతో యువతను ఉద్ధరించినట్టు తండ్రీకొడుకులు నారా చంద్రబాబు, నారా లోకేష్ పెద్ద ఎత్తున ప్రచారం ఊదరగొట్టుస్తున్నారు. దీన్నొక చారిత్రాత్మక నిర్ణయంగా యువతలో భ్రమలు కలిగిస్తున్నారు. మా ప్రభుత్వం మాదిరిగా వారితో ఐటీ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు ఎందుకు ఒప్పందం చేసుకోలేక పోయారు? గతంలో మా ప్రభుత్వ హయాంలో ఇన్ఫోసిస్ ద్వారా 10 వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పాం. ముందుగా 2వేల మందితో ప్రారంభం అవుతుందని చెప్పాం. ఆ విధంగా 2 వేల మందితో ఇన్ఫోసిస్ కంపెనీ తన కార్యకలాపాలు ప్రారంభించింది. దాన్ని చూపించి టీసీఎస్‌ని రప్పించాం. గూగుల్ డెవలప్‌మెంట్ సెంటర్ వస్తే తప్ప గూగుల్ డేటా సెంటర్ వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ ఉండదు. ఆ సంస్థకు భారీగా 500 ఎకరాల భూములిచ్చి, ఇతర రాయితీలిస్తుంటే.. దానివల్ల రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉంటుందని ప్రభుత్వం ఆలోచించుకోవాలి. రైడన్ సంస్థ ఏర్పాటు చేస్తున్న ఒక గిగా వాట్ డేటా సెంటర్ నడవడానికి గంటకు ఒక మిలియన్ యూనిట్లు కావాలి. జీవీఎంసీ మొత్తానికి గంటకు కావాల్సిన విద్యుత్ ఒక మిలియన్ యూనిట్లు. అంటే, గంటకు విశాఖ నగరం మొత్తానికి ఎంతైతే విద్యుత్ వినియోగం ఉందో దానికి సమానంగా ఈ డేటా సెంటర్‌కి కూడా కావాల్సి ఉంటుంది. ఈ భారాన్ని ఎలా అధిగమించాలి అనేదానిపై ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుందో ప్రజలకు చెప్పాలి. ● రాయితీలు సరే.. రాష్ట్రానికి వచ్చే రెవెన్యూ ఎంత? గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకి భూములకు 25 శాతం రాయితీకి కేటాయిస్తున్నారు. కేపిటల్ సబ్సిడీ కింద రూ. 2200 కోట్లు ప్రభుత్వం ఇస్తోంది. ట్రాన్స్‌మిషన్ చార్జెస్, ఎలక్ట్రిసీటీ డ్యూటీ మినహాయింపు, పవర్ టారిఫ్ సబ్సిడీ కింద ఈ కంపెనీకి భారీగా రాయితీలిస్తున్నారు. కేవలం పవర్ టారిఫ్ సబ్సిడీ కింద యూనిట్ కి రూపాయి సబ్సిడీ ఇస్తున్నారు. అంటే ప్రతీ గంటకు రూ. 10 లక్షలు సబ్సిడీ ఇస్తున్నారు. రోజుకు రూ.2.40 కోట్లు ఏడాదికి దాదాపు రూ. వెయ్యి కోట్లు సబ్సిడీ ఇస్తున్నారు. ఇది కేవలం పవర్ టారిఫ్ సబ్సిడీ కింద ఇచ్చే రాయితీ మాత్రమే. ఇది కాకుండా 15 ఏళ్లపాటు ఎలక్ట్రిసీటీ డ్యూటీ మినహాయింపు ద్వారా రూ. 1200 కోట్లు, 20 ఏళ్లకు ట్రాన్స్‌మిషన్ చార్జెస్ మినహాయింపు కింద రూ.4 వేల కోట్లు ... ఇలా దాదాపు రూ.22 వేల కోట్లు సబ్సిడీ ఇస్తున్నారు. రూ. 22వేల కోట్లు సబ్సిడీ ఇస్తున్నప్పుడు ఉద్యోగ కల్పన లేకపోయినా రాష్ట్రానికి కనీసం ఆదాయమైనా సమకూరాలి కదా. కానీ అది కూడా జరగడం లేదు. డేటా సెంటర్ కోసం 5 టీఎంసీలు నీరు కావాల్సి ఉంటుంది. దాన్ని పోలవరం నుంచి ఇస్తామంటున్నారు. పోలవరం ద్వారా విశాఖ నగరం, పారిశ్రామిక అవసరాల కోసం 23.44 టీఎంసీలు నీరు కేటాయించాలని 2004లో నిర్ణయించారు. విశాఖ పారిశ్రామిక అవసరాల నుంచి మినహాయించుకుని 5 టీఎంసీల నీటిని డేటా సెంటర్‌కి కేటాయిస్తే దాన్ని ఎలా సర్దుబాటు చేస్తారో ప్రభుత్వమే చెప్పాలి. అసలు పోలవరం నీరు విశాఖకు ఎప్పుడు తీసుకొస్తారో కూడా ఇంతవరకు ప్రభుత్వం దగ్గర కనీసం క్లారిటీ కూడా లేదు. అలాంటప్పుడు డేటా సెంటర్ ఎలా నడుస్తుందని మార్కెటింగ్ చేస్తున్నారో చెప్పాలి. గతంలో ఇలాగే లూలూ గురించి ఊదరగొట్టారు. మా హయాంలో ఏ ప్రచారం లేకుండానే తీసుకొచ్చిన ఇనార్బిట్ మాల్ ఇప్పుడు ఓపెన్ కాబోతుంది. ఇది వైయస్ఆర్‌సీపీ గొప్పతనం. ఇది మా నాయకుడి విజన్. విశాఖ నగరం పట్ల మాకున్న కమిట్మెంట్.