హైదరాబాద్: ఇతరులు చేసిన పనికి క్రెడిట్ తీసుకోవడం చంద్రబాబుకు మొదటి నుంచీ ఆలవాటేనని, ఓటు చోరీ తరహాలో చంద్రబాబుది క్రెడిట్ చోరీ అని వైయస్ఆర్‌సీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడూతు... అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని.. అది ఎవరి హయాంలో జరిగినా... అంతా నా వల్లే అనడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య అని మండిపడ్డారు. వైయస్.జగన్ హయాంలోనే డేటా సెంటర్ కి శ్రీకారం చుట్టామన్న ఆయన.. కేవలం డేటా సెంటర్ వల్ల గరిష్టంగా ఉద్యోగాలు రావన్న ఉద్దేశ్యంతో వాటికి అనుబంధంగా ఐటీ పరిశ్రమలు కూడా ఏర్పాటుచేయాలన్న షరతులు కూడా విధించామన్నారు. టీడీపీ, చంద్రబాబు కంటే ముందు కూడా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని గుర్తించుకోవాలని సూచించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... నేదురుమల్లి హయాంలో హైటెక్ సిటీ... ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పుట్టక ముందు, తాను ముఖ్యమంత్రి కాకముందు ఎలాంటి అభివృద్ధి జరిగిందన్న విషయాన్ని మర్చిపోయి ఎక్కడ, ఏం జరిగినా అది నేను, నా వల్లే అన్న అంటూ.. తాను ఏర్పాటు చేసుకున్న నారావారి మీడియాతో ప్రమోటే చేసుకోవడం చంద్రబాబుకు అలావాటుగా మారింది. విశాఖలో డేటా సెంటర్ గురించి మాట్లాడుతూ.. దాన్ని ఎప్పుడు మెటీరియలైజ్ చేశారు, జీవో ఎప్పుడు ఇచ్చారన్నది కూడా తెలుసుకోకుండా, గతంలో ఏం జరిగిందన్నది ప్రస్తావించకుండా అంతా నా వల్లే అన్న రీతిలో మాట్లాడుతున్నారు. 1992లో నేదురుమల్లి జనార్ధనరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైటెక్ సిటీకి శంకుస్థాపన చేశారు. అది నేను కట్టానని చంద్రబాబు చెప్పుకుంటూ వచ్చాడు. 2004 తర్వాత హైదరాబాద్ ఎంత అభివృద్ది చెందిందీ.. రాజశేఖర్ రెడ్డితో పాటు మిగిలిన నేతలు ఏ స్ధాయిలో అభివృద్ధి చేశారన్నది ఆయన ఏ రోజూ ఆలోచన చేయడు. అభివృద్ధి నిరంతర ప్రక్రియ.. అభివృద్ది అనేది ఓ నిరంతర ప్రక్రియ. 1956 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీలం సంజీవరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, దామోదర సంజీవయ్య వంటి గొప్ప వ్యక్తులు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఆ టైంలో వ్యవసాయం ప్రధానం. వాళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆ పదవి నుంచి తప్పుకున్న తర్వాత కూడా మేమేం అంతా చేశామని చెప్పుకున్న పరిస్థితి లేదు. వాళ్ల హయాంలోనే ఆంధ్రప్రదేశ్ అత్యధిక ఆహార ధాన్యాల ఉత్పత్తితో అన్నపూర్ణగా ఖ్యాతిపొందింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాణహిత, చేవెళ్ల, నెట్టెంపాడు ప్రాజెక్టులు తెలంగాణాలోనూ, ఏపీలో పోలవరం ప్రాజెక్టకు అన్ని అనుమతిలు తీసుకువచ్చారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, అవుటర్ రింగ్ రోడ్డు, పీవీ నరసింహారావు ఎక్స్ ప్రెస్ హైవే వంటివి వైయస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చారు. ఐటీని కూడా బూమ్ లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు మా నాన్న మైక్రోసాఫ్ట్ తెచ్చాడు. నేను గూగుల్ తెచ్చానని లోకేష్ మాట్లాడుతున్నాడు. ఐటీలో కర్ణాటక రాజధాని బెంగుళూరు కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ. వాస్తవానికి కర్ణాటకలో ఎస్ ఎస్ కృష్ణగారు, ఏపీలో చంద్రబాబు గారు ఒకేసారి ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఆయన నావల్లే బెంగుళూరుకు ఐటీకి వచ్చిందని చెప్పలేదు. ఇవాళ ఐటీ ఎక్స్ పోర్ట్స్ 210 బిలియన్ డాలర్లు ఉంటే అందులో బెంగుళూరు వాటా 80 బిలియన్ డాలర్లు అంటే 40 శాతం వాటా అంటే దాదారు రూ.7లక్షల కోట్లు వస్తుంది. తర్వాత హైదరాబాద్ రూ.1.3లక్షల కోట్లు ఉంది. ఎంత తేడా ఉంది. కానీ అక్కడ ఏ నాయకుడు మేమే ఐటీకి ఆద్యులనమి మాట్లాడలేదు. ఆ తర్వాత స్ధానాల్లో పుణే, చెన్నై, ముంబాయి, గుర్ గావ్ ఉన్నాయి. మరి హైదరాబాద్ కంటే ఎక్కువ కాంట్రిబ్యూషన్ చేసిన చోట్ల అక్కడ నాయకులు చంద్రబాబులా నేనే అని చెప్పుకోలేదన్న సంగతి తెలుసుకోవాలి. సీఎంగా చంద్రబాబు ఫెయిల్యూర్స్... దాదాపు 16 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనిచేశారు. ఆయన హయాం కంటే వైయస్సార్, కేసిఆర్ హయాంలోనే ఐటీ ఎగుమతులు పెరిగాయి. ఐటీ కాకుండా ఎలక్ట్రానిక్స్ లో మనమెక్కడున్నమో చూస్తే.. మనకన్నా తమిళనాడు ముందుంది. మనం కనీసం పదో స్ధానంలో కూడా లేము. ఇక మిగిలిన సర్వీస్ ఎక్స్ పోర్ట్స్ లో కూడా మనం ముందులేం. గుజరాత్ 155 మిలియన్ డాలర్లు ఉంటే, మహారాష్ట్ర 138, కర్ణాటక 113, తమిళనాడు 75 బిలియన్ డాలర్లు ఉంటే, తీర ప్రాంతం లేని తెలంగాణాలో 55 బిలియన్ డాలర్లు ఎక్స్ పోర్ట్స్ ఉంటే సుమారు వేయి కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న మన రాష్ట్రంలో 24.8 బిలియన్ డాలర్లు మాత్రమే ఉన్నాయి. ఇవన్నీ సుదీర్ఘ కాలంపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీ ఫెయిల్యూర్స్ కాదా ? రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా మీరు మఖ్యమంత్రిగా చేసి రాష్ట్రానికి ఏం చేయకుండా కాలాన్నివృధా చేశారు. వైయస్.జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా వంటి విపత్తులు వచ్చినా కూడా టీసీఎస్ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు. 2021లో ఆదానీ డేటా సెంటర్ కోసం జీవో కూడా ఇచ్చాం. కేవలం డేటా సెంటర్ పెడితే దానివల్ల ఉద్యోగాలు రావు... దీనివల్ల పెట్టుబడులు రూపంలో రూ. 10 నుంచి రూ.20 వేల కోట్లు పెట్టుబడులు కనిపిస్తున్నాయి, ఉద్యోగాలు 1000 లోపే ఉన్నాయి.కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అనేకరకాలుగా ప్రోత్సాహకాలు ఇస్తున్న నేపధ్యంలో... ఐటీ పార్క్ వంటివి అభివృద్ది చేయాలని నిబంధనలు పెట్టి ఆదాని కి ఇవ్వడం జరిగింది. వైయస్.జగన్ హయాంలోనే ఆదానీ డేటా సెంటర్... ఇవాల మీ అనుకూల మీడియా ద్వారా మొత్తం చంద్రబాబే చేస్తున్నారని చెబుతున్నారు. గూగుల్ ని ఆదాని, ఎయిర్ టెల్ భాగస్వామ్యం చేస్తున్నాయి. స్ట్రాటజికల్ లొకేషన్ లో వైజాగ్ ఉన్నందున సీ కోస్ట్ లో కేబుల్ పనులు ఎయిర్ టెల్ చూస్తుంది. ఇదంతా గతంలోనే జరిగింది. ప్రాజెక్టు 1, ప్రాజెక్టు 2 పేరుతో మధురవాడలో 130 ఎకరాలు, కాపులుప్పాడ స్థలం ఇచ్చారు. డేటా సెంటర్ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు ఎక్కువగా రావడం లేదు కాబట్టి.. గరిష్టంగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్న ఐటీ పార్క్ కూడా ఏర్పాటు చేయాలని వైయస్.జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాటికి శంకుస్థాపన చేస్తూ.. కండిషన్ కూడా పెట్టారు. ఓటు చోరీ తరహాలో చంద్రబాబు క్రెడిట్ చోరీ... కానీ చంద్రబాబు మాత్రం అంతా నేనే అని చెబుతారు. ఓటు చోరీ తరహాలో చంద్రబాబుది క్రెడిట్ చోరీ. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఇంకా నేనే ఫోన్ కనిపెట్టానని చెప్పడం విడ్డూరం. అఫ్రికా ఒకప్పుడు నాగిరికతకు దూరంగా ఉన్న ప్రాంతాలు.. నేడు అక్కడ కూడా టెక్నాలజీ అడ్వాన్స్ గా ఉంది. 90లో చైనాది, మన దేశానికి ఒకటే జీడీపీ, ఇవాళ పోలిక లేకుండా పోయింది. సౌత్ అమెరికా,ఆఫ్రికా దేశాలు కూడా టెక్నాలజీలో మనకంటే మందుకు పోతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో క్రమశిక్షణ ఎలా ఉంది, ప్రజలుఎలా కమిట్‌మెంట్ తో ఉంటారో అది అలవాడు చేసుకొండి. ప్రజలను ఆ దిశగా నడిపించాలి. అలా కాకుండా నిరంతరం తప్పుడు ప్రచారం చేయడం,ప్రతిపక్ష పార్టీలను నిర్లక్ష్యం చేయడం, వారిని అణగద్రొక్కడంతో పాటు ప్రజలకేం చేయకపోయినా బృందాలను ఏర్పాటు చేసి.. ప్రచారం చేసుకుంటూ మాఫియాలా నడిపే వ్యక్తి చంద్రబాబు. ఇది ప్రజాస్వామ్యంలో సరికాదు. నిర్దిష్టంగా ఎన్ని ఉద్యోగాలు వస్తాయని చెప్పలేని పరిస్ధితి మీది. ఆసియాలో అత్యంత పెద్ద సెజ్ శ్రీసిటీ రాజశేఖర్ రెడ్డి హయాంలో వచ్చింది. దాన్ని వైయస్.జగన్ హయంలో మరింత ముందుకు తీసుకెళ్లారు. టీసీఎస్ లాంటి పరిశ్రమలు ఆయన హయాంలోనే వచ్చాయి. పాక్షికంగా ఏదో వస్తుందని చెప్పడం కాదు. వచ్చే దాన్ని స్వాగతించాలి.. కానీ భవిష్యత్తులో ఎంత నీరు, విద్యుత్ అవసరం, దానివల్ల మన మీద ఇంపాక్ట్స్ ఏమున్నాయన్నది ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మీదే. ఎప్పటిలోగా పూర్తవుతుంది, ఎన్ని ఉద్యోగాలు వస్తాయన్నది చెప్పకుండా .. మేమే ఆద్యులం అని చెప్పుకుంటున్నారు. నిరంతరం బురద జల్లడానికే ప్రయత్నిస్తున్నారే. మేం పరిశ్రమలకు వ్యతిరేకం కాదు. మేం వైజాగ్ అయితేనే ఈ రాష్ట్రానికి ఆదాయ వనరుగా ఉంటుందని మేం చెబితే... వైజాగ్ మీద వ్యతిరేక కధనాలు రాయించారు. సునామీ వస్తుందని అంతా మునిగిపోయే చోట బిల్డింగ్ లు కడతారట అంటూ వ్యతిరేక కథనాలు రాయించారు. దుర్మార్గంగా వ్యవహరించింది మీరా ? మేమా ? మంచి ఉద్యోగాలు రావాలంటే ప్రభుత్వ స్కూళ్లలో కూడా ఫౌండేషన్ స్థాయి నుంచి విద్యలో ప్రమాణాలు ఉండాలనే ఉద్దేశ్యంతో టోఫెల్ ని ప్రవేశపెట్టడం, ఇంగ్లిషు మీడియం తో డిజిటల్ క్లాసురూములు వంటివి ఏర్పాటు చేశాం. ఈ ఆలోచన చేసింది వైయస్.జగన్ మాత్రమే. అంతే తప్ప నీలా గాలికొచ్చిన క్రెడిట్ తీసుకుని అంతా నేనే అని భ్రమింపజేసే రకం కాదు. వైయస్.జగన్ హయాంలోనే నిజమైన అభివృద్ధి... మీరే విజనరీ అని మీ అనుకూల పత్రికల్లో చెప్పుకోవడం చంద్రబాబుకు అలవాటు. కానీ ఆచరణలో చేసి చూపించిన వ్యక్తులు మాత్రం వైయస్.రాజశేఖర్ రెడ్డి, వైయస్.జగన్ మాత్రమే. ఉత్తరాంధ్రాలో మూలపేటతో పాటు, రామాయపట్నం, బందరు పోర్టులను వైయస్.జగన్ హయాంలో అభివృద్ది చేసారు. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్భరు ఉండాలని ప్లాన్ చేశారు. సుమారు 1000 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంత అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక వేశారు. దీనికి మీరు ఆద్యులా ? ఎన్నో ఏళ్ల నుంచి బందురు పోర్టు గురించి చంద్రబాబు హామీలివ్వడం తప్ప పని చేసిందేమీ లేదు. వైయస్.జగన్ హయాంలోనే ఈ పోర్టు నిర్మాణం కోసం ... నాబార్డ్ తో టై అప్ చేసి బందరు పోర్టును యుద్దప్రాతిపదిన పూర్తి చేయాలని నిర్ణయించాం. అది దాదాపు పూర్తయింది. రామాయపట్నం పోర్టులో ఒకటిరెండు నెలల్లో కార్యకలాపాలు మొదలుకానున్నాయి. ఇవన్నీ చేసింది వైయస్.జగన్ హయాంలోనే. అభివృద్ధిపై చర్చకు సిద్దం.. పేదవాడి ఆరోగ్యం కోసం 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శంకుస్థాపన చేసి, 5 మెడికల్ కాలేజీలను పూర్తి చేసిన ఘనత వైయస్.జగన్ దే. మిగిలిన కాలేజీల్లో మరో 5 తరగతులకు సిద్ధంగా ఉండగా... మిగిలినవి వివిధ దశలలో నిర్మాణంలో ఉంటే... మీరు చేసిన దుష్ప్రచారం ఏమిటి ? ఒక్క మెడికల్ కాలేజీ కూడా కట్టలేదని మాట్లాడారు. ఇదా మీ విజన్ ? పోర్టుల ఏర్పాటుకు, ఫిషింగ్ హార్భర్ల నిర్మాణానికి, 50వేల ప్రభుత్వ స్కూళ్లలో నాడు నేడు ద్వారా మౌలిక సదుపాయాలు కల్పించి సమూలు మార్పులకు శ్రీకారం చుట్టంది కేవలం వైయస్.జగన్ మాత్రమే. నియోజకవర్గ కేంద్రాల్లోని సీహెచ్ సీలలో జిల్లా కేంద్రాల్లోని జిల్లా ఆసుపత్రుల్లో జీరో వేకెన్సీ పాలసీతో సిబ్బంది కొరత లేకుండా చూసింది కూడా వైయస్.జగన్ మాత్రమే. మీరు దేని గురించి చర్చకు వచ్చినా మేం సిద్దమే. చంద్రబాబుది ప్రచార పిచ్చి... ఏ వ్యక్తి అయినా ప్రజలకు మంచి చేయాలని తపిస్తాడే తప్ప.. మీలా ప్రచార పిచ్చితో పనిచేయడు. దావోస్ లో లక్షల కోట్ల ఒప్పందాలు అని చెప్పారు. కార్యరూపంలో ఒక్కటీ కనిపించలేదు. బాధ్యతగల ప్రజా ప్రతినిధిగా ప్రజలకు మంచి జరుగుతుంది అంటే ఎంత కష్టపడ్డానికైనా సిద్దంగా ఉంటాం. కానీ చేసే పని తక్కువ ప్రచారం ఎక్కువ చేసుకుని లక్షణం మాత్రం నీదే చంద్రబాబూ. చేయని పనికి ప్రచారం చేసుకోవడం నీ లక్షణం. మా హయాంలో విధ్వంసం జరిగిందని పదే, పదే దుష్ప్రచారం చేస్తున్నావు. వాస్తవానికి ప్రజలకు ఎవరు మంచి చేశారు ? పేదవాడి ముంగిటికే అన్ని సేవలు అందాలన్న మంచి లక్ష్యంతో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా వారికి అన్ని ప్రభుత్వ సేవలు అందించింది ఎవరు? ప్రతి గ్రామంలో హెల్త్ సెంటర్ ఏర్పాటు చేసింది ఎవరు ? రైతులకు ఇబ్బందికి రాకుండా ఆర్బీకేల ద్వారా విత్తనం నుంచి విక్రయం వరకు వారిని చేయిపట్టుకుని నడిపించింది ఎవరు? ఎరువులు సైతం ప్రతి గ్రామంలోనూ రైతుకు అందుబాటులోకి తీసుకువచ్చింది ఎవరు? వ్యవస్థలను పూర్తిగా సామాన్యుడికి అందుబాటులోకి తీసుకొచ్చింది కేవలం వైయస్.జగన్ మాత్రమే. మీడియా బలంతో నెగ్గుకొస్తున్న బాబు.. నారావారి మీడియా మీకున్న ఏకైక బలం. ఆ మీడియా మేనేజిమెంట్ తోనే మీరు నెగ్గుకు వస్తున్నారు. మేం అన్ని అభివృద్ది కార్యక్రమాలకు సహకారం అందిస్తాం. అయితే డేటా సెంటర్ ఏర్పాటులో మా భాగస్వామ్యం కూడా ఉందన్నది ప్రజలకు తెలియాల్సిన బాధ్యత మా పై ఉంది. ఇవాల కేంద్రంతో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు వారందరినీ బైపాస్ చేసి అంతా తానే అని చెప్పుకుంటున్నాడు. 2014-19 మధ్యలో అధికారంలో ఉండి కూడా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి కావాల్సిన అనుమతులన్నీ చంద్రబాబు పెండింగ్ లో పెట్టి వెళ్లిపోతే... అన్ని అనుమతులు తీసుకొచ్చి దాని నిర్మాణాన్ని ఒక కొలిక్కి తెచ్చింది వైయస్.జగన్ ప్రభుత్వమే. ఆ రోజు చంద్రబాబు హైదారబాద్ తో పాటు విశాఖపట్నంలో కూడా ఐటీ కంపెనీలు పెట్టాలన్న ఆలోచన కనీసం చేయలేదు. దివంగత నేత వైయస్.రాజశేఖర్ రెడ్డి పుణ్యంతోనే విశాఖకు ఐటీ కంపెనీలు వచ్చాయి. డైవర్షన్ పాలిటిక్స్... మీ ఆధ్వర్యంలో లా అండ్ ఆర్డర్ అత్యంత అధ్వాన్నంగా ఉంది. నకిలీ మద్యం వ్యవహారంలో మీ పార్టీ నేతలే డైరెక్ట్ గా పట్టుబడి మరలా వైయస్ఆర్‌సీపీ నేతలపై బురద జల్లుతున్నారు. వివేకానంద రెడ్డి హత్య గురించి ఏం జరిగిందో ప్రజలకు పబ్లిక్ గా చెప్పండి. అంతే తప్ప ఇతరులపై బురద జల్లి కాలం ఆ సమయానికి కాలం గడిపే మాటలు వద్దు. ఊర్లలో పార్టీ హోర్డింగ్ పెడితేనే కేసులు పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుచేస్తున్న మీ పాలనలో వైయస్ఆర్‌సీపీ నేతలు నకిలీ మద్యం తయారు చేసే ధైర్యం చేస్తారా ? కేవలం మీ పై వచ్చిన ఆరోపణల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి, కుటీర పరిశ్రమ తరహాలో నకిలీ మద్యం తయారు చేసి, బెల్టు షాపుల ద్వారా ఏరులై పారిస్తున్న మీ అక్రమాలు బయటపడ్డంతోనే మా పార్టీ నేతలకు బురద అంటించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేస్తూ.. దానిపై ప్రజలు ప్రశ్నిస్తుండటంతో మరలా డైవర్షన్ రాజకీయాలు పాల్పడుతున్నారు. మీకు ధైర్యం, చిత్తుశుద్ది ఉంటే ప్రతిపక్ష పార్టీగా మేం అడిగే ప్రశ్నలకు బదులివ్వాలే తప్ప తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయవద్దు. డేటా సెంటర్ ఏర్పాటుపై అన్ని జీవోలు మా హయాంలో ఇచ్చాం. కేవలం డేటా సెంటర్ తోపాటు ఐటీ అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు వైస్.జగన్ హయాంలోనే చొరవ తీసుకున్నాం. అభివృద్ది అనేది నిరంతర ప్రక్రియ అన్న విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలి. ఇప్పటికైనా వేరొకరు చేసిన పనికి క్రెడిట్ తీసుకోవడం, వైయస్.జగన్ పై నిత్యం బురదజల్లడంతో పాటు మీ పార్టీ నేతలే తప్పు చేసి అడ్డంగా దొరికిపోయినా ఆ బురదను వైయస్ఆర్‌సీపీ నేతలకు అంటించే ప్రయత్నం చంద్రబాబు మానుకోవాలని శ్రీకాంత్ రెడ్డి సూచించారు.