గుంటూరు జిల్లా: దాదాపు 10 నెలలుగా అంతు చిక్కని కారణాలతో అతలాకుతలమై, పలు మరణాలు సంభవించిన గుంటూరు రూరల్ మండలం, తురకపాలెంలో పలువురు వైయస్ఆర్‌సీపీ నాయకులు పర్యటించారు. మాజీ సీఎం, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆదేశాల మేరకు తురకపాలెంలో పర్యటించిన పార్టీ నాయకులు. మరణించిన వారి కుటుంబాలను పరామర్శించారు. అనారోగ్యంతో బాధ పడుతున్న వారిని ఓదార్చి, పార్టీ పరంగా అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇదిలా ఉండగా, ఇప్పటికే గ్రామంలో వైయస్ఆర్‌సీపీ ప్రతినిధులు నాలుగుసార్లు పర్యటించి, బాధితులకు అండగా నిల్చారు. వైయస్ఆర్‌సీపీ చొరవ తర్వాతే ప్రభుత్వం కాస్త స్పందించి, మరణించిన వారిలో కొన్ని కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున సాయం చేసింది. కాగా, బుధవారం తురకపాలెంలో పర్యటించిన వైయస్ఆర్‌సీపీ నాయకులు ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ..: కోటి రూపాయల చొప్పున ఇవ్వాలి: తురకపాలెంలో అంతు చిక్కని కారణాలతో 45 మంది చనిపోతే, వారిలో కేవలం 29 మంది కుటుంబాలకే, అది కూడా కేవలం రూ.5 లక్షల చొప్పున మాత్రమే సాయం చేశారు. వారితో పాటు, మిగిలిన అన్ని కుటుంబాలకు కూడా కోటి రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేయాలి. అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్న బాధితులకు ఉచితంగా వైద్యం చేయించాలి. దీంతో పాటు గ్రామంలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం గుంటూరు నగరం నుంచి పైపులైన్ ఏర్పాటు చేయాలి. ఇంకా తురకపాలెంలో సాంఘిక బహిష్కరణ జరుగుతున్నా ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు. ఇంకా ఎవరెవరు ఏం మాట్లాడారంటే..: దళితుల ప్రాణాలకు రూ.5 లక్షలతో ఖరీదు కడతారా? :పత్తిపాడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాలసాని కిరణ్ – అంతుచిక్కని కారణాలతో తురకపాలెంలో జరుగుతున్న గ్రామస్తుల మరణాలపై ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా చలనం రావడం లేదు. 10 నెలలుగా ఈ గ్రామంలో దళితులు 45 మందికిపైగా మరణించారు. మరణించిన వారిలో ఎక్కువమంది దళితులే ఉండటం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. కానీ ఇంతవరకు మరణాలకు గల కారణాలను కనుగొనడంలో కూడా ఈ ప్రభుత్వం తీవ్రంగా వైఫల్యం చెందింది. ఆఖరుకి వైయస్ఆర్‌సీపీ డాక్టర్ల బృందం గ్రామంలో పర్యటించి మాట్లాడితే కానీ ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. గ్రామంలో పర్యటించిన స్థానిక ఎంపీ మెలిడియోసిస్ కారణంగా చనిపోతున్నారని చెప్పారు. ఆరోగ్యశాఖ మంత్రి మాత్రం కలుషిత నీరు తాగడం వలనే చనిపోతున్నారని చెప్పారు. కానీ స్థానిక ఎమ్మెల్యే మాత్రం మద్యం తాగి చనిపోతున్నారని చెప్పారు. ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యతిరేకత రావడంతో తాము ఎంచుకున్న కొన్ని బాధిత కుటుంబాలకు మాత్రమే రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇచ్చేసి చేతులు దులిపేసుకున్నారు. దళితుల ప్రాణాలకు రూ.5 లక్షలతో ఖరీదు కడుతున్నారే కానీ మరణాలకు గల కారణాలను స్పష్టంగా చెప్పడం లేదు. ఇప్పటికైనా వివక్ష చూపకుండా మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం చెల్లించి ఆదుకోవాలి. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలి. గ్రామాన్ని సాంఘిక బహిష్కరణ చేశారు : మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి – కూటమి ప్రభుత్వం వచ్చాక తురకపాలెం గ్రామంలో జరుగుతున్న వరుస మరణాలు స్థానికులను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. 10 నెలల కాలంలో 45 మంది చనిపోయినా ఈ ప్రభుత్వంలో చలనం రావడం లేదు. స్థానిక ఎంపీ ఒక డాక్టర్ అయ్యుండీ ఇంతవరకు మరణాలకు గల కారణాలను అన్వేషించడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. గ్రామస్తుల సమస్యలు వినే ఓపిక స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలకు లేదు. దీనిపై దృష్టి సారించే తీరిక చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి అసలే ఉండటం లేదు. ఇవన్నీ ప్రభుత్వ నిర్లక్షం కారణంగా జరిగిన మరణాలు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే. గుంటూరు నగరానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న తురకపాలెం గ్రామంలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు?. ఇంకోపక్క ఈ గ్రామ ప్రజలను సాంఘిక బహిష్కరణ చేస్తున్నారు. ఈ గ్రామానికి బంధువులెవరూ రావడం లేదు. ఈ గ్రామస్తుల పిల్లలతో ఎవరూ కలిసి చదువుకోవడం లేదు. ఈ గ్రామ ప్రజలు చేసిన తప్పేంటి? ఇటీవల 24 ఏళ్ల మహిళల జ్వరంతో బాధపడుతూ రెండు రోజుల్లోనే చనిపోయింది. మృతులంతా ఎక్కువగా ఎస్సీ, బీసీ కాలనీల్లో నివసించే వారు ఉండటం ఆందోళనకు గురి చేసింది. ఎస్సీ, బీసీ కాలనీలకే కలుషిత నీటి సరఫరా : మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్‌మోహన్‌రావు – తురకపాలెం గ్రామంలో మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయో ప్రభుత్వం వద్ద స్పష్టమైన సమాచారం ఉన్నా దాన్ని బహిర్గతం చేయడం లేదు. స్థానిక ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ స్వయంగా డాక్టర్. మెలియోడోసిస్ కారణంగానే మరణాలు సంభవిస్తున్నాయని ఆయన చెప్పారు. గ్రామంలో ఈ కాలనీలో మాత్రమే ఎక్కువగా మరణాలు సంభవించాయి. కలుషిత నీటి సరఫరాపై గ్రామస్తులు గతంలోనే ఒకసారి కలెక్టర్‌కి వినతిపత్రం ఇచ్చారు. గ్రామ యువకులు నీటి ట్యాంక్ ఎక్కి నిరసనకి కూడా దిగారు. అయినా ఈ కాలనీకి క్వారీ గుంతల్లో నిల్వ ఉన్న నీటినే ట్యాంకర్ ద్వారా సరఫరా చేశారు. ఇటీవలే ఒకసారి గ్రామంలో బోరు పనిచేయకపోవడంతో ఓసీలు నివసించే కాలనీకి కూడా ఇదే నీటిని సరఫరా చేయడంతో వారు కూడా అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే బోరు బాగు చేయించారు. కానీ ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు నివసించే కాలనీలకు మాత్రం క్వారీ నీటినే సరఫరా చేస్తుండటంతో ఆ కాలనీల్లోనే ఎక్కువగా మరణాలు సంభవించాయి. ఇది వివక్ష కాదా? దీనిపైన డిబేట్‌కి వైయస్ఆర్‌సీపీ సిద్ధంగా ఉంది. దళితులపై ఈ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని చెప్పడానికి ఈ తురకపాలెం మరణాలే నిదర్శనం. మంచినీళ్లు ఇవ్వమని గ్రామస్తులు ప్రాధేయపడుతున్నా ఈ ప్రభుత్వానికి అస్సలు పట్టడం లేదు. ఖచ్చితంగా ఇవి ప్రభుత్వ హత్యలే. మెలిడియోసిస్‌ని మెడికల్ టైం బాంబ్ అని కూడా అంటారు. ఇప్పుడు తగ్గిపోయినా భవిష్యత్తులో మళ్లీ రాదని చెప్పలేం. అయినా ఈ ప్రభుత్వం గ్రామంలో స్క్రీనింగ్ చేయడం లేదు. ఈ వ్యాధి పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదు. 24 గంటలపాటు పనిచేసే వైద్య శిబిరం ఏర్పాటు చేయాలి : సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి – మెలియోడోసిస్ వ్యాధి కారణంగా చనిపోతున్నారని ఎంపీ పెమ్మసాని చెబుతున్నారు. కానీ నివారణ చర్యలు తీసుకోవడం లేదు. శాంపిల్స్ తీసుకున్నామని చెబుతున్నారే కానీ రిపోర్టులు బహిర్గతం చేయడం లేదు. తురకపాలెంలో మద్యం తాగి చనిపోతున్నారని స్థానిక ఎమ్మెల్యే చెబుతున్నారు. అది కూటమి ప్రభుత్వం సరఫరా చేసే నకిలీ మద్యం కాదా? ప్రభుత్వం పారదర్శకత ఉండటం లేదు. ఎందుకు చనిపోతున్నామో కూడా తెలియని దారుణ పరిస్థితులు నెలకొని ఉంటే ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు. జ్వరం వచ్చిన వారం లోపలే మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో చనిపోతుంటే సమస్యపై దృష్టి సారించడం లేదు. ఇప్పటికీ గ్రామంలో పారిశుధ్య పరిస్థితులను చక్కబెట్టే ప్రయత్నం చేయడం లేదు. రూ.5 లక్షలిచ్చి మాకేం సంబంధం లేదన్నట్టు ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది. గ్రామానికి సురక్షితమైన తాగునీటిని సరఫరా చేయాలి. గ్రామంలో 365 రోజులు 24 గంటలపాటు వైద్యశిబిరం ఏర్పాటు చేయాలి. నెల రోజుల్లో గ్రామంలో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేస్తాం : మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి – తురకపాలెం గ్రామాన్ని సామాజిక బహిష్కరణ చేస్తుంటే కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తోంది. గుంటూరు నగరానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ గ్రామంలో వరుస మరణాలు సంభవిస్తున్నా ఇంతవరకు నారా లోకేష్ పరామర్శకు రాలేదు. కొన్ని బాధిత కుటుంబాలకు కేవలం రూ.5 లక్షలు పరిహారం ఇచ్చి చేతులు దులిపేసుకోవడం దుర్మార్గం. తక్షణం గ్రామానికి సురక్షిత మంచినీటి సరఫరా జరిపేలా శాశ్వతంగా పైపులైన్ నిర్మాణం చేపట్టాలి. వైయస్ఆర్‌సీపీ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి సూచనతో గ్రామంలో ఆర్వో ప్లాంట్‌ను నెలరోజుల్లో ఏర్పాటు చేస్తాం. పవన్ కళ్యాణ్ బాధ్యత వహించాలి : గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన మహేష్ – ఒక్క గ్రామంలో 10 నెలల్లో 45 మంది చనిపోయినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా అనిపించడం లేదు. గుంటూరుకి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న తురకపాలెం గ్రామంలో అమరావతి రాజధానిలోనే మంచినీరు తాగితే చనిపోతామన్న భయంతో ప్రజలు నివసిస్తున్న పరిస్థితులుంటే ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది? కూటమి ప్రభుత్వానికి ఓటేసిన ప్రజల్లో ఇప్పుడు పశ్చాత్తాపం కనిపిస్తోంది. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తురకపాలెం గ్రామంలో జరుగుతున్న వరుస మరణాలకు బాధ్యత వహించాలి. ఆరు నెలలుగా మరణాలు సంభవిస్తుంటే శాఖాపరంగా ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలి. ఉమ్మడి గుంటూరు జిల్లా నియోజకవర్గాల వైయస్ఆర్‌సీపీ నమన్వయకర్తలు షేక్ నూరిఫాతిమా గారు, గజ్జల సుధీర్‌భార్గవ్‌రెడ్డి, అన్నాబత్తిన శివకుమార్, షేక్ గులాంరసూల్‌తో పాటు, పార్టీ డాక్టర్స్ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ శివభార్గవ్‌రెడ్డితో పాటు, పలువురు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.