విజయవాడ: నకిలీ మద్యం కేసులో రిమాండ్‌లో ఉన్న జనార్థన్‌తో తాను చాటింగ్ చేసినట్లు సోషల్ మీడియా, ఎల్లో మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైయస్ఆర్‌సీపీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. జోగి రమేష్ తో పాటు ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, వరదు కల్యాణి, రమేష్ యాదవ్, చంద్రశేఖర్ రెడ్డి, MV రామచంద్రా రెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, TJR సుధాకర్ బాబు, ఇతర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సీపీ కార్యాలయానికి వెళ్లారు. జనార్థన్ రావుతో తనకు ఎటువంటి సంబంధం లేదని, నకిలీ మద్యం దందాలో కుట్రపూరితంగా తన పేరును వాడుతూ బురదచల్లుతున్నారని జోగి రమేష్ ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిని అడ్డం పెట్టుకుని వైయస్ఆర్‌సీపీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని, తక్షణం ఈ తప్పుడు ప్రచారాన్ని అరికట్టి, దానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఆయన వైయస్ఆర్‌సీపీ నాయకులతో కలిసి సీపీ కార్యాలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయనేమన్నారంటే... ఒక బీసీ నాయకుడిగా ఉన్న నాపైన కావాలనే ఫేక్ వార్తలను ప్రచారం చేస్తున్నారు. నకిలీ మద్యం దందాలో అరెస్ట్ అయిన జనార్థన్‌ది ఇబ్రహీంపట్నం అయినంత మాత్రాన అతడితో ఈ దందాతో నాకేం సంబంధం? జనార్థన్ వాట్సాప్ చాటింగ్ పేరుతో కొన్ని ఫేక్ సమాచారాన్ని అడ్డం పెట్టుకుని పచ్చ పత్రికలు, మీడియా చానెళ్లు నా ప్రతిష్టను, వైయస్ఆర్‌సీపీ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నాయి. నా సెల్ ఫోన్‌లను చంద్రబాబు, లోకేష్ లేదా వారు చెప్పే ఏ అధికారికి అయినా ఇవ్వడానికి సిద్దం. నాపైన బురదచల్లి, రిమాండ్‌లో ఉన్న జనార్థన్ రావుతో ఒక వీడియో బయటకు పంపి, ఒక ఫేక్ వాట్సాప్ చాటింగ్‌ను ప్రచారం చేయడం చంద్రబాబు చేస్తున్న వికృత రాజకీయ చేష్ట. నేను మీడియాతో రెండు రోజుల కిందట మాట్లాడాను. మీడియా ద్వారా ప్రజలకు కూడా చెప్పాను. నకిలీ మద్యంతో నాకు ఎటువంటి సంబంధం లేదు. లైడిటెక్టర్ పరీక్షకు సిద్దం. చంద్రబాబు, లోకేష్‌లు తాము చెబుతున్న దానిపై లైడిటెక్టర్ పరీక్షలకు సిద్దమా? నాపైన బురదచల్లుతున్న వారిద్దరు కూడా సత్యశోధన పరీక్షకు సిద్దం కావాలని కోరుతున్నాను. నాపైన డిబేట్లు పెట్టే పచ్చ పత్రికలు, వారి మీడియా కూడా నా తరుఫున వారిని అడగాలి. నకిలీ మద్యం దందాతో ప్రజల్లో టీడీపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనిని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు ఇంతగా దిగజారిపోయి రాజకీయం చేస్తున్నాడు. ఒక ముఖ్యమంత్రిగా పరిపాలన చేయడంలో ఆయన విఫలమయ్యారు. తన అధికారాన్ని ఉపయోగించి ఒక బలహీనవర్గాలకు చెందిన నాయకుడిపై కుట్రలు చేసే స్థాయికి ఆయన దిగజారిపోయాడు. అలా చేయడం ద్వారా చంద్రబాబు, లోకేష్‌ల రాక్షసానందం తీరుతుందా? నారా వారి నకిలీ సారా ఏరులై పారుతోంది, నకిలీ డిస్టిలరీలు, ఫ్యాక్టరీలు పెట్టి డోర్ డెలివరీలు చేస్తున్నారని చెబుతున్నా నాపైనే బురద చల్లుతున్నారు. ఇబ్రహీపట్నంకు చెందిన జనార్థన్‌తో నాకు ఏమైనా లావాదేవీలు ఉన్నాయా? తిరుమల వెంకన్న, బెజవాడ దుర్గమ్మ వద్దకు వస్తాను, చంద్రబాబు, లోకేష్‌లు కూడా వచ్చి నకిలీ మద్యంలో నా పైన చేసిన ఆరోపణలపై ప్రమాణం చేస్తారా? నకిలీ మద్యంపై సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు. ఇటువంటి అడ్డగోలు కేసులో నన్ను ఇరికించినందుకు ప్రజలు కూడా చంద్రబాబును చూసి అసహ్యించుకుంటున్నారు. నేను విజయవాడ నడిబొడ్డులో ఇబ్రహీంపట్నం గడ్డమీదే ఉంటాను. నేను తప్పు చేసి ఉంటే నా వద్దకు రావాలి. దేనికైనా నేను సిద్దమే. సిబీఐతో విచారణ జరిపించాలని నేనే కోరుతున్నాను. నకిలీ మద్యంపై వేసిన సిట్ లోని అధికారులు కూడా చిత్తశుద్దితో దర్యాప్తు చేయాలి. ఫేక్ గాళ్ల కుట్రలు.. లై డిటెక్టర్ టెస్టుకి రెడీ: జోగి రమేష్ నకిలీ మద్యం కేసు ప్రధాన నిందితుడు జనార్దన్‌రావుతో తనకు సంబంధాలు ఉన్నట్లు నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత జోగి రమేష్ సీఎం చంద్రబాబు నాయుడికి సవాల్ విసిరారు. ఈ విషయంలో చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన విషయం తనకు లేదని.. అయితే తీవ్ర ఆరోపణల నేపథ్యంలో లై డిటెక్టర్ పరీక్షలకు కూడా తాను సిద్ధమని అన్నారాయన. బుధవారం తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. నారావారి సారాను చంద్రబాబు ఏరులై పారిస్తున్నారు. టీడీపీ నేతలు నకిలీ మద్యాన్ని కుటీర పరిశ్రమల్లా నడిపిస్తున్నారు. టీడీపీ నేత జనార్దన్‌రావుతో నేను ఎలాంటి చాటింగ్ చేయలేదు. అది నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా తాను సిద్ధమని జోగి రమేష్ అన్నారు. తిరుమల వెంకన్న, బెజవాడ దుర్గమ్మ మీద కూడా ప్రమాణం చేస్తా. చంద్రబాబు ఇంట్లో కూడా ప్రమాణానికి నేను సిద్ధం. చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులతో ప్రమాణం చేయడానికి వస్తారా?. అవసరమైతే సత్య శోధన పరీక్ష(లై డిటెక్టర్)కు నేను సిద్ధం. నా సవాల్‌ను చంద్రబాబు స్వీకరిస్తారా? అని జోగి రమేష్ నిలదీశారు. నా ఫోన్ ఇస్తా చంద్రబాబు, లోకేష్ చెక్ చేస్కోండి. ఓ గౌడ కులస్థుడి మీద దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. నీది ఓ బతుకేనా చంద్రబాబు?నా పేరు రిమాండ్ రిపోర్టులో ఉందా?.. ఫేక్ గాళ్లు కుట్రలు చేస్తున్నారు అంటూ జోగి రమేష్ మండిపడ్డారు.